హైదరాబాద్, సాక్షి: తెలంగాణ భవన్ వేదికగా బీఆర్‌ఎస్ నేతల మధ్య వర్గ విబేధాలు బయటపడ్డాయి. శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష రచ్చకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదిక మీద కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. వేదిక నుంచి దిగిపోవాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ అధిష్టానం సమీక్షలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం చేవెళ్లపై సన్నాహాక సమావేశం జరిగింది. ఆ సమయంలో రోహిత్ రెడ్డి వేదికపై ఉండడంతో మహేందర్‌రెడ్డి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రోహిత్ దిగిపోవాలని నినాదాలు చేశారు. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడబోతుండగా.. పైలట్ వర్గీయులు అడ్డుపడ్డారు. అయితే అంతలోనే లంచ్ బ్రేక్ అనౌన్స్ చేయడంతో.. ఆ పరిస్థితి మరింత ముందరకుండా ఆగిపోయింది.
ఇక.. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్లు పాల్గొన్నారు. తమ ముందే గొడవ జరగడంతో మహేందర్ రెడ్డి, పైలెట్ రోహిత్‌లను పిలిపించుకుని హరీష్ రావు మాట్లాడినట్లు తెలుస్తోంది.
అభ్యర్థిని మార్చేసి ఉండాల్సింది!
చేవెళ్ల సమీక్ష ఉద్రిక్తంగా మారడానికి పట్నం వర్గీయులు చేసిన నినాదాలే కారణం. తాండూరులో ఎమ్మెల్యేను మార్చేసి ఉంటే.. కచ్చితంగా గెలిచి ఉండే వాళ్లమని అన్నారు. ఇలాంటి సమీక్షలు పెట్టకపోవడం తోనే పార్టీ ఓటమికి కారణం అయ్యిందని.. ముందుగా ఇలాంటి సమీక్ష ఒకటి నిర్వహించి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటే వాళ్లమని అన్నారు. దీంతో.. పైలట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment