న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌తో కలసి నెలకొల్పిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టు టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్‌ఎల్) నుంచి నిష్ర్కమించాలని యోచిస్తున్నట్లు జపాన్ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమో శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. 2009, 2011 సంవత్సరాల్లో 261 కోట్ల డాలర్లతో కొనుగోలు చేసిన 26.5 శాతం వాటాను విక్రయించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా వైర్‌లెస్ మొబైల్ సేవలను అందిస్తున్న టీటీఎస్‌ఎల్ నష్టాల్లో కొనసాగుతోంది. ఎన్‌టీటీ డొకోమో వాటా కొనుగోలుకు వొడాఫోన్ ఆసక్తితో ఉన్నట్లు వదంతులు విన్పించాయి కానీ ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి వొడాఫోన్ నిరాకరించింది. టాటా టెలిపై అజమాయిషీని కొనసాగించేందుకు టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్.. డొకోమో వాటాను కొనే అవకాశముంది.
ఒప్పందంలో విక్రయ షరతు...
గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అంచనా లక్ష్యాలను సాధించలేకపోయిన పక్షంలో తమ వాటాను విక్రయించుకోవచ్చని 2009లో జాయింట్ వెంచర్ ఒప్పందంలో పేర్కొన్నట్లు డొకోమో తెలిపింది. వాటా అమ్మకం ధర కొనుగోలు రేటులో 50 శాతం (రూ.7,250 కోట్లు) లేదా సముచిత మార్కెట్ ధర, ఏది ఎక్కువైతే అది ఉంటుందని వివరించింది.
టీటీఎస్‌ఎల్‌లో వాటా (124.90 కోట్ల షేర్లు) విక్రయ ప్రతిపాదనను తమ డెరైక్టర్ల బోర్డు ఆమోదించినట్లు తెలిపింది. మున్ముందు ఏం జరుగుతుందో ఊహించలేమని టీటీఎస్‌ఎల్ మరో ప్రకటనలో పేర్కొంది. టాటా సన్స్‌కు తమ బాధ్యతలు తెలుసనీ, వాటాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కంపెనీ వ్యవహరిస్తుందనీ తెలిపింది. టాటా గ్రూప్‌లో భాగంగా టీటీఎస్‌ఎల్ కొనసాగుతుందని కూడా ఆ ప్రకటన స్పష్టం చేసింది.
ఐదో వంతు తగ్గిన చందాదారులు ...
లాభాల మార్జిన్ అధికంగా ఉండే 3జీ సేవలను ప్రవేశపెట్టడంతో జాప్యం కారణంగానే టీటీఎస్‌ఎల్ పనితీరు పేలవంగా ఉందని డొకోమో చీఫ్ ఎగ్జిక్యూటివ్ కోరు కాటో టోక్యోలో వ్యాఖ్యానించారు. రెండేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే టీటీఎస్‌ఎల్ చందాదారుల సంఖ్య 20 శాతం తగ్గిపోయి 6.31 కోట్లకు చేరిందని టెలికమ్ రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
టాటా టెలీకి డొకోమో గుడ్‌బై
Published Sat, Apr 26 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM
Advertisement
Advertisement