పరిగి: తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా రాష్ట్ర అభ్యున్నతి కోసం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని డీసీసీ అధ్యక్షుడు టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది దగా నిరసనలో సీఎం కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాతకేసీఆర్ అబద్ధపు హామీలు ఇస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏం ఘనతలు సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు.
మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఉత్సవాల పేరిట.. ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే.. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండలాల అధ్యక్షులు పరశురాంరెడ్డి, ఆంజనేయులు, సురేందర్, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హామీలను విస్మరించిన కేసీఆర్
అనంతగిరి: కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అంతా దగానే అని, హామీలు నెరవేర్చని ఈ ఉత్సవాలు ఎందుకని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపుమేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం పది తలల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్.. ప్రజాధనాన్ని పార్టీ ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. వేడుకల నిర్వహణలో ప్రోటోకాల్ పాటించలేదని, తాజా, మాజీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కలేదని ధ్వజమెత్తారు.
ముఖ్యంగా రేషన్ కార్డుల జారీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, జిల్లా సీనియర్ నాయకులు కమల్ రెడ్డి, రత్నారెడ్డి, అయూబ్ అన్సారి, భాస్కర్ రెడ్డి, రవీందర్ మురళి, వేణుగోపాల్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment