తాండూరు: ఈసారి అధికార బీఆర్‌ఎస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీల నాయకులు జోరుగా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. జిల్లాలోని మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లతో పోలిస్తే తాండూరులో పరిస్థితి ఎప్పుడూ కొంత భిన్నంగా ఉంటుంది.
ఇటీవలికాలంలో నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణమైంది. జిల్లా నేతలు మొదలుకుని గ్రామస్థాయి కార్యకర్తల వరకు కండువాలు మార్చేస్తున్నారు. అయితే అధికార పార్టీ టికెట్ ఎవరికి వస్తుందోననే టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. టికెట్ రాని వారు పార్టీ మారే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది.
కాంగ్రెస్‌కు కంచుకోట
తాండూరు అసెంబ్లీ స్థానం గతం నుంచి కాంగ్రెస్‌కు కంచుకోట. ఈ విషయం దేశ రాజధాని ఢిల్లీలో ఉండే ఆ పార్టీ పెద్దల వరకూ తెలుసు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో పదిసార్లు కాంగ్రెస్, మూడు సార్లు టీడీపీ, ఒకసారి టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్ గాలి వీచినా తాండూరులో హస్తం పార్టీయే జయకేతనం ఎగురవేసింది.
వర్గపోరుతోనూ పెరిగిన బలం
గడిచిన మూడేళ్లలో ఇక్కడ బీఆర్‌ఎస్ అత్యంత శక్తిమంతంగా ఎదిగింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఎవరికి వారే తమ కేడర్‌ను పెంచుకున్నప్పటికీ సంస్థాగతంగా పార్టీ మాత్రం బలపడింది. రెండు నెలలుగా రోహిత్‌రెడ్డి జనంలోనే ఉంటున్నారు. ప్రతీ మండలంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి కేడర్, ప్రజల దృష్టిని ఆకర్షించారు. మరోవైపు ఇటీవలే తాండూరులో నిర్వహించిన గృహ ప్రవేశ వేడుకకు వేలాది మంది బంధుమిత్రులు, అభిమానులు కార్యకర్తలతో బలగం చూపించుకున్నారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ వర్గం దూరంగా ఉంది.
ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సైతం నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. శుభ, అశుభ కార్యాల్లో పాల్గొంటూ నేనున్నానని కేడర్‌కు ధైర్యం అందిస్తున్నారు. పీఎమ్మార్ పేరుతో టోర్నమెంట్లు ఏర్పాటు చేసి కొడుకు రినీష్‌రెడ్డిని రంగంలోకి దింపారు. తనయుడి ద్వారా యువతను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. అయితే వికారాబాద్‌కు చెందిన ఉద్యమకారుడు, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ సైతం తాండూరుపై దృష్టిసారించారు. పట్టణంలో సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఒక్క చాన్స్ ప్లీజ్..
తాండూరు నియోజకవర్గంలో మహరాజుల కుటుంబానికి దశాబ్దాలుగా మంచి పేరుంది. ఏడు పర్యాయాలు ఈ ఇంటికి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈఒక్కసారి తనకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, పీసీసీ మెంబర్ రమేశ్‌మహరాజ్ ప్రజలను అభ్యర్థిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుతున్నారు. అయితే రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
చాపకింద నీరులా కమలం
ప్రభుత్వం వైఫల్యాలపై గొంతెత్తుతున్న కమలనాథులు జనంలోని వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తాండూరు అసెంబ్లీ టికెట్ కోసం ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వీరిలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్‌కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణగౌడ్, మాజీ మంత్రి చందుమహరాజ్ తనయుడు నరేశ్‌మహరాజ్ టికెట్ ఆశిస్తున్నారు.
అధిష్టానం ఎవరికి అవకాశం కల్పించినా సమష్టిగా పనిచేసి గెలవాలనే దిశగా సాగుతున్నారు. ఎలాంటి హడావుడి లేకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ చాపకింద నీరులా క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసుకుంటున్నారు. దేశంలో ఎలాంటి స్కాంలకు అవకాశం లేకుండా పారదర్శకమైన పాలన అందిస్తున్న మోదీ సర్కారుకు మద్దతు పలకాలని కోరుతున్నారు.
తాండూరులో రాజకీయం వేడెక్కుతోంది. ఎలక్షన్ కమిషన్ ఈనెల 2న ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది జనవరి 16లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్టయ్యాయి. దీంతో ఎక్కడ చూసినా రాజకీయ సందడి కనిపిస్తోంది.ఏ నోట విన్నా పొలిటికల్ చర్చ వినిపిస్తోంది. మరోవైపు ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వం మొదలుపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment