Tashu Kaushik
-
‘కోట్లు సంపాదించాలని జర్నలిజాన్ని ఎంచుకోరు’
‘గంగపుత్రులు’ చిత్రం ఫేమ్ రామ్కీ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘జర్నలిస్ట్’. కె. మహేష్ దర్శకత్వం వహించారు. తషు కౌశిక్ హీరోయిన్గా నటించగా, ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్, సీనియర్ నటుడు సురేష్ కీలక పాత్రల్లో నటించారు. రాజ్ కుమార్ సమర్పణలో జి.ఆర్.కె ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామ్కీ మాట్లాడుతూ– ‘‘సామాజిక దృక్పథంతో ఉండే వారంటే నాకెంతో ఇష్టం. అలా ఉండే వ్యక్తుల్లో మొదట జర్నలిస్ట్‌లు ఉంటారు. అందుకే వారిపై ఈ సినిమా చేశాను. సమాజానికి, జనాలకి మంచి చేయాలనే ఉన్నతమైన అభిప్రాయంతో జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంటారే కానీ, కోట్లు సంపాదించాలని కాదు. నిజమైన జర్నలిస్ట్ ఎంత బాధ్యతతో ఉంటాడో చూపించే ప్రయత్నమే మా సినిమా. కథ నచ్చడంతో ఎన్. శంకర్ నటించారు. సీనియర్ నటులు చలపతిరావు, సురేష్ అందించిన సహకారం ఎప్పటికీ మరువలేను’’ అన్నారు. ‘‘సమాజంలో జర్నలిస్ట్ పాత్ర ఎంత గొప్పదో మా చిత్రంలో చూస్తారు’’ అన్నారు సమర్పకులు రాజ్‌కుమార్. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, డా. జోస్యభట్ల, కెమెరా: ముజీర్ మాలిక్. -
పెళ్లి కుదిరింది
రాజు-మహరాజు, దుశ్శాసన, వైకుంఠపాళి, తెలుగబ్బాయి తదితర చిత్రాల్లో నటించిన కథానాయిక తషు కౌశిక్ ఇక సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. అందుకు కారణం - ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. స్కూల్లో తనతో కలిసి చదువుకున్న దేవంగ్ రాజ్ తయాల్ని ఆమె పెళ్లాడనున్నారు. ఈ నెల 4న కాన్పూర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో తషు, దేవంగ్ల నిశ్చితార్థం జరిగింది. రాజస్తాన్‌లోని హెరిటేజ్ ప్యాలెస్‌లో వివాహ వేడుక జరగనుంది. ఇంకా తేదీ ఖరారు కాలేదు. ప్రస్తుతం ఓ మలయాళ చిత్రంలో నటిస్తున్నాననీ, ఇక సినిమాలు చేయకూడదనుకుంటున్నానని ఈ సందర్భంగా తషు స్పష్టం చేశారు. దేవంగ్ రాజ్ తయాల్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబంతో తమది పదిహేనేళ్ల అనుబంధం అని తషు చెబుతూ -‘‘నేను, దేవంగ్ పెళ్లి చేసుకుంటామని ఎప్పుడూ అనుకోలేదు. రెండు కుటుంబాలు కలుసుకున్నప్పుడు ‘మన స్నేహం ఎందాకా సాగుతుందో’ అని సరదాగా అనుకునేవాళ్లం. దేవంగ్తో నా పెళ్లి ప్రతిపాదన తెచ్చింది నా సిస్టరే. ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవడమా? అని అనిపించింది. కానీ, దేవంగ్ మంచి జీవిత భాగస్వామి అవుతారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
జనం కోసం పోరాటం...
‘పోరాడి ఓడిన ఓ జర్నలిస్ట్‌కి, గెలుపు కోసం పోరాడుతున్న మరో జర్నలిస్ట్ ఎలా సహాయపడ్డాడు? సమాజంలోని మంచి నుంచి చెడుని ఏ విధంగా దూరం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రిపోర్టర్’. ‘గంగపుత్రులు’ ఫేం రాంకీ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కత్తి దర్శకుడు. తషు కౌశిక్ కథానాయిక. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఇందులో జర్నలిస్ట్‌గా నటిస్తుండటం విశేషం. ఈ చిత్రం ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. జర్నలిస్ట్‌లో ఉండే పోరాటం, త్యాగం, చైతన్యం గురించి చెప్పే సినిమా ఇదని, విలువలున్న కథ కావడం వల్లే వెంటనే కనెక్ట్ అయ్యానని, నటునిగా తాను వేస్తున్న తొలి అడుగుకు తప్పక విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని ఎన్.శంకర్ అన్నారు. జర్నలిజం అనేది జీతాల కోసం కాదు, జనం కోసం అని తెలిపే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. రాంకీ మాట్లాడుతూ -‘‘జర్నలిజం నేపథ్యంలో కథ అనగానే... ఉద్వేగానికి లోనయ్యాను. ఎన్.శంకర్ పాత్ర ఈ సినిమాలో కీలకం’’అని తెలిపారు. ఇంకా చలపతిరావు, తషుకౌశిక్, జోశ్యభట్ల, రఘుకుంచె, సీనియర్ పాత్రికేయులు అరుణ్‌సాగర్, సంతోష్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.