Tantric sacrifice
-
బురారీ ఆత్మహత్యల కేసు; ఊహించని ట్విస్ట్
ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు. సాక్షి, న్యూఢిల్లీ: బురారీ సామూహిక ఆత్మహత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్ట్ మార్టం నివేదికను కూడా మృతుల బంధువులు తప్పుబడుతుండటం గమనార్హం. ‘వాళ్లంతా (భాటియా కుటుంబ సభ్యులు) బాగా చదువుకున్న వాళ్లు. దెయ్యాలు-చేతబడులను నమ్మటం ఏంటి?.. పైగా గతంలో కూడా వాళ్లు ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు మేం ఎప్పుడూ చూడలేదు. వాళ్లకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవు. అప్పులుగానీ, లోనులు గానీ లేవు. అన్నీ బాగున్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటి?. నోటికి ప్లాస్టర్లు, చేతులు కట్టేసి ఎలా సూసైడ్‌కు పాల్పడతారు? వాళ్లకు శత్రువులంటూ ఎవరూ లేరు. కానీ, ఖచ్ఛితంగా ఎవరో చంపే ఉంటారని మాకు అనిపిస్తోంది’ అని కేథన్ నాగ్‌పాల్ అనే బంధువు చెబుతున్నారు. ఆరోజు రాత్రి... భాటియా కుటుంబం మూకుమ్మడిగా విగతజీవులుగా మారటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకు ముందు రోజు దాకా నవ్వుతూ కనిపించిన వాళ్లు.. ప్రాణాలతో లేరన్న విషయం తెలియగానే బోరున విలపించారు. ‘శనివారం రాత్రి దాకా శివం, ధృవ్‌లు(ఆ ఇంటి పిల్లలు) నాతోనే నవ్వుతూ ఆడుకున్నారు. తర్వాత వాళ్ల ఇంట్లోంచి పిలుపు రావటంతో భోజనానికి పరుగులు తీశాడు. ఆ సమయంలో వాళ్ల కుటుంబ సభ్యులు నలుగురు ఇంటి బయటే నవ్వుతూ సంతోషకంగా కనిపించారు. అంతా మాములుగానే ఉంది’ అని స్థానికంగా ఉన్న ఓ బాలుడు చెబుతున్నాడు. విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు... అయితే ఆ ఇంట్లో గతంలో పని చేసిన మానేసిన ఓ మహిళ మాత్రం ఆసక్తికర విషయాలను మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితం తాను ఆ ఇంట్లో పని చేశానని, ఆ కుటుంబం అంతా చాలా సందర్భాల్లో చాలా విచిత్రంగా ప్రవర్తించేందని.. ముఖ్యంగా ఆ ఇంట్లోని మహిళలు ఆలయాలకు వెళ్లినప్పుడు పూనకంతో ఊగిపోయేవారని... సదరు మహిళ తెలిపారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పూజలు నిర్వహించి, స్వామీజీలను ఆహ్వానించేవారని, స్వామీజీలు చెప్పే విషయాలను బాగా నమ్మి తూచా తప్పకుండా పాటించేవారని ఆమె వివరించారు. కీలకం కానున్న నోట్ బుక్?.. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘2017 నుంచి రాతలు రాసినట్లు ఉన్నాయి. గత నెల 27(జూన్)న ఎలా చనిపోవాలో.. అన్న విషయం కూడా అందులో రాసి ఉంది. అయితే దీనిని సూసైడ్ నోట్‌గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక కూడా ఆత్మహత్య అనే చెబుతోంది. అలాగని క్షుద్ర పూజల ప్రభావంతోనే వాళ్లంతా చనిపోయి ఉంటారని మేం నిర్ధారించలేం. రాతను కుటుంబ సభ్యుల చేతిరాతలతో పోల్చి చూడాల్సి ఉంది. కారణాలు అన్వేషించి కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని ఉత్తర ఢిల్లీ డీసీపీ చెబుతున్నారు. బురారీలోని సంత్ నగర్లో ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది. భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్(50), లలిత్ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. ప్రతిభా కూతురు ప్రియాంక కూడా మృతుల్లో ఒకరు. కాగా, ప్రియాంకకు రెండు వారాల క్రితమే నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉంది. -
బురారీ కేసు; దిగ్భ్రాంతికర విషయాలు
న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆరు మృతదేహాలకు పోస్టు మార్టమ్ పూర్తయింది. అయితే పోస్టుమార్టమ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయంటున్నారు అధికారులు. పోస్టుమార్టమ్ రిపోర్టు ప్రకారం వారంతా కావాలనే, చనిపోవాలని నిశ్చయించుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన సమయంలో ఎటువంటి పెనుగులాట జరగలేదన్నారు. మోక్షం పొందడం కోసమే వీరంతా ఇలా చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. అంతేకాక మరణించిన కుటుంబ సభ్యులు తమ కళ్లను దానం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఐదు మృతదేహాలకు రేపు అనగా మంగళవారం పోస్టుమార్టమ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, మరో వృద్ధురాలు(75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. అలాగే వీరి నోటికి టేప్ అంటించారన్నారు. పోలీసుల తనిఖీల్లో ఈ ఇంట్లో తాంత్రిక పూజలకు సంబంధించిన చేతిరాతతో ఉన్న పేపర్లు లభ్యమయ్యాయి. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని తెలుస్తోందన్నారు. ఈ కాగితాల్లో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యుల్ని చేతులకు కట్లు, కళ్లకు గంతలు కట్టారన్నారు. అంతేకాకుండా అరవకుండా నోటికి టేప్‌ను అంటించారన్నారు. కుటుంబసభ్యుల్లో తాంత్రిక శక్తులతో ప్రభావితమైన ఒకరు మిగిలిన 10 మందిని హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. తొలుత నిందితుడు అందరికీ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక వారందర్నీ ఉరితీసి ఉంటాడని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని వృద్ధురాలు స్పృహలోకి రావడంతో ఆమెను సదరు వ్యక్తి గొంతుకోసి చంపాడన్నారు. -
గుడిలో ‘ఏవో’ పూజలు చేశారు!
సాక్షి, అమరావతి బ్యూరో/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) :‘బెజవాడ దుర్గమ్మ అలయంలో నిబంధనలకు విరుద్ధంగా 2017, డిసెంబర్ 26 అర్ధరాత్రి ‘ఏవో’ పూజలు చేశారు. అమ్మవారి గుడిలో అనుసరిస్తున్న స్మార్థ వైదిక ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఈ తంతు జరిగింది. ఆలయంతో సంబంధంలేని బయట వ్యక్తులు అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించారు’ అని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ‘భక్తుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్న ఈ ఉదంతంలో అన్ని వాస్తవాలూ వెలుగు లోకి రావాలంటే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి’ అని కూడా సూచించినట్లు సమాచారం. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారి ఆలయంలో నిబం ధనలకు విరుద్ధంగా తాంత్రిక పూజలు నిర్వహించడం తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రైవేటు వ్యక్తులు ఆలయంలోకి అర్ధరాత్రి దాటాక వెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దాంతో కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రస్తుతానికి కీలక సమాచారాన్ని రాబట్టి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. విడిచిపెట్టారు.. కానీ నిఘా పెట్టారు: అర్చకుడు సృజన్‌ను పోలీసులు గురువారం విడిచిపెట్టారు. అమ్మవారికి డిసెంబర్ 26 అర్ధరాత్రి అలంకరణ చేసింది అతనే. మంత్రి లోకేష్‌కు రాజయోగం కోసమే తాంత్రిక పూజలు నిర్వహించినట్లు సృజన్ సన్నిహితుల వద్ద చెప్పినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతణ్ని అదుపులోకి తీసుకున్నా విషయాన్ని పోలీసులు నిర్ధారిం చలేదు. దీనిపై అతని కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దాంతో సృజన్‌ను గురువారం ఉదయం అతని స్వస్థలం పెద్దపులివేరులో విడిచిపె ట్టారు. సృజన్ ఎవరితో మాట్లాడకుండా హెచ్చరించి అతనిపై నిఘా పెట్టారు. -
పైశాచికానికి పరాకాష్ట
కనౌజ్: ఘోరాతి ఘోరం. పైశాచికానికి పరాకాష్ట. మనం ఆధునిక యుగంలో ఉన్నామా, ఆటవిక యుగంలో ఉన్నామా అనే అనుమానం కలిగించే భయానక ఘటన ఉత్తరప్రదేశ్ కనౌజ్ జిల్లాలో భాదౌసి గ్రామంలో ఆలస్యం వెలుగు చూసింది. క్షుద్రపూజల పేరుతో 14 ఏళ్ల బాలికను బలి ఇచ్చి, శవంపై లైంగిక దాడికి పాల్పడిన దుర్మార్గుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ దారుణోదంతం వెల్లడైంది. నిందితుడు కృష్ణ కుమార్ శర్మ, బాలిక తల్లిదండ్రులు అరెస్ట్ చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. కనౌజ్ ఏఎస్పీ కేశవ్ చంద్ర గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తమ పూర్వపు ఇంట్లో పాతిపెట్టిన బంగారం జాడ చెప్పాలని బాలిక తల్లిదండ్రులు మహవీర్ ప్రసాద్, పుష్ప.. తాంత్రికుడు కృష్ణ కుమార్‌ను ఆశ్రయించారు. మీ కుమార్తెను బలి ఇచ్చి పూజలు చేస్తే ఐదు కేజీల బంగారం దొరుకుతుందని వారికి కుమార్ నమ్మబలికాడు. అతడి ఆదేశాల మేరకు తమ కుమార్తెను తీసుకుని మహావీర్ దంపతులు స్థానిక ఆలయానికి వెళ్లారు. కొన్ని పూజలు చేసిన తర్వాత బాలికను సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లాడు. తల్లిదండ్రుల ముందే ఆమెను నగ్నంగా నిలబెట్టి గొంతు పిసికి చంపేశాడు. తర్వాత శవంపై ఆకృత్యానికి పాల్పడ్డాడు. పూజ కోసమని చెప్పి బాలిక గొంతు కోసి రక్తం తీశాడు. కొద్దిసేపటి తర్వాత బాలిక స్పృహలోకి వస్తుందని ఆమె తల్లిదండ్రులకు చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. తాంత్రికుడి మాటలు నమ్మి కూతుర్ని కోల్పోయామని గ్రహించిన మహవీర్ ప్రసాద్(55) పోలీసులను ఆశ్రయించాడు. కుష్ణకుమార్ తన కూతురు కవితను కిడ్నాప్ చేశాడని కేసు పెట్టాడు. ఈ నెల 8న బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి పోస్టుమార్టంకు పంపారు. నిందితుడిని శనివారం అరెస్ట్ చేశారు. బాలిక తండ్రి ప్రమేయం ఉందన్న అనుమానంతో అతడిని ప్రశ్నిస్తున్నామని ఏఎస్పీ గోస్వామి తెలిపారు. దర్యాప్తు ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్పారు.