తెలంగాణలోనూ తాపేశ్వరం లడ్డే!
హైదరాబాద్: ఖైరతాబాద్‌లో శ్రీకైలాస విశ్వరూప మహాగణపతి చేతిలో 11 రోజుల పాటు నిత్యం పూజలందుకున్న లడ్డు పంపిణీ కార్యక్రమం ఈ ఉదయం ప్రారంభించారు. 5 టన్నుల(5150 కిలోల) మహాప్రసాదం (లడ్డు)ను ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంకు చెందిన సురుచి ఫుడ్స్ సంస్థ కానుకగా అందజేసింది. రాష్ట్రం రెండుగా విడిపోయినా గణేశునికి ప్రసాదం ఏపి నుంచే తెప్పించారు.
నిమజ్జనం అనంతరం ఈరోజు భక్తులకు లడ్డు పంపిణీ ప్రారంభించారు. లడ్దూ దాత మల్లిబాబుకు రెండు టన్నుల ప్రసాదాన్ని ఇచ్చారు. ఆయన దానిని మళ్లీ తాపేశ్వరం తీసుకు వెళ్లారు. ఏపీలో కూడా చాలా మంది ఖైరతాబాద్ లడ్డు కావాలని అడుగుతున్నారని సురచి ఫుడ్స్ యజమాని మల్లిబాబు చెప్పారు. తాపేశ్వరంలో తమ బంధువులు, కస్టమర్లు, భక్తులకు పంపిణీచేయనున్నట్లు ఆయన తెలిపారు.
మిగిలిన ప్రసాదాన్ని ఉదయం 11.45 గంటల నుంచి భక్తులకు పంపిణీ చేయడం మొదలు పెట్టారు. పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారం జరగటంతో ప్రసాదం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. మహిళలు సైతం ఉదయం నుంచే భారీగా బారులు తీరారు. పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు. లడ్డుపంపిణీలో తోపులాట చోటు చేసుకుంది. స్థానికులు, కమిటీ మెంబర్లు, పోలీసులు లడ్డును పెద్ద ఎత్తున కవర్లలో తీసుకెళుతుండటంతో క్యూ మెల్లగా కదిలింది. కొంత మంది భక్తులు పోలీసులు , కమిటీ తీరుపట్ల అభ్యంతరాలువ్యక్తంచేశారు.
ఉదయం నుంచి క్యూ కట్టిన తమకు కొంచెం కొంచెంగా ఇస్తూ వారు మాత్రం సంచులు సంచులు తీసుకెళ్లారంటూ విమర్శించారు. లడ్డూ పంపిణీకి సంబంధించి ఈసారి దాదాపుగా లక్ష మంది వచ్చినట్లు కమిటీ సభ్యుల అంచనా. పోలీసులు మాత్రం ఎలాంటి అలజడి జరగకుండా సజావుగా పంపిణీ కార్యక్రమం జరిగేలా ఏర్పాట్లు చేశామంటున్నారు.
**