మహేందర్‌రెడ్డి అనుచరులపై బీఆర్‌ఎస్‌ నజర్‌... పట్నం వైపు వెళ్లేదెవరు? | - | Sakshi
Sakshi News home page

మహేందర్‌రెడ్డి అనుచరులపై బీఆర్‌ఎస్‌ నజర్‌... పట్నం వైపు వెళ్లేదెవరు?

Published Wed, Jun 21 2023 3:30 AM | Last Updated on Wed, Jun 21 2023 1:23 PM

- - Sakshi

వికారాబాద్‌: మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో పార్టీ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పట్నం అనుచరగణంపై ఫోకస్‌ పెట్టారు. ఒకవేళ ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్తే అతనితో నడిచేదెవరు..? బీఆర్‌ఎస్‌లో కొనసాగేదెవరు..? అనే విషయంపై దృష్టిసారించారు. మహేందర్‌రెడ్డి అనుచరులతో పాటు జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలపై అసంతృప్తిగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, పార్టీలోని ఇతర ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగింపుల పర్వానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పట్నం ఎటువైపు వెళ్లినా ఆయన బాటలో నడిచేందుకు చాలామంది మద్దతుదారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో పొసగక పట్నంతో జట్టు కట్టాము కానీ.. పార్టీ వీడే పరిస్థితి ఏర్పడితే తాము గులాబీ జెండా నీడలోనే ఉంటామని మరికొంతమందిచెబుతున్నారు.

చేతులెత్తేసిన మంత్రి, ఎంపీ
ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా పట్నం పయనమెటు..? అనే విషయంపైనే ప్రధాన చర్చ జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మహేందర్‌రెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టుంది. ఆయన కాంగ్రెస్‌లోకి వెళితే పలువురు కీలక నేతలు సైతం ఆయన బాటలోనే నడుస్తారని అధిష్టానానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్‌... ప్రతిపక్ష కాంగ్రెస్‌ నువ్వా.. నేనా అనే తరహాలో పోటీ పడుతుండగా పట్నం వెళ్లిపోతే నష్టం తప్పదని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

ఇదే జరిగితే రాష్ట్ర రాజధానికి అనుకుని ఉన్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్‌కు బలం పెరిగి.. రాష్ట్ర వ్యా ప్తంగా ప్రభావం చూపుతుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయాయి. చాన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలను సైతం ఇరువర్గాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నాయి. వీరిని ఒక్కతాటిపైకి తెచ్చే విషయంలో జిల్లా మంత్రి, ఎంపీ సహా ముఖ్యనేతలందరూ ఎప్పుడో చేతులెత్తేశారు. ఇక ఈ వ్యవహారంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఫోన్లు చేసి బుజ్జగింపు
అసంతృప్త నాయకులను బుజ్జగించేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఎమ్మెల్సీ నవీన్‌రావ్‌, మంత్రి హరీశ్‌రావ్‌ తదితర ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. నయానో... భయానో వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులుగా ఈ తతంగం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నతో కలిసి వెళితే ఎలా నిలువరించాలనే వ్యూహంలో భాగంగానే ముందుగానే అతని భవిష్యత్తుపై స్పష్టమైన హామీ ఇవ్వడంతో.. తాను ఎట్టిపరిస్థితిలోనూ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి అతనిపై వేసిన కోర్టు రెఫరల్‌ కేసు విషయంలోనూ కొందరు పార్టీ పెద్దల ప్రమేయం ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల మాజీ ఎమ్మెల్యే కేస్‌ రత్నం, డీసీసీబీ చైర్మన్‌ మనోహర్‌రెడ్డి తదితరులను సైతం రప్పించుకుని, ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నట్లు వినికిడి. మహేందర్‌రెడ్డితో సైతం కేటీఆర్‌ చర్చించినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు, వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు విషయంలో తనకు స్పష్టమైన హామీ ఇస్తేనే పార్టీలో కొనసాగుతానని పట్నం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement