వికారాబాద్: జిల్లా ఎమ్మెల్యేల వెన్నులో వణుకు మొదలైంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఆగ్రహమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అధినేత మండిపాటు వెనక వీరి వ్యవహారాలు సైతం ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దళితబంధు లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలు, వారి అనుచురులు డబ్బులు వసూలు చేస్తున్నారని కేసీఆర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీంతో వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేలు, వీరి అనుచరులు భయంలో పడ్డారు. ఈ అంశాన్ని ఎమ్మెల్యేల వైరి వర్గీయులు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికై నా గులాబీ బాస్ వాస్తవాలను గుర్తించారని ప్రచారం చేస్తున్నారు. దళితబంధు లబ్ధిదారుల నుంచి రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎక్కువ వసూళ్లకు పాల్పడ్డారనే ప్రచారం సాగుతోంది.
ఇంటెలిజెన్స్ రిపోర్ట్
నగరంలో గత గురువారం నిర్వహించిన ప్లీనరీకి ముందే సీఎం కేసీఆర్.. ఇంటెలిజెన్స్ ద్వారాఅన్ని జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మన జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కూడా ఆరా తీసినట్లు తెలిసింది. దళితబంధు అందజేతలో నేతల చేతివాటాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీలోని అసమ్మతి నేతలు సైతం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మండిపడిన విషయాలు తెలిసిందే. జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత సైతం ఈ మాటలన్నీ సీఎం చెవిలో వేశారనే ప్రచారం సాగుతోంది.
డబ్బులిచ్చిన వారికే ‘బంధు’
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకంలో కొంతమంది ఎమ్మెల్యేలు కక్కుర్తి వ్యవహారాలు చేస్తున్నారనేది బహిరంగరహస్యమే. వీరు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలిసిందే. ఈ విషయమై జిల్లాలో గతంలోనే అనేక ఆరోపణలు వచ్చాయి. పథకం అందాలంటే ముందుగా రూ.3 లక్షలు చెల్లించాలని అనధికారిక నిబంధన పెట్టడంతో చేసేది లేక అప్పులు చేసి ఇచ్చారు. ఈ నేపథ్యంలో డబ్బులు ఇచ్చిన వారికే దళితబంధు అందగా..అసలైన అర్హుల పేర్లు మరుగున పడ్డాయి. ఇలా వసూలు చేసిన డబ్బులను అధికార పార్టీ నేతల వద్ద పెట్టిన ఎమ్మెల్యేలు.. వీటిని ఎన్నికల్లో ఖర్చు చేద్దాంలే అని చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నిచోట్లా అసమ్మతి
ఇదిలా ఉండగా పార్టీ ప్రతిష్ట దిగజారకుండా ప్రతిఒక్కరూ హుందాగా వ్యవహరించాలని అధినేత దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని పోయేందుకు అవసరమైతే ఓ మెట్టు దిగాలని సూచించారు. టికెట్లు ఎవరికి ఇవ్వాలో తనకు తెలుసని.. నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయితీ వినిపించొద్దని గట్టిగా హెచ్చరించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలన్నింటిలోనూ మన జిల్లా నేతలు ముందు వరుసలో ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అసమ్మతి పెరిగిపోతోంది. టికెట్టు నాకంటే.. నాకే అని నేతలు బహిరంగంగా చెబుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా వీరి తీరు మారుతుందా..? లేదా అనేది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment