పన్ను భారం రూ. 1.50 కోట్లు
రేపు మహాధర్నా
సవరించిన నిబంధనలతో రెట్టింపైన ఆస్తి పన్ను
పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించి పన్ను నిర్ధారణ
కాలపరిమితి ఆరు నెలలకు తగ్గింపు
ఆందోళన బాటలో అఖిలపక్షం
పరకాల: పరకాల నగర పంచాయతీలో సవరించిన ఆస్తిపన్ను కారణంగా పట్టణ ప్రజలపై రూ.1.50కోట్ల భారం పడుతోంది. గతంలో ఉన్న పన్నులు ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. గతంలో ఏడాదికి ఒకసారి మాత్రమే పన్ను వసూలు చేయగా.. ఇప్పుడు ఆరు నెలల కాలానికి తగ్గించారు. అమాంతం పెరిగిన ఆస్తి పన్నుతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న పరకాల 2011 ఆగస్టులో నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ అయింది. నగర పంచాయతీగా అప్‌గ్రేడ్ కాకముందు ఇళ్లు, వ్యాపార సంస్థలకు ఒకే తరహాలో ఆస్తి పన్ను ఉంది. ఇప్పుడు ఏరియా, ఇళ్లను బట్టి పన్ను వసూలు చేస్తున్నారు. పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని వివిధ పార్టీలు ‘ఇంటి పన్ను వ్యతిరేక పోరాట కమిటీ’ని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారుు.
పన్ను విధింపు కోసం మూడు జోన్లుగా విభజన
నగర పంచాయతీలో ఆస్తి పన్ను విధింపు కోసం పట్టణాన్ని మూడు జోన్లుగా విభజించారు. ఈ ఏడాది బెల్లంపల్లి మునిసి పాలిటీకి చెందిన అధికారి మల్లారెడ్డి డిప్యూటేషన్‌పై వచ్చి పట్టణంలో ఉన్న ఇళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను సర్వే చే శారు. పట్టణంలో 7369 ఇళ్లు ఉండగా 66 ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. 620 వ్యాపార, వాణిజ్య సంస్థలున్నాయని నిర్ధారించారు. 3960 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 140 అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు.
ఏరియాను బట్టీ పన్ను..
ఈ మూడు జోన్లులో ఒక్కో రేటును నిర్ణయించారు. ఆయా ప్రాంతాల్లో ఇండ్ల రకాలు, వ్యాపార సమూదాయాలను బట్టి పన్ను విధించారు. ఉదాహరణకు మొదటి జోన్లో నివాస గృహాలకు చదరపు మీటరుకు రూ.14, రెండవ జోన్లో రూ.12, మూడో జోన్లో రూ.10 చొప్పున ఆస్తిపన్ను వసూలు చేయనున్నారు. అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లకు మొదటి జోన్లో చదరపు మీటరుకు రూ.40, రెండవ జోన్లో రూ.35, మూడో జోన్లో రూ.30 చొప్పున విధించారు. గతంలో ఇంటి పన్నుల ద్వారా నగర పంచాయతీకి ఏడాదికి రూ.50లక్షల ఆదాయం వచ్చేది. ఇప్పుడు పెరిగిన పన్నుతో ఏటా రూ.1.50కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. పెరిగిన పన్నులతో పట్టణవాసులకు మరింతగా ఆర్థికభారం పడుతుంది.
రేపు మహాధర్నా..
పెంచిన ఆస్తి పన్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఇంటి పన్ను పెంపు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం మహా ధర్నా జరగనుంది. నగర పంచాయతీ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఇంటి యజమానులు పాల్గొననున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కమిటీ సభ్యులు కోరారు.
నేడు, రేపు జాతీయస్థాయి వర్క్‌షాప్
మామునూరు : గ్రేటర్ వరంగల్ ఐదో డివిజన్ పరిధిలోని బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బుధ, గురువారాల్లో జాతీయస్థారుు వర్క్‌షాపు నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు పి. ప్రసాద్‌రావు, ప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్యుడ్ కొప్టెర్స్ అనే అంశంపై కేరళకు చెందిన ఏరో స్పోర్ట్స్ సంస్థ సహకారంతో తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా వాగ్దేవి కళాశాలలో వర్క్‌షాపు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక నిపుణులు క్యుడ్ కొప్టెర్ డిజైనింగ్ నమూనాపై ప్రసంగిస్తారని తెలిపారు.