Tata Sons Limited
-
టాటాసన్స్ చైర్మన్‌గా మళ్లీ చంద్రశేఖరన్.. జీతం ఎంతో తెలుసా ?
దేశంలోని అతిపెద్ద వ్యాపార వాణిజ్య సంస్థల్లో ఒకటైన టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ తిరిగి నియమితులయ్యారు. 2022 ఏప్రిల్ 25న జరిగిన షేర్‌హోల్డర్ల సమావేశంలో చంద్రశేఖరన్‌ను మరోసారి టాటాసన్స్ గ్రూపు చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో విజయ్ సింగ్, లియో పూరీలకు బోర్డులో డైరెక్టర్లుగా స్థానం కల్పించారు. గతేడాది టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రేశేఖరన్కు వార్షిక వేతనంగా రూ.91 కోట్లు చెల్లించారు. వేతనంతో పాటు లాభాల్లో వాటా, ఇతర అలవెన్సులు అందించారు. ఎన్ చంద్రశేఖరన్ పనితీరు నచ్చడంతో 2022 ఫిబ్రవరిలో మరో ఏడాది పాటు అతన్నే చైర్మన్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు వాటాదారులతో 2022 ఏప్రిల్ 25న సమావేశం నిర్వహించారు. ఇందులో చంద్రశేఖరన్‌కు అనుకూలంగా టాటాలు ఓటేశారు. తాజాగా జరిగిన టాటా వాటాదారుల సమావేవానికి మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. టాటా గ్రూపులో మిస్త్రీ కుటుంబానికి 18 శాతం వాటా ఉంది. 2016లో మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించారు. దీనిపై మిస్త్రీ కుటుంబం న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తోంది. చదవండి: టాటా ఎలక్సీ డివిడెండ్ రూ. 42.5 -
టాటాల గూటికి ‘మహారాజా’ చేరేది అప్పుడే
న్యూఢిల్లీ: వేలంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం.. టాటా గ్రూప్‌నకు అప్పగించడంలో జాప్యం జరగనుంది. నిర్దిష్ట ప్రక్రియలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టేస్తుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అప్పగింత ప్రక్రియ జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది. రూ.18,000 కోట్ల డీల్ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్ఏటీఎస్లో 50 శాతం వాటాలను వేలంలో టాటా గ్రూప్ సంస్థ టాలేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది సుమారు రూ. 18,000 కోట్ల డీల్. ఇందులో రూ. 2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. కొనుగోలు ఒప్పందం ప్రకారం 8 వారాల్లోగా (డిసెంబర్ ఆఖరులోగా) అప్పగింత ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇరు పక్షాల అంగీకారం మేరకు దీన్ని మరికాస్త పొడిగించుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో ఇదే జరుగుతోందని సంబంధిత అధికారి వివరించారు. రుణభారం రూ.61,562 కోట్లు హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయితే టాటా గ్రూప్.. నగదు భాగాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2007–08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీని గట్టెక్కించడానికి గత దశాబ్ద కాలంలో రూ. 1.10 లక్షల కోట్లపైగా నగదు, రుణాల గ్యారంటీల రూపంలో ప్రభుత్వం అందించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్‌నకు కంపెనీని అప్పగించడానికి ముందు ఇందులో 75 శాతాన్ని (దాదాపు రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు బదలాయిస్తారు. టాటాలకు 141 ఎయిరిండియా విమానాలు దక్కుతాయి. అయితే, ప్రధాన వ్యాపారేతర అసెట్స్ మాత్రం లభించవు. చదవండి: ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు -
టాటా టెలీకి డొకోమో గుడ్‌బై
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో కలసి నెలకొల్పిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టు టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్ఎల్) నుంచి నిష్ర్కమించాలని యోచిస్తున్నట్లు జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2009, 2011 సంవత్సరాల్లో 261 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసిన 26.5 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా వైర్లెస్ మొబైల్ సేవలను అందిస్తున్న టీటీఎస్ఎల్ నష్టాల్లో కొనసాగుతోంది. ఎన్టీటీ డొకోమో వాటా కొనుగోలుకు వొడాఫోన్ ఆసక్తితో ఉన్నట్లు వదంతులు విన్పించాయి కానీ ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి వొడాఫోన్ నిరాకరించింది. టాటా టెలిపై అజమాయిషీని కొనసాగించేందుకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.. డొకోమో వాటాను కొనే అవకాశముంది. ఒప్పందంలో విక్రయ షరతు... గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంచనా లక్ష్యాలను సాధించలేకపోయిన పక్షంలో తమ వాటాను విక్రయించుకోవచ్చని 2009లో జాయింట్ వెంచర్ ఒప్పందంలో పేర్కొన్నట్లు డొకోమో తెలిపింది. వాటా అమ్మకం ధర కొనుగోలు రేటులో 50 శాతం (రూ.7,250 కోట్లు) లేదా సముచిత మార్కెట్ ధర, ఏది ఎక్కువైతే అది ఉంటుందని వివరించింది. టీటీఎస్ఎల్లో వాటా (124.90 కోట్ల షేర్లు) విక్రయ ప్రతిపాదనను తమ డెరైక్టర్ల బోర్డు ఆమోదించినట్లు తెలిపింది. మున్ముందు ఏం జరుగుతుందో ఊహించలేమని టీటీఎస్ఎల్ మరో ప్రకటనలో పేర్కొంది. టాటా సన్స్‌కు తమ బాధ్యతలు తెలుసనీ, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కంపెనీ వ్యవహరిస్తుందనీ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగంగా టీటీఎస్ఎల్ కొనసాగుతుందని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఐదో వంతు తగ్గిన చందాదారులు ... లాభాల మార్జిన్ అధికంగా ఉండే 3జీ సేవలను ప్రవేశపెట్టడంతో జాప్యం కారణంగానే టీటీఎస్ఎల్ పనితీరు పేలవంగా ఉందని డొకోమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరు కాటో టోక్యోలో వ్యాఖ్యానించారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే టీటీఎస్ఎల్ చందాదారుల సంఖ్య 20 శాతం తగ్గిపోయి 6.31 కోట్లకు చేరిందని టెలికమ్ రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.