పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడింది
మా పాలనలో విజన్‌తో పట్టణాభివృద్ధి
మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ల సన్మాన కార్యక్రమంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(KTR) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడి ప్రజల ఆస్తుల విలువ భారీగా పడిపోయిందని అన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి హైడ్రా, మూసీ ప్రాజెక్టుల పేరిట కూల్చివేతలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఇటీవల పదవీ కాలం పూర్తి చేసుకున్న బీఆర్‌ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఆత్మీయ సత్కార కార్యక్రమం శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాన్ని నడిపేవారి ఆలోచనలు సానుకూలంగా ఉంటేనే రాష్ట్రం, పట్టణాలు అభివృద్ధి చెందుతాయి.
సమైక్య రాష్ట్రంలో మురికి కూపాలుగా ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టితో పనిచేయాలని బీఆర్‌ఎస్ పాలనలో దిశా నిర్దేశం చేశారు. అరి్థక ఇంజన్లుగా ఉన్న పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. చేసిన పనిని అభివృద్ధి నివేదికల రూపంలో ప్రజల ముందుంచాం. సంస్కరణలు, నిరంతర పర్యవేక్షణ, అవసరమైన నిధులు అందించడంతో పట్టణాలు అభివృద్ధి బాటలో నడిచాయి. తెలంగాణ పట్టణాలకు పది సంవత్సరాల్లో అనేక జాతీయ అవార్డులు దక్కాయి. పదేండ్లు మున్సిపల్ చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు అద్భుతంగా పనిచేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పట్టణాలతో పాటు ప్రజల ఆస్తుల విలువ కూడా పెరిగింది’అని కేటీఆర్ వివరించారు. నల్లగొండ మున్సిపాలిటీలో నాలుగు నెలలుగా సిబ్బందికి వేతనాలు లేకున్నా జిల్లా మంత్రి పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు విజయుడు, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, లింగయ్య, డాక్టర్ ఆనంద్, కోరుకంటి చందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లను కేటీఆర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment