DCC prasident
-
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే
పరిగి: తెలంగాణ ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా రాష్ట్ర అభ్యున్నతి కోసం.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని డీసీసీ అధ్యక్షుడు టి. రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో గురువారం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది దగా నిరసనలో సీఎం కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఆర్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాతకేసీఆర్ అబద్ధపు హామీలు ఇస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏం ఘనతలు సాధించారని దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటున్నారని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని విమర్శించారు. ఉత్సవాల పేరిట.. ప్రజలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే.. ప్రజా సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు లాల్‌కృష్ణ, పట్టణ అధ్యక్షుడు ఎర్రగడ్డపల్లి కృష్ణ, మండలాల అధ్యక్షులు పరశురాంరెడ్డి, ఆంజనేయులు, సురేందర్, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హామీలను విస్మరించిన కేసీఆర్ అనంతగిరి: కేసీఆర్ తొమ్మిదేళ్ల పాలన అంతా దగానే అని, హామీలు నెరవేర్చని ఈ ఉత్సవాలు ఎందుకని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర అధిష్టానం పిలుపుమేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ చౌరస్తాలో సీఎం పది తలల దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్ఎస్.. ప్రజాధనాన్ని పార్టీ ప్రచార కార్యక్రమాలకు వినియోగిస్తుందని ఆరోపించారు. వేడుకల నిర్వహణలో ప్రోటోకాల్ పాటించలేదని, తాజా, మాజీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం దక్కలేదని ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేషన్ కార్డుల జారీని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ, పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, జిల్లా సీనియర్ నాయకులు కమల్ రెడ్డి, రత్నారెడ్డి, అయూబ్ అన్సారి, భాస్కర్ రెడ్డి, రవీందర్ మురళి, వేణుగోపాల్ రెడ్డి, రెడ్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌ది తప్పు.. ఉత్తమ్‌కే అధికారం
జనగామ: హుజూర్నగర్ ఉప ఎన్నికలో భాగంగా రేవంత్‌రెడ్డి తన అభ్యర్థిని ప్రకటించుకోవడమే కాకుండా పత్రికలకు ఎక్కడం పద్ధతి కాదని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యే, రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఒకసారి ఎంపీగా పోటీ చేసి, పీసీసీ అధ్యక్షు డిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి స్టేట్‌వర్కింగ్ ప్రసిడెంట్ హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి వేలెత్తి చూపించడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీగా పనిచేసిన ఆయనకు సొంత నియోజకవర్గంలో నిర్ణయం తీసుకునే అధికారం ఉందని చెప్పారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరూ పార్టీ ప్రతిష్టను ఇనుమడింపజేసుకునే విధంగా ఉండాలే తప్ప... బహిరంగంగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. కాగా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పడం లేదన్నారు. విద్య, వైద్య, మిషన్‌భగీరథ, రైతుబంధు ఇలా అనేక హామీలను బుట్టదాఖలు చేస్తూ.. ప్రజలను అయోమయానికి గురి చేసే కార్యక్రమాలను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష రుణమాఫి ఎక్కడ పోయిందన్నారు. ప్రజలు విషజ్వరాలతో అవస్థలు పడుతుంటే సరైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం హామీల అమలుకు కార్యరూపం దాల్చడం లేదన్నారు. రైతుబంధు పథకాన్ని 5 ఎకరాలోపు ఉన్న రైతులకు ఇస్తామని ఓ మంత్రి అంటుంటే.. మరో మంత్రి అదేమీ లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వందలాదిమంది ప్రాణత్యాగం చేసి..తెలంగాణ సాధించుకుంటే.. కల్వకుంట్ల కుటుంబం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో డీసీసీ వైస్ చైర్మన్ జగదీశ్వర్‌రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ నాయక్, రఘునాథపల్లి ఎంపీపీ మేకల వలరక్ష్మి, సర్పంచ్‌లు మాసపేట రవీందర్‌రెడ్డి, రమేష్, మాజీ జెడ్పీటీసీ నల్ల అండాలుశ్రీరామ్, నాయకులు ఎల్లన్న ఉన్నారు. -
మా‘నీరు’ దోపిడీకి కుట్ర
కరీంనగర్ అర్బన్ : మధ్యమానేరు నీటిని దోపిడీ చేసేందుకే సీఎం కేసీఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కుట్రపూరితంగా ప్రాజెక్టును నింపారని డీసీసీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం ఆరోపించారు. కరీంనగర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కొదురుపాక, రుద్రవరం, చీర్లవంచ, నీలోజిపల్లి గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మిషన్‌భగీరథ పేరిట సిద్దిపేట, మల్లన్నసాగర్‌కు నీటిని తీసుకెళ్లేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుకు తూంలు లేవని తెలిసి కూడా ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోపై అంచనా లేకుండా ప్రాజెక్టును నింపేందుకు ఎలా సాహసించారని ఆయన ప్రశ్నించారు. దీంతో నాలుగు గ్రామాలు ముంపునకు గురై నిర్వాసితులంతా రోడ్లపైకి వచ్చారన్నారు. వెంటనే నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, 18 ఏళ్లు నిండిన యువతకు రూ.2.35 లక్షలు చెల్లించాలని, రూ.50 వేల రవాణా చార్జీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట, హుస్నాబాద్, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ నాయకులు మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.