Tata Sons Group
-
ఆ విషయమై నన్నెవరూ సంప్రదించలేదు: రతన్ టాటా
Tata Group New Chairman News: టాటా గ్రూప్ కొత్త చైర్మన్ ఎంపిక విషయంలో ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయనే ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం చైర్మన్ పదవిలో ఉన్న చంద్రశేఖరన్‌నే.. రెండోసారి కొనసాగించాలనే సంప్రదింపులు నడుస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ రతన్ టాటా స్పందించారు. టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్న నటరాజన్ చంద్రశేఖరన్(58) పదవీకాలం వచ్చే ఏడాది(2022) ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ చర్చలు మొదలయ్యాయని, చంద్రశేఖరన్ పనితీరు ఫలితంగా రెండోసారి కొనసాగించే ప్రయత్నాలు బోర్డు చేస్తోందని ఓ జాతీయ మీడియా పత్రిక కథనం వెలువరించింది. ఈ నేపథ్యంలోనే మీడియా, రతన్ టాటాను సంప్రదించింది. ‘‘ఈ విషయంపై నన్నెవరూ సంప్రదించలేదు. ఆ కథనంలో వాస్తవం లేదు. పైగా చంద్రశేఖరన్‌ను రెండోసారి కొనసాగించాలనే బోర్డు ప్రతిపాదనేదీ నా దృష్టికి రాలేదు కూడా. ఈ విషయంలో టాటా సన్స్ బోర్డ్, షేర్‌హోల్డర్స్ సరైన నిర్ణయం తీసుకుంటారనే భావిస్తున్నా’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. మరోవైపు ఆ కథనంపై చంద్రశేఖరన్ సైతం స్పందించారు. వారసత్వ విషయమై రతన్ టాటాగానీ, బోర్డుగానీ, ట్రస్ట్గానీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తన జోక్యం ఉండని ఈ వ్యవహారంలో.. సరైన టైంలో బోర్డు సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నానని సోమవారం ఓ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారాయన. చదవండి.. ఆ వ్యాఖ్యలు నావి కావు: రతన్ టాటా -
వైరలవుతోన్న రతన్ టాటా ఫోటో
ముంబై: టాటా గ్రూపు అంటేనే విలువలకు పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు విస్తరించినప్పటికి వీసమెత్తు గర్వం కనపడదు. ఇక ఉద్యోగుల పట్ల టాటా సంస్థలు చూపే శ్రద్ధ గురించి అందులో పని చేసే వారిని అడిగితే తెలుస్తుంది. టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా సింప్లిసిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. దేశం పట్ల, సమాజం పట్ల టాటా కుటుంబానికి ఎంతో ప్రేమ, బాధ్యత. ఇక ఏదైనా విపత్తు వచ్చిందంటే చాలు సాయం చేయడంలో టాటా సంస్థలు ముందు వరుసలో ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే గత నాలుగైదు రోజులుగా రతన్ టాటాకు సంబధించిన ఓ వార్త సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. తమ కంపెనీలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగిని కలవడం కోసం రతన్ టాటా స్వయంగా ముంబై నుంచి పుణె వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. యోగేష్ దేశాయ్ అనే వ్యక్తి తన ట్విట్టర్లో రతన్ టాటా సదరు ఉద్యోగి పిల్లలతో మాట్లాడుతున్న ఫోటోని షేర్ చేశారు. (చదవండి: పరిగెత్తండిరా!.. శబ్ధం చేయకండయ్యా!!) Ratan Tata,83, living legend, greatest businessman alive in India visited the friends society in Pune to meet his Ex Emoloyee all the way from Mumbai who is ailing for last 2 years. This is how legends are made of. No media, no bouncers only commitment towards loyal employees. pic.twitter.com/5xktAH2CUX — No Robert Elekes - AnKuVa (@SuspendedAkount) January 4, 2021 ఇక ‘రతన్ టాటా లివింగ్ లెజెండ్.. భారతదేశంలో ఉన్న అతి గొప్ప వ్యాపారవేత్తల్లో ఆయన ఒకరు. తమ సంస్థలో పని చేసిన ఓ మాజీ ఉద్యోగి గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతన్నారని రతన్ టాటాకు తెలిసింది. దాంతో అతడిని పరామర్శించడానికి ముంబై నుంచి పుణె వెళ్లారు. ఆయన వెంట బౌన్సర్లు లేరు.. మీడియా హడావుడి లేదు. నమ్మకంగా పని చేసిన ఉద్యోగి పట్ల ఆయన చూపిన ఈ సానుభూతి ఎంతో గొప్పది. డబ్బు మాత్రమే జీవితం కాదని అందరు వ్యాపారవేత్తలు తెలుసుకోవాలి. గొప్ప మనిషిగా బతకడం అనేది ముఖ్యం. సర్ మీరు చేసిన ఈ పనికి గౌరవంగా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. లివింగ్ లెజెండ్ రతన్ టాటా.. అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజనులు. -
రతన్ టాటాకు నోటీసులు
సాక్షి, ముంబై : వాదియా గ్రూప్ చైర్మన్ నస్లీ వాదియా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో స్ధానిక కోర్టు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాతో సహా ప్రస్తుత చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, సంస్థకు చెందిన ఎనిమిది మంది డైరెక్టర్లకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే ఏడాది మార్చి 25కు వాయిదా వేసింది. 2016, అక్టోబర్ 24న గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్ర్తీని తొలగించిన తర్వాత రతన్ టాటాతో పాటు ఇతరులు తన ప్రతిష్టను కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ అదే ఏడాది వాదియా ఫిర్యాదు చేశారు. పలు టాటా సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా బోర్డులో కొనసాగుతున్న వాదియాను 2016 డిసెంబర్ నుంచి 2017 ఫిబ్రవరి మధ్య జరిగిన ప్రత్యేక సమావేశాల్లో వాటాదారులు తొలగించారు. మిస్ర్తీతో కలిసి వాదియా టాటా గ్రూప్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేశారని నిందితులు ఆరోపించారని వాదియా తరపు న్యాయవాది అబద్ పోండా మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ కోర్టుకు వివరించారు. అయితే నస్లీ వాదియాను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తొలగించడంలో చట్టబద్ధమైన ప్రక్రియలను అన్నింటినీ చేపట్టామని టాటా సన్స్ ప్రతినిధి పేర్కొన్నారు. -
టాటా సన్స్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్
న్యూఢిల్లీ: టాటా సన్స్ గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా శువ మండల్ నియమితులయ్యారు. టాటా సన్స్‌లో గత 17 ఏళ్లుగా గ్రూప్ జనరల్ కౌన్సెల్‌గా వ్యవహరిస్తూ వస్తున్న భరత్ వాసని స్థానాన్ని శువ మండల్ భర్తీ చేయనున్నారు. శువ మండల్ జూలై నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని టాటా సన్స్ పేర్కొంది. కాగా ఈయన నేషనల్ లా స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. -
రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్అండ్డీ కేంద్రం
శంకుస్థాపన చేసిన టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శాస్త్ర సాంకేతిక ఫలితాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రధానంగా దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీగా ప్రచారంలో ఉన్న రోబోటిక్, ఆటోమేషన్ రంగాలపై పరిశోధన చేయడానికి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీతో టీసీఎస్ చేతులు కలిపింది. దేశీయ ఐటీ పితామహుడిగా పేరొందిన టీసీఎస్ తొలి ఫౌండర్ సీఈవో ఎఫ్.సి.కొహ్లి పేరుమీద హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రూ. 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ‘ఎఫ్.సి కొహ్లి సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మిస్త్రీ మాట్లాడుతూ టాటా గ్రూపుతో 50 ఏళ్లకుపైగా అనుబంధం కలిగిన కొహ్లి పేరుమీద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం చేతులు కలిపిన రెండు దిగ్గజాలు, టీసీఎస్, ట్రిపుల్ ఐటీలు కొహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ ఈ ఆర్అండ్డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై సంతోషం వెలిబుచ్చారు. స్టార్టప్ రాష్ట్రమైన తెలంగాణకు టాటా గ్రూపు పెద్ద బ్రాండ్ అంబాసిడరని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉందన్నారు. ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాలి అమెరికా కంటే మూడు రెట్లు అధిక జనాభా కలిగిన ఇండియా నూతన ఆవిష్కరణల్లో మాత్రం బాగా వెనుకబడి ఉందని ఎఫ్.ఎస్.కొహ్లి అన్నారు. దేశంలో టాప్ 50 విద్యా సంస్థలు 90-95 శాతం ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటున్నాయని, కానీ ఈ సంస్థల నుంచి వస్తున్న పీహెచ్‌డీల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని, దీనికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థేనన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని అప్పుడే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. దేశంలో తయారవుతున్న 125 బిలియన్ డాలర్ల సాఫ్ట్వేర్ ఉత్పత్తుల్లో దేశీయంగా 15 బిలియన్ డాలర్లు మాత్రమే వినియోగిస్తుండటం దారుణమైన విషయమన్నారు. దేశ జనాభాలో 80 కోట్ల మందికి ఇంగ్లిష్ రాదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్వేర్లను అందుబాటులోకి తీసుకువస్తేనే దేశంలో ఐటీ వినియోగం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖరన్, టీసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రామదొరై, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ పి.జే.నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.