న్యూఢిల్లీ: వేలంలో కొనుగోలు చేసిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కేంద్రం.. టాటా గ్రూప్‌నకు అప్పగించడంలో జాప్యం జరగనుంది. నిర్దిష్ట ప్రక్రియలు పూర్తి కావడానికి అనుకున్న దానికంటే మరింత సమయం పట్టేస్తుండటమే ఇందుకు కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అప్పగింత ప్రక్రియ జనవరిలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆఖరు నాటికి ఎయిరిండియాను టాటా గ్రూప్ టేకోవర్ చేయాల్సి ఉంది.
రూ.18,000 కోట్ల డీల్
ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం, గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీ ఏఐఎస్‌ఏటీఎస్‌లో 50 శాతం వాటాలను వేలంలో టాటా గ్రూప్ సంస్థ టాలేస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇది సుమారు రూ. 18,000 కోట్ల డీల్. ఇందులో రూ. 2,700 కోట్ల మేర టాలేస్ నగదు చెల్లించనుండగా, మిగతా మొత్తానికి సరిపడా ఎయిరిండియాకు ఉన్న రుణ భారాన్ని తనకు బదిలీ చేసుకోనుంది. కొనుగోలు ఒప్పందం ప్రకారం 8 వారాల్లోగా (డిసెంబర్ ఆఖరులోగా) అప్పగింత ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, ఇరు పక్షాల అంగీకారం మేరకు దీన్ని మరికాస్త పొడిగించుకోవచ్చు. ప్రస్తుత సందర్భంలో ఇదే జరుగుతోందని సంబంధిత అధికారి వివరించారు.
రుణభారం రూ.61,562 కోట్లు
హ్యాండోవర్ ప్రక్రియ పూర్తయితే టాటా గ్రూప్.. నగదు భాగాన్ని చెల్లిస్తుందని పేర్కొన్నారు. 2007–08లో ఇండియన్ ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేసుకున్నప్పటి నుంచి ఎయిరిండియా నష్టాల్లోనే కొనసాగుతోంది. కంపెనీని గట్టెక్కించడానికి గత దశాబ్ద కాలంలో రూ. 1.10 లక్షల కోట్లపైగా నగదు, రుణాల గ్యారంటీల రూపంలో ప్రభుత్వం అందించినప్పటికీ పరిస్థితి చక్కబడలేదు. ఆగస్టు 31 నాటికి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ. 61,562 కోట్లుగా ఉంది. టాటా గ్రూప్‌నకు కంపెనీని అప్పగించడానికి ముందు ఇందులో 75 శాతాన్ని (దాదాపు రూ. 46,262 కోట్లు) స్పెషల్ పర్పస్ వెహికల్ ఏఐఏహెచ్‌ఎల్‌కు బదలాయిస్తారు. టాటాలకు 141 ఎయిరిండియా విమానాలు దక్కుతాయి. అయితే, ప్రధాన వ్యాపారేతర అసెట్స్ మాత్రం లభించవు.
Comments
Please login to add a commentAdd a comment