రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్‌అండ్‌డీ కేంద్రం | Rs. With 20 million of TCS | Sakshi
Sakshi News home page

రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్‌అండ్‌డీ కేంద్రం

Published Thu, Jul 23 2015 11:28 PM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్‌అండ్‌డీ కేంద్రం

రూ. 20 కోట్లతో టీసీఎస్ ఆర్‌అండ్‌డీ కేంద్రం

శంకుస్థాపన చేసిన టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : శాస్త్ర సాంకేతిక ఫలితాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడంపై టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రధానంగా దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీగా ప్రచారంలో ఉన్న రోబోటిక్, ఆటోమేషన్ రంగాలపై పరిశోధన చేయడానికి హైదరాబాద్ ట్రిపుల్ ఐటీతో టీసీఎస్ చేతులు కలిపింది. దేశీయ ఐటీ పితామహుడిగా పేరొందిన టీసీఎస్ తొలి ఫౌండర్ సీఈవో ఎఫ్.సి.కొహ్లి పేరుమీద హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రూ. 20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ‘ఎఫ్.సి కొహ్లి సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రానికి టాటాసన్స్ గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీ గురువారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మిస్త్రీ మాట్లాడుతూ టాటా గ్రూపుతో 50 ఏళ్లకుపైగా అనుబంధం కలిగిన కొహ్లి పేరుమీద ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్త టెక్నాలజీ అభివృద్ధి కోసం చేతులు కలిపిన రెండు దిగ్గజాలు, టీసీఎస్, ట్రిపుల్ ఐటీలు కొహ్లి వారసత్వాన్ని కొనసాగిస్తాయన్న ధీమాను వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ ఈ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంపై సంతోషం వెలిబుచ్చారు. స్టార్టప్ రాష్ట్రమైన తెలంగాణకు టాటా గ్రూపు పెద్ద బ్రాండ్ అంబాసిడరని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఉద్యోగ కల్పన సంస్థగా టాటా గ్రూపు ఉందన్నారు.

 ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టాలి
 అమెరికా కంటే మూడు రెట్లు అధిక జనాభా కలిగిన ఇండియా నూతన ఆవిష్కరణల్లో మాత్రం బాగా వెనుకబడి ఉందని ఎఫ్.ఎస్.కొహ్లి అన్నారు. దేశంలో టాప్ 50 విద్యా సంస్థలు 90-95 శాతం ఉత్తీర్ణత కలిగిన విద్యార్థులను మాత్రమే తీసుకుంటున్నాయని, కానీ ఈ సంస్థల నుంచి వస్తున్న పీహెచ్‌డీల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని, దీనికి ప్రధాన కారణం మన విద్యా వ్యవస్థేనన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సిలబస్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని అప్పుడే ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతుందన్నారు.

దేశంలో తయారవుతున్న 125 బిలియన్ డాలర్ల సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్లో దేశీయంగా 15 బిలియన్ డాలర్లు మాత్రమే వినియోగిస్తుండటం దారుణమైన విషయమన్నారు. దేశ జనాభాలో 80 కోట్ల మందికి ఇంగ్లిష్ రాదని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాంతీయ భాషల్లో సాఫ్ట్‌వేర్లను అందుబాటులోకి తీసుకువస్తేనే దేశంలో ఐటీ వినియోగం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖరన్, టీసీఎస్ మాజీ వైస్ చైర్మన్ రామదొరై, ట్రిపుల్ ఐటీ డెరైక్టర్ పి.జే.నారాయణన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement