ఆ మంత్రులను ప్రశ్నించండి..
- పాత్రికేయుడు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్
- నేడు ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ
సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, సి.ఆదినారాయణరెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డిలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మంత్రులుగా ఈ నలుగురి నియామకం రాజ్యాంగ విరుద్ధమని, ఏ అర్హతతో కొనసాగుతున్నారో వారిని వివరణ కోరాలని హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు తంగెళ్ల శివప్రసాద్‌రెడ్డి వేర్వేరుగా నాలుగు కో వారెంట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఫిరాయించిన అఖిలప్రియ, సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారని, ఎవరిని మంత్రిని చేయాలన్నది ముఖ్యమంత్రి విచక్షణాధికారమని పిటిషనర్ తెలిపారు. అయితే రాజ్యాంగం ఓ వ్యక్తిని మంత్రిని కాకుండా నిషేధించినప్పుడు ఆ వ్యక్తిని మంత్రిగా నియమించే విషయంలో సీఎం సలహాను గవర్నర్ పాటిం చాల్సిన అవసరం లేదన్నారు. గవర్నరే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేశారని, అటువంటి వ్యక్తి రాజ్యాంగం నిషేధించిన వ్యక్తి చేత మంత్రిగా ప్రమాణం చేయించడం రాజ్యాంగ విరుదమనీ, పదవ షెడ్యూల్ పేరా (2) ప్రకారం ఈ నలుగురూ చట్టసభలో కొనసాగడానికి వీల్లేదని వివరించారు. ఈ వ్యాజ్యాలు తేలేంత వరకు ఆ నలుగురిని మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించకుండా నిరోధించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ వ్యాజ్యాలపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుంది.