బాలీవుడ్ దర్శకదిగ్గజం అనిల్ గంగూలీ కన్నుమూత
ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, రచయిత అనిల్ గంగూలీ(82) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1970 , 90 వ దశకంలో హిందీ సినిమాను ప్రభావితం చేసిన ఆయన దర్శకుడిగా, తన ప్రత్యేకతను చాటుకున్నారు.
మహిళా ప్రాధాన్యంగల చిత్రాలను ఎక్కువగా రూపొందించారు. ఆశాపూర్ణాదేవి, శరత్ చంద్ర ఛటోపాద్యాయ నవలలను సినిమాలుగా మలిచారు. ముఖ్యంగా జయబాదురి హీరోయిన్గా నటించిన కోరా కాగజ్, రాఖీ నటించిన తపస్య సినిమాలకు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. ఇంకా త్రిష, ఖాందాన్, ప్యార్ కే కాబిల్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాలను ఆయన రూపొందించారు.
కాగా అనిల్ గంగూలీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కూతురు రూపాలీ గంగూలీ టీవీ, థియేటర్ ఆర్టిస్టుగా రాణిస్తుండగా, కొడుకు విజయ్ గంగూలీ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడుగా సినీ రంగానికి సేవలందిస్తున్నారు.