వికారాబాద్ జిల్లా గులాబీ పార్టీలో రాజకీయాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలనే టెన్షన్ పెడుతున్నాయి. ఓ మాజీ మంత్రి అసంతృప్తితో రగిలిపోతూ ఎమ్మెల్యేలను ముప్పతిప్పలు పెడుతున్నారని టాక్. తెరవెనుక పావులు కదుపుతూ తమను దెబ్బతీస్తున్నారని ఆ సీనియర్ నేత గురించి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతున్న ఆ సీనియర్ ఎవరు?..
పట్నం మహేందర్ రెడ్డి తెలంగాణలో మాజీ మంత్రి.. ప్రస్తుత ఎమ్మెల్సీ. మూడు దశాబ్ధాలుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. తెర వెనక చక్రం తిప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నారు. నాలుగు సార్లు తాండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి క్యాబినెట్‌లో బెర్త్ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి మండలిలో ప్రవేశించారు. వరుసగా మూడు సార్లు తన సతీమణి పట్నం సునీతారెడ్డిని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గెలిపించుకున్నారు. తన సోదరుడు పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా, ఆ తర్వాత కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ట్రాక్ రికార్డ్ ఘనంగానే ఉన్నా.. ప్రస్తుత రాజకీయాల్లో ఎమ్మెల్యేలదే ఫైనల్ డెసిషన్ కావడంతో ఇన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో మహేందర్ రెడ్డి తనదైన శైలిలో తెరవెనక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది.
మహేందర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరులో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరు బీఆర్ఎస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. తాండూరులో ఎమ్మెల్సీ వర్గం, ఎమ్మెల్యే వర్గంగా బీఆర్ఎస్ చీలిపోయింది. ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ చాలాసార్లు రచ్చకెక్కింది. ఇక వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్‌తో కూడా మాజీ మంత్రి మహేందర్ రెడ్డికి పొసగడం లేదు. గతంలో మర్పల్లిలో పర్యటించిన జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సునీతారెడ్డిపై ఎమ్మెల్యే ఆనంద్ తన వర్గీయులతో దాడి చేయించారనే ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి మహేందర్ రెడ్డి.. ఆనంద్ మధ్య ఉప్పు నిప్పు పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల వికారాబాద్ లో ఎమ్మెల్యే ఆనంద్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆనంద్ వర్గీయులు సమావేశం దగ్గరకి వెళ్లి రచ్చ రచ్చ చేశారు. ఈ పంచాయితీ కాస్తా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్దకు చేరింది. ఇరువర్గాలకు మంత్రి ఎలాంటి భరోసా ఇస్తారనేది ఇంట్రస్టింగ్ గా మారింది.
పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి.. తనకు వ్యతిరేకంగా రోహిత్ రెడ్డి, ఆనంద్‌తో కలిసి జట్టు కట్టారని గుర్రుగా ఉన్నారు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి. పరిగిలో వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్న మనోహర్ రెడ్డిని తనవైపు తిప్పుకుని మహేంద్రుడు చక్రం తిప్పుతున్నారు. వికారాబాద్, తాండూరు, పరిగి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కునుకు లేకుండా చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో తన వ్యతిరేకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment