‘పార్టీలో పదేళ్లకుపైగా పని చేస్తున్నాం..అధిష్టానాన్ని నమ్ముకుని ఉన్నాం.. ఇన్ని రోజులు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం పని చేశాం.. గెలుపొందిన వారందరూ ప్రజావ్యతిరేకతనే మూటగట్టుకున్నారు.. విజయం కోసం అహర్నిశలు కష్టపడిన మమ్మల్ని అధాఃపాతాళానికి తొక్కుతున్నారు. పక్క పార్టీలనుంచి వచ్చిన వారిని అందలమెక్కిస్తున్నారు.. అందుకే ఈసారి మాకు ఒక్క చాన్స్ ఇవ్వాలని’ ఆశావహులు బీఆర్‌ఎస్ అధిష్టానానికి కోరుతున్నారు. మళ్లీ వారికే టికెట్లు ఇస్తే ఓడించి తీరుతామని తేల్చి చెబుతుండటం గమనార్హం.
వికారాబాద్: బీఆర్‌ఎస్‌లో ఆశావహులు టికెట్ల కోసం గట్టి పట్టుపడుతున్నారు. టికెట్లు రాకుంటే పార్టీని వీడేందుకు సైతం వెనుకాడమని సన్నిహితులతో స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సన్నిహితులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో జిల్లా మంత్రికి నేవేదించారు. ఇటీవల ఆశావహు నేతలందరూ ధారూరు మండల పరిధిలో సమావేశం ఏర్పాటు చేయడంపై జిల్లాలో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్‌ఎస్‌లో వర్గపోరు తగ్గుతుందనుకుంటే మరింత తారా స్థాయికి చేరడం గమనార్హం. అయితే పార్టీ గెలుపు కోసం కృషిచేసిన అసమ్మతి (ఆశావహులు) నేతలను ఒకేతాటిపైకి తేవడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు కేటాయించటంలో, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంలో వివక్ష చూపిస్తున్నందునే దూరం పెరుగుతుందనే వాదన ఉంది.
పరిగి నుంచి మనోహర్‌రెడ్డి..
బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. గతంలోనూ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆయన మహేశ్‌రెడ్డికి టికెట్ ఇవ్వటంతో వారితో కలిసి పనిచేశారు. డీసీసీబీ చైర్మన్ అవకాశం రావటంతో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సైతం సహకరించారు. ఏడాదికాలంగా ఆయన నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్ నాయకులతో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు.. ఆ వర్గం పూర్తి గా ఎమ్మెల్యేకు దూరం కావడంతో పాటు ఆయన నిర్వహించే కార్యక్రమాల్లో సైతం పాల్గొనడంలేదు. ఇటు నియోజకవర్గంలో బలం పెంచుకుంటూనే అధిష్టానంతో సైతం దగ్గరవుతూ వచ్చారు. ఈ సారి తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని అడుగుతున్నారు. టికెట్ నాకే వస్తుందని ప్రచారం కూడా చేసుకుంటున్నారు. టికెట్ ఇవ్వకుంటే తన వర్గంనేతలతో కలిసి పార్టీని వీడటంగాని, రెబల్‌గా అయినా సరే ఎమ్మెల్యేగా బరిలో ఉంటాననే సంకేతాలిస్తున్నారు.
కొడంగల్‌లోనూ..
కొడంగల్ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ టికెట్ ఆశించి నిరాశచెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి ఏడాదిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆరు నెలలుగా తనకు లేదా తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దలను అడుగుతూ వస్తున్నారు. మాట్లాడదాం అంటూ చెప్పిన అధిష్టానం నాన్చు తూ వస్తోంది. దీంతో ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. తన కుమారులతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం లాంఛనమే..
వికారాబాద్‌లో..
వికారాబాద్‌లోనూ స్థానిక ఎమ్మెల్యే ఆనంద్‌కు వ్యతిరేకంగా నేతలు టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. ప్రస్తుత జెడ్పీ వైస్‌చైర్మన్ విజయ్‌కుమార్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ అధిష్టానంతో సైతం మంచి సంబంధాలున్నాయి. ఇక వడ్ల నందు సైతం ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉంటూ సేవలందిస్తున్నారు. మరో నాయకుడు బూమన్నొల్ల కృష్ణ సైతం టికెట్ రేసులో ఉన్నారు. ఇతను వామపక్ష పార్టీల్లో కొనసాగుతూ ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పార్టీలోకి వచ్చి పార్టీకి సేవలందిస్తున్నారు. వీరు ఇటీవల ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ వర్గాన్ని తయారు చేసుకుని తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సైతం మరోసారి టికెట్ ఆశిస్తూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
తాండూరులో శుభప్రద్‌పటేల్..
తెలంగాణ ఉద్యమ సమయంలో శుభప్రద్‌పటేల్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్‌గా ఉంటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంలో తనవంతు కృషి చేశారు. ఆ సమయంలో ఆయనపై అనేక కేసులు సైతం నమోదయ్యాయి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏ పదవి దక్కలేదు. ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘకాలం ఎదరు చూసిన ఆయనకు గతేడాది కేసీఆర్ బీసీ కమిషన్ మెంబర్‌గా నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. అయితే తాండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తూ వస్తున్న ఆయన ఆరు నెలలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం టికెట్ ఆశిస్తున్న ఇద్దరు ముఖ్యుల సామాజిక వర్గం ఓట్ల కంటే తమ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నీతిబాహ్యమైన రాజకీయాలతో తాండూరు ప్రజలు విసిగి పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బీసీ అయిన తనకు టికెట్ కేటాయిస్తే పార్టీని మరోమారు గెలుపు తీరాలకు చేరుస్తానని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment