జనం కోసం పోరాటం...
జనం కోసం పోరాటం...
Published Thu, Dec 26 2013 11:44 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
‘పోరాడి ఓడిన ఓ జర్నలిస్ట్‌కి, గెలుపు కోసం పోరాడుతున్న మరో జర్నలిస్ట్ ఎలా సహాయపడ్డాడు? సమాజంలోని మంచి నుంచి చెడుని ఏ విధంగా దూరం చేశాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘రిపోర్టర్’. ‘గంగపుత్రులు’ ఫేం రాంకీ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ కత్తి దర్శకుడు. తషు కౌశిక్ కథానాయిక. ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ ఇందులో జర్నలిస్ట్‌గా నటిస్తుండటం విశేషం.
ఈ చిత్రం ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. జర్నలిస్ట్‌లో ఉండే పోరాటం, త్యాగం, చైతన్యం గురించి చెప్పే సినిమా ఇదని, విలువలున్న కథ కావడం వల్లే వెంటనే కనెక్ట్ అయ్యానని, నటునిగా తాను వేస్తున్న తొలి అడుగుకు తప్పక విజయాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని ఎన్.శంకర్ అన్నారు. జర్నలిజం అనేది జీతాల కోసం కాదు, జనం కోసం అని తెలిపే సినిమా ఇదని దర్శకుడు చెప్పారు. రాంకీ మాట్లాడుతూ -‘‘జర్నలిజం నేపథ్యంలో కథ అనగానే... ఉద్వేగానికి లోనయ్యాను. ఎన్.శంకర్ పాత్ర ఈ సినిమాలో కీలకం’’అని తెలిపారు. ఇంకా చలపతిరావు, తషుకౌశిక్, జోశ్యభట్ల, రఘుకుంచె, సీనియర్ పాత్రికేయులు అరుణ్‌సాగర్, సంతోష్‌లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement