అలాంటి జాబ్ కంటే నిరుద్యోగమే బెటర్
లండన్: చాలీచాలని వేతనాలు, తీవ్ర ఒత్తిడితో చేసే ఉద్యోగాలతో ఆరోగ్యం దెబ్బతినటం ఖాయమని ఓ తాజా అధ్యయనంలో తేలింది. అలాంటి ఉద్యోగుల కన్నా నిరుద్యోగులులే ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారని సర్వేలో తేలింది. యూకేలోని మాంచెస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు 2009-2010లో 35-75 ఏళ్ల వయసు వారిని వెయ్యి మందిని తీసుకున్నారు. వారి వారి వృత్తి వివరాలు, సంతృప్తి స్థాయిలు, వారి ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు, ఒత్తిడి స్థాయిలు, హార్మోన్లు, తదితర అంశాలు పరిశీలించాక ఈ విషయం ఇటీవల రూఢీ చేసుకున్నారు.
ఈ పరిశోధకుల బృందంలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ తరణి చందోలా కూడా ఉన్నారు. ఆమె దీనిపై మాట్లాడుతూ.. ఏ పనీ చేయకుండా ఉండే యువత కంటే చిన్న చిన్న జాబ్‌లు చేసేవారే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తమ అధ్యయనాల్లో రుజవయిందన్నారు. అదే మంచి ఉద్యోగాలు చేసే వారిలో ఆరోగ్య స్థాయిలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. తగిన వేతనాలు, తక్కువ ఒత్తిడిలో పనిచేసే వారు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. చేసే పనికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం విడదీయరానిదని స్పష్టం చేశారు. ఈ అధ్యయన ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడమియోలజీ ఇటీవల ప్రచురించింది.