మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు

Published Sat, Jun 24 2023 1:00 AM | Last Updated on Sat, Jun 24 2023 1:28 PM

- - Sakshi

వికారాబాద్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అధికార పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారనే విషయం కొద్ది రోజులుగా జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఇదే అంశంపై జోరుగా చర్చ సాగింది. పట్నం తీరు సైతం ఈ అంశాలను బలపర్చేలా కనిపించడంతో పార్టీ మారుతారని చాలామంది డిసైడయ్యారు. కానీ వీరి అంచనాలను తలకిందులు చేస్తూ గురువారం శంకర్‌పల్లిలో నిర్వహించిన రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ పక్కనే కనిపించి అందరినీ ఆశ్చర్యపర్చారు. పార్టీలో తగిన గౌరవం కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ అగ్రనేతలు ఆయనకు హామీఇచ్చినట్లు తెలుస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేది మనమే.. అనవసర నిర్ణయాలు తీసుకుని ఆగం కావద్దని సూచించినట్లు తెలుస్తోంది.

గైర్హాజరుతో అనుమానాలు
పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మహేందర్‌రెడ్డి ఇటీవల సైలెంట్‌ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల మహేశ్వరంలో నిర్వహించిన సీఎం మీటింగ్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. ఎప్పుడూ ముఖ్యమంత్రి పక్కనే ఉండే ఆయన కనిపించకపోవడం ఊహాగాలకు మరింత ఆజ్యం పోసింది. మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే విషయం మీడియాలో ఫోకస్‌ కావడంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం అప్రమత్తమైంది. అతనితో సన్నిహితంగా ఉండే సెకండ్‌ క్యాడర్‌ నేతలతో పార్టీ ముఖ్యనేతలు సంప్రదింపులు జరిపారు. బీఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు ఇద్దరు రంగంలోకి దిగి పట్నంను బుజ్జగించినట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌, కేటీఆర్‌ చర్చలు
పట్నం దారెటు.. అనే విషయంలో తలెత్తిన చర్చ అధికార పార్టీని ఆలోచింపజేసింది. సీనియర్‌ నేత, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రాజకీయంగా మంచి పట్టున్న నాయకుడు కావడంతో ఆయనను వదులుకోవద్దని గులాబీ పార్టీ నిర్ణయించుకుంది. దీంతో నేరుగా రంగంలోకి దిగిన మంత్రి కేటీఆర్‌ బుధవారం రాత్రి ఆయనను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవి సఫలం కావడంతో మరుసటి రోజు శకంర్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమాల్లో మహేందర్‌రెడ్డి.. సీఎం వెంట ప్రత్యక్షమయ్యారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎంపీ రంజిత్‌రెడ్డి సమక్షంలో నేరుగా చర్చలు జరిపిన గులాబీ బాస్‌ కేసీఆర్‌.. పట్నం అలక తీర్చినట్లు సమాచారం. ఆ వెంటనే రెట్టించిన ఉత్సాహంతో మహేందర్‌రెడ్డి తాండూరులోని తన మద్దతుదారులకు ఫోన్‌ చేసి మాట్లాడినట్లు తెలిసింది. ఈసారి కూడా బీఆర్‌ఎస్‌ తాండూరు టికెట్‌ మనకే వస్తుందని ధీమా వ్యక్తంచేసినట్లు వినికిడి.

సయోధ్య కుదిరిందా..?
బీఆర్‌ఎస్‌ అధిష్టానం చొరవతో.. మహేందర్‌రెడ్డి మనసు మార్చుకున్నారా..? అనే చర్చ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లటంతో పాటు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారనే విషయం స్పష్టం కావడంతోనే.. పార్టీ నష్టపోతుందనే కారణంతో సీఎం కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగి పట్నం మనసు మార్చినట్లు తెలుస్తోంది. అయితే ఇది తాత్కాలికమా.. ఫైనలా..? అనే విషయాపై మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది. ఇదిలా ఉండగా అలక పాన్పు వేసి అనుకున్నది సాధించుకున్న పట్నం తనను నమ్ముకుని.. మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న ఆయన మద్దతుదారులను ఏం చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement