ముంపు మండలాల రాజకీయ ప్రాతినిధ్యంపై సీఈసీకి లేఖ: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలోని 7 మండలాలకు రాజకీయంగా ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) దృష్టికి తీసుకెళ్లి, స్పష్టత తీసుకుంటామని ఉమ్మడిరాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.ఈ విషయంపై ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని, తదుపరి సమాచారాన్ని తెలియజేస్తామని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు ఆయన చెప్పారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు (2019) జరిగే వరకు ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక ఎస్టీ నియోజకవర్గాల్లోని 7 మండలాలకు తామే ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించాలని భన్వర్‌లాల్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిన విజ్ఞప్తికి ఆయనపై విధంగా స్పందించారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌కు వారు వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ మండలాలు ఏపీ పాలనలో ఉండడంతో ఆ ప్రాంత సమస్యలను అధికారుల వద్ద ప్రస్తావించే పరిస్థితి, ప్రభుత్వానికి నివేదించే అవకాశం లేకుండా పోయిందని, ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.