బురారీ ఆత్మహత్యల కేసు; ఊహించని ట్విస్ట్‌ | Burari Mass Suicide Family Suspect Foul Play | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 11:44 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

Burari Mass Suicide Family Suspect Foul Play - Sakshi

ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం దేశరాజధానిలో సంచలనం సృష్టించింది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ కేసులో బంధువుల మాత్రం కొత్త వాదనను వినిపిస్తున్నారు. సూసైడ్‌ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదని, ఖచ్ఛితంగా ఎవరో వారిని చంపి వేలాడదీసి ఉంటారని అనుమానిస్తున్నారు.
  
సాక్షి, న్యూఢిల్లీ: బురారీ సామూహిక ఆత్మహత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పోస్ట్‌ మార్టం నివేదికను కూడా మృతుల బంధువులు తప్పుబడుతుండటం గమనార్హం. ‘వాళ్లంతా (భాటియా కుటుంబ సభ్యులు) బాగా చదువుకున్న వాళ్లు. దెయ్యాలు-చేతబడులను నమ్మటం ఏంటి?.. పైగా గతంలో కూడా వాళ్లు ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు మేం ఎప్పుడూ చూడలేదు. వాళ్లకు ఎలాంటి ఆర్థిక కష్టాలు లేవు. అప్పులుగానీ, లోనులు గానీ లేవు. అన్నీ బాగున్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడాల్సిన అవసరం ఏంటి?. నోటికి ప్లాస్టర్లు, చేతులు కట్టేసి ఎలా సూసైడ్‌కు పాల్పడతారు? వాళ్లకు శత్రువులంటూ ఎవరూ లేరు. కానీ, ఖచ్ఛితంగా ఎవరో చంపే ఉంటారని మాకు అనిపిస్తోంది’ అని కేథన్‌ నాగ్‌పాల్‌ అనే బంధువు చెబుతున్నారు. 

ఆరోజు రాత్రి... భాటియా కుటుంబం మూకుమ్మడిగా విగతజీవులుగా మారటాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతకు ముందు రోజు దాకా నవ్వుతూ కనిపించిన వాళ్లు.. ప్రాణాలతో లేరన్న విషయం తెలియగానే బోరున విలపించారు. ‘శనివారం రాత్రి దాకా శివం, ధృవ్‌లు(ఆ ఇంటి పిల్లలు) నాతోనే నవ్వుతూ ఆడుకున్నారు. తర్వాత వాళ్ల ఇంట్లోంచి పిలుపు రావటంతో భోజనానికి పరుగులు తీశాడు. ఆ సమయంలో వాళ్ల కుటుంబ సభ్యులు నలుగురు ఇంటి బయటే నవ్వుతూ సంతోషకంగా కనిపించారు. అంతా మాములుగానే ఉంది’ అని స్థానికంగా ఉన్న ఓ బాలుడు చెబుతున్నాడు. 

విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు... అయితే ఆ ఇంట్లో గతంలో పని చేసిన మానేసిన ఓ మహిళ మాత్రం ఆసక్తికర విషయాలను మీడియాకు వివరించారు. ఆరేళ్ల క్రితం తాను ఆ ఇంట్లో పని చేశానని, ఆ కుటుంబం అంతా చాలా సందర్భాల్లో చాలా విచిత్రంగా ప్రవర్తించేందని.. ముఖ్యంగా ఆ ఇంట్లోని మహిళలు ఆలయాలకు వెళ్లినప్పుడు పూనకంతో ఊగిపోయేవారని... సదరు మహిళ తెలిపారు. ఇంట్లో కూడా అప్పుడప్పుడు పూజలు నిర్వహించి, స్వామీజీలను ఆహ్వానించేవారని, స్వామీజీలు చెప్పే విషయాలను బాగా నమ్మి తూచా తప్పకుండా పాటించేవారని ఆమె వివరించారు. 

కీలకం కానున్న నోట్‌ బుక్‌?.. ఇక ఈ కేసులో రాతలతో దొరికిన ఓ నోట్‌ బుక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని, అందులో రాసిపెట్టినట్లుగానే వాళ్లు ఉరి వేసుకుని చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘2017 నుంచి రాతలు రాసినట్లు ఉన్నాయి. గత నెల 27(జూన్‌)న ఎలా చనిపోవాలో.. అన్న విషయం కూడా అందులో రాసి ఉంది. అయితే దీనిని సూసైడ్‌ నోట్‌గా పరిగణించి దర్యాప్తు చేస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక కూడా ఆత్మహత్య అనే చెబుతోంది. అలాగని క్షుద్ర పూజల ప్రభావంతోనే వాళ్లంతా చనిపోయి ఉంటారని మేం నిర్ధారించలేం. రాతను కుటుంబ సభ్యుల చేతిరాతలతో పోల్చి చూడాల్సి ఉంది. కారణాలు అన్వేషించి కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని ఉత్తర ఢిల్లీ డీసీపీ చెబుతున్నారు.

బురారీలోని సంత్‌ నగర్‌లో ఆదివారం ఉదయం ఒకే ఇంట్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది.  భాటియా కుటుంబం ఇంటి పెద్ద నారాయణ్‌ దేవి(77) గొంతు తెగి రక్తపుమడుగులో పడి ఉండగా, ఆమె కూతురు ప్రతిభా(57), కొడుకులు భావనేశ్‌(50), లలిత్‌ భాటియా(45)తోపాటు వాళ్లిద్దరి భార్య, పిల్లలు ఉరికి వేలాడుతూ కనిపించారు. ప్రతిభా కూతురు ప్రియాంక కూడా మృతుల్లో ఒకరు. కాగా, ప్రియాంకకు రెండు వారాల క్రితమే నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది చివర్లో వివాహం జరగాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement