సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహిస్తున్న పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం వేదికగా పార్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. శుక్రవారం జరిగిన చేవెళ్ల సమావేశంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మన వాళ్లే పనిచేశారని ఓడిన నా యకుడు వ్యాఖ్యానించడం కలకలం రేపింది. తాండూరు అసెంబ్లీస్థానం నుంచి ఓడిపోయిన పైలట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై సభా వేదికగానే విమర్శలు చేసినట్టు తెలుస్తోంది.
ఓడిన నేతను వేదికపై ఎలా కూర్చోబెడతారు?
సమావేశంలో పైలట్ రోహిత్‌రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడాన్ని పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులు తప్పు పట్టడంతో వివాదం రేగింది. ఓడిపోయిన నాయకున్ని స్టేజీ మీద ఎలా కూర్చోబెడతారని, రోహిత్‌రెడ్డిని కిందికి దించాలని మహేందర్‌రెడ్డి వర్గం పట్టుపట్టింది. అదే సమయంలో మహేందర్ రెడ్డి మాట్లాడేందుకు మైక్ తీసుకోగా, ఆయన వల్లనే ఓడిపోయామని పైలట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగారని సమాచారం. ఈ సమయంలోనే మహేందర్‌రెడ్డి కారణంగానే తాను ఓడినట్లు రోహి త్‌రెడ్డి వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో మహేందర్ రెడ్డి సైతం రోహిత్‌పై విమర్శలు చేసినట్లు చెబుతున్నారు.
ఓ సమయంలో సమావేశ మందిరంలో గందరగోళం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు అరుచుకుంటూ కుర్చిలు విసిరేసే వరకు వెళ్లినట్లు సమాచారం. దీంతో వేదికపై ఉన్న మాజీ మంత్రి టి. హరీశ్‌రావు జోక్యం చేసుకొని పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ సమావేశంలో గొడవ పడితే తప్పుడు సంకేతాలు వెళతాయని ఇద్దరినీ సముదాయించి వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు.
రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం: పట్నం మహేందర్ రెడ్డి
చేవెళ్ల లోక్‌సభ స్థానానికి రంజిత్‌రెడ్డి మళ్లీ పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమావేశం అనంతరం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. రంజిత్‌రెడ్డి గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేయాలని నిర్ణయించామని, మరోసారి గెలిపిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై కొందరిలో ఆవేదన ఉందని, ఇప్పుడన్నీ సమసిపోయాయన్నారు.
ఇల్లు అన్నప్పుడు ఏవో చిన్న చిన్న సమస్యలు సహజమని, అందులో భాగంగానే రోహిత్‌రెడ్డితో చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని చేవెళ్ల ఎంపీ జి. రంజిత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆరే తన బలం, చేవెళ్ల పార్లమెంట్ ప్రజలే తన బలగమన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment