చర్చకు దారితీసినహత్యాయత్నం ఫిర్యాదు
క్రమశిక్షణ సంఘం దృష్టికి జనగామ వ్యవహారం
రెండు వర్గాలుగా విడిపోయిన నాయకత్వం
ముదురుతున్న ‘మార్కెట్’ వ్యవహారం
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది.
కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
రెండు వర్గాలుగా విడిపోయి..
పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది.
హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.
ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..
కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment