Taxi for Sure
-
ఓలా యాప్‌లో ‘ట్యాక్సీఫర్‌స్యూర్’ బుకింగ్
ముంబై : ఇక నుంచి ఓలా యాప్ ద్వారా ట్యాక్సీఫర్స్యూర్కు చెందిన హ్యాచ్‌బ్యాక్ క్యాబ్స్‌ను కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సదుపాయం ముంబై, ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఓలా యాప్‌లో కనిపించే టీఎఫ్ఎస్ ఆప్షన్ ద్వారా వినియోగదారులు రూ.49 ప్రారంభ ధరతో ట్యాక్సీఫర్‌స్యూర్ క్యాబ్స్‌ను బుకింగ్ చేసుకోవచ్చని ఓలా సీఓఓ ప్రణయ్ తెలిపారు. ట్యాక్సీఫర్‌స్యూర్ వాహనాలను ఓలా యాప్‌కు అనుసంధానం చేయడం వల్ల తమ వినియోగదారులకు మరిన్ని వాహనాలకు అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో 200 మిలియన్ డాలర్లు (రూ.1,260 కోట్లు) వెచ్చించి ట్యాక్సీఫర్స్యూర్ను ఓలా కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్యాక్సీఫర్స్యూర్కు దేశవ్యాప్తంగా 24,000 వాహనాలు ఉన్నాయి. వీటిలో సగభాగం హ్యాచ్బ్యాక్స్దే. -
‘ఓలా క్యాబ్స్’లో 2,500 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) సమీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి కార్యకలాపాలను రెట్టింపు స్థాయిలో 200 నగరాలకు విస్తరించడంతో పాటు క్యాబ్స్ సంఖ్యను కూడా పెంచుకోనుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటిల్లో జీఐసీ, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌తో పాటు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థలు ఉన్నాయి. ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. సెప్టెంబర్ నాటికి 1,000 మంది పైగా ఇంజనీర్లను తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 100 నగరాల్లో కార్యకలాపాలు, 500 మంది ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారన్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన ట్యాక్సీఫర్‌ష్యూర్ విస్తరణకు 100 మిలి యన్ డాలర్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. -
ట్యాక్సీ యాప్‌లకు త్వరలో కళ్లెం
దేశవ్యాప్తంగా అడ్డుకట్టపడే అవకాశం కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ: యాప్ ఆధారిత ట్యాక్సీ రంగంలో ఉన్న ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి కంపెనీల సేవలకు దేశవ్యాప్తంగా కళ్లెం పడే అవకాశం ఉంది. ఇటువంటి కంపెనీల యాప్స్‌ను వినియోగించకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ(డైటీ) ఈ మేరకు రవాణా శాఖ అభిప్రాయం కోరింది. కేవలం ఒక రాష్ట్రంలోనే యాప్స్ వినియోగాన్ని కట్టడి చేయడం సాంకేతికంగా సాధ్యం కానందున.. దేశవ్యాప్తంగా బ్లాక్ చేయడం కోసం కేంద్ర రవాణా శాఖను డైటీ ఆశ్రయించింది. డైటీ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, అనధికార ట్యాక్సీ సర్వీసులతో భద్రత ప్రశ్నార్థకమంటూ వివిధ రాష్ట్రాల్లో రవాణా శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ట్యాక్సీ కంపెనీల యాప్‌ల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికం సంస్థలకు డైటీ నుంచి ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది. పెండింగులో దరఖాస్తులు.. ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళను గతేడాది డిసెంబరు 5న ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉబర్తోసహా యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై అదే నెలలో ఢిల్లీలో నిషేధం విధించారు. లెసైన్సు పొందేవరకు సర్వీసులను నిలిపివేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ తదితర కంపెనీలు దేశ రాజధానిలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు రేడియో ట్యాక్సీ లెసైన్సు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దరఖాస్తులను పరిశీలించాలంటే సర్వీసులను నిలిపివేయాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం పలు కంపెనీలకు మార్చి చివరివారంలో స్పష్టం చేసింది. నిషేధం అమలులోకి రావాలంటే యాప్స్‌ను బ్లాక్ చేయడం ఒక్కటే మార్గమన్నది అధికారుల ఆలోచన. -
క్యాబ్ బ్రాండ్ ఏదైనా ఒకే ట్యాక్సీ!
సులువుగా బ్రాండ్ మార్చేస్తున్న ట్యాక్సీ ఓనర్లు - కుదిపేస్తున్న నగదు ప్రోత్సాహకాలు - ట్యాక్సీ రంగంలో తారస్థాయికి చేరిన పోటీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక కారు.. నాలుగు బ్రాండ్లు! ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంపెనీల ‘నగదు ప్రోత్సాహకాల’ పుణ్యమా అని ట్యాక్సీ సేవల రంగంలో వింత పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక బ్రాండ్‌కే పరిమితమైన క్యాబ్‌లు.. నేడు అన్ని బ్రాండ్లకు సేవలందిస్తున్నాయి. బ్రాండ్ పేర్లతో పెద్ద పెద్ద స్టిక్కర్లతో పరుగులు తీసిన కార్లు ఇప్పుడు అవేవీ లేకుండానే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయలను ఇన్వెస్టర్లు, పీఈ సంస్థల నుంచి పెట్టుబడిగా స్వీకరిస్తున్న క్యాబ్ కంపెనీలు ఆ మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో బ్రాండింగ్‌కు ఖర్చు చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీతో కనీస చార్జీ కిలోమీటరుకు రూ.10కి తగ్గిపోయింది. వాస్తవానికి చిన్న కార్లకు కిలోమీటరుకు వ్యయం అటూ ఇటుగా రూ.10 అవుతుంది. ఇంత తక్కువ చార్జీతో కారు నడపడం నష్టంతో కూడుకున్నది. అందుకే క్యాబ్ కంపెనీలు పోటీపడి మరీ కారు యజమానులను ‘నగదు’తో ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల పోటీ కాస్తా కారు యజమానులకు కాసులు కురిపిస్తోంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం కూడా కారు యజమానికే చేరుతుంది. చాలా మంది డ్రైవర్లు కారును కొనుక్కుని క్యాబ్ కంపెనీలకు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎక్కువగా ఇన్సెంటివ్ ఇచ్చే కంపెనీ బ్రాండ్‌తో కార్లను నడిపారు. ప్రోత్సాహకాల భారం తడిసిమోపెడవడంతో ఈ మొత్తాన్ని క్యాబ్ సంస్థలు ఇటీవల తగ్గించి వేశాయి. దీంతో కారు యజమానులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎటువంటి బ్రాండ్ లేకుండానే కార్లను నడుపుతున్నారు. అన్ని కంపెనీలకు చెందిన మొబైల్ డివైస్‌లను కారులో ఉంచుతున్నారు. ఏ మొబైల్కైతే ఎస్ఎంఎస్ వస్తుందో ఆ బుకింగ్‌ను స్వీకరిస్తున్నారు. ఇలా అన్ని కంపెనీలతో ‘టచ్’లో ఉంటున్నారు. క్యాబ్ కంపెనీ యాప్ మాత్రమే పనిచేసే మొబైల్ పరికరం కార్లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ డివైస్‌ను కంపెనీలు ఉచితంగా ఇస్తున్నాయి. దీని ఆధారంగానే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి కస్టమర్‌ను అనుసంధానిస్తారు. ఊహించని స్థాయిలో.. ఓలా, జినీ, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్లు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని కారు యజమానులు చెబుతున్నారు. ఒకానొక దశలో రోజుకు 10 ట్రిప్పులకుగాను కంపెనీలు రూ.3 వేల దాకా చెల్లించాయని తెలిపారు. చెల్లింపుల వ్యవహారం 2014 డిసెంబర్లో తార స్థాయికి చేరుకుంది. ఓలా రోజుకు 10 ట్రిప్పులకు రూ.6 వేల దాకా అదనంగా ముట్టజెప్పిందని ఒక కారు యజమాని వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి ఈ మొత్తాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే కంపెనీలు ప్రోత్సాహకాల మొత్తాన్ని సవరించగానే ఎక్కువగా ఇచ్చే కంపెనీ వైపుకు కార్లు దూసుకెళ్లాయి. సింపుల్‌గా కారుపై ఉన్న స్టిక్కర్లను మార్చేవారు. ప్రస్తుతం వివిధ కంపెనీలు 12 ట్రిప్పులకుగాను రూ.750 మాత్రమే అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకేముంది అన్ని కంపెనీలకూ అది కూడా ఏ స్టిక్కరూ లేకుండానే కార్లు తిరుగుతున్నాయి. నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకేనని చెప్పారు. ఇదిలావుంటే తక్కువ చార్జీల భారం నుంచి కొంతైనా బయటపడేందుకు పీక్ సమయాల్లో చార్జీలను కంపెనీలు సవరించాయి. ఉదయం 7.30-10, సాయంత్రం 5.30-8 వరకు కొంత మొత్తాన్ని అదనంగా చార్జీ చేస్తున్నాయి. యాప్‌తో బుక్ చేస్తే.. క్యాబ్ కంపెనీల మధ్య పోటీ ఏ స్థాయికి చేరిందంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్‌ను ఉచితంగా అందించే వరకు వెళ్లింది. ప్రస్తుతం యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక చేసే తొలి ట్రిప్‌కు రూ.150 డిస్కౌంట్‌ను మేరు, జినీ క్యాబ్స్ ఇస్తున్నాయి. కరెంట్, నౌ స్టేటస్‌పై మేరు, మేరు ఫ్లెక్సీ కార్లకు 25% తగ్గింపు పొందవచ్చు. సిటీ ట్యాక్సీ బుకింగ్‌పై రూ.200 తగ్గింపును ఓలా అందిస్తోంది. ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. -
ఓలా చేతికి ట్యాక్సీ ఫర్ ష్యూర్
డీల్ విలువ రూ.1,240 కోట్లు - రోజుకు 1,000 వాహనాలు ఓలా సేవల ఖాతాలోకి... - డిసెంబర్‌కల్లా 200 నగరాలకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ క్యాబ్ సేవల రంగంలో ఉన్న ఓలా క్యాబ్స్ భారీ డీల్‌కు తెరలేపింది. క్యాబ్ సేవల్లో ఉన్న పోటీ కంపెనీ ట్యాక్సీ ఫర్ ష్యూర్‌ను సుమారు రూ.1,240 కోట్లకు కొనుగోలు చేసింది. కంజ్యూమర్ ఇంటర్నెట్ రంగంలో ఫ్లిప్‌కార్ట్-మింత్రాల రూ.2,260 కోట్ల డీల్ తర్వాతి స్థానాన్ని ఇది కైవసం చేసుకుంది. ఇక డీల్ అనంతరం కూడా ట్యాక్సీ ఫర్ ష్యూర్ తన సేవలను కొనసాగిస్తుంది. ఒక లక్షకుపైగా వాహనాలతో క్యాబ్ సర్వీసుల్లో ఓలా దేశంలో అగ్రస్థానంలో ఉంది. రూ.49లకే కారులో ప్రయాణించే సౌకర్యాన్ని తీసుకొచ్చిన ట్యాక్సీ ఫర్ ష్యూర్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపింది. ఉత్సాహభరిత విధానాన్ని ఈ కంపెనీ అమలు చేసిందంటూ ఓలా సీఈవో, సహ వ్యవస్థాపకులు భవీశ్ అగర్వాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ట్యాక్సీ ఫర్ ష్యూర్ వద్ద 15,000లకుపైగా వాహనాలున్నాయి. క్యాబ్ ఆపరేటర్లతో సరఫరా, పంపిణీ విధానంలో పనిచేస్తోంది. ఓలా అందుకు భిన్నంగా డ్రైవర్-ఓనర్ విధానాన్ని అమలు చేస్తోంది. రోజుకు 1,000 వాహనాలు.. ఓలా క్యాబ్స్ ప్రస్తుతం 67 నగరాల్లో సర్వీసులందిస్తోంది. 2015 డిసెంబర్ నాటికి 200 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా చేసుకుంది. రోజుకు 1,000 వాహనాలు జతకూడుతున్నాయి. ఇందులో కార్లు 70%, ఆటోలు 30% ఉంటాయని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఎస్బీఐ సహకారంతో రోజు వారీ చెల్లింపుల విధానం భారత్‌లో సంచలనం సృష్టిస్తోందని అన్నారు. ‘భారత్‌లో 100 మందిలో కారు యజమానుల సంఖ్య కేవలం 3 శాతమే. అందుకే క్యాబ్స్‌కు డిమాండ్ గణనీయంగా ఉంటుంది. ఇక డ్రైవర్లకు కంపెనీ ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలి. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్‌రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అలాగే ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకే’ అని అన్నారు. 47 నగరాల్లో సేవలందిస్తున్న ట్యాక్సీ ఫర్ ష్యూర్ ఎకానమీ విభాగంలో మార్కెట్లో పట్టు సాధించిందని చెప్పారు. ఓలా మధ్య, ప్రీమియం విభాగాల్లో ఉందని తెలిపారు. -
ట్యాక్సీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటాం!
ముంబై: ఉబర్ డ్రైవర్ అత్యాచార ఉదంతం తర్వాత తీవ్ర నియంత్రణలో ఉన్న ట్యాక్సీ కంపెనీలన్నీ ఒక ఆసోసియేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నాయి. ‘మేమంతా కలిసే ఉన్నాం అని ప్రభుత్వానికి తెలిపేందుకు ఓ అసోసియేషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ‘ఉబెర్’ ఘటన తర్వాత చాలా టాక్సీ కంపెనీల మీద ప్రభుత్వం నిషేధం విధిం చింది. అన్ని కంపెనీల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు. పరిశ్రమకు న్యాయం చేయాలంటే ఏకీకృత జాతీయ సంస్థ ఏర్పాటు చేయాలి. అంతేకానీ ఆర్టీవోలతో కాదు’ అని టాక్సీ ఫర్ ష్యూర్(టీఎఫ్ఎస్) వ్యవస్థాపక డెరైక్టర్ అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. తమ కంపెనీ టాక్సీలు అంత సురక్షితం కాదనే ఆరోపణలను ఆయన ఖండించారు. డ్రైవర్లు, టాక్సీ సమాచారం అంతా మ్యాపింగ్ చేస్తామని తెలిపారు. బెంగళూరులో ఆటోలు, నానో కార్లతో విజయవంతంగా కంపెనీ సేవలు ప్రారంభించామని, త్వరలో ముంబైలో మొదలు పెడతామని ఆయన తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 100 నగరాల్లో తమ సేవలు విస్తరించనున ్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం రోజుకు 40 వేల ట్రిప్పులు, 47 కన్నా ఎక్కువ నగరాల్లో తిరుగుతున్నట్లు చెప్పారు. సొంతంగా కార్లు లేకున్నా 22 వేల ఆపరేటర్లను 10 శాతం చార్జ్‌తో నడుపుతున్నామని ఆయన వివరించారు. కాల్ సెంటర్ ద్వారానే సర్వీసులు నడుపుతున్నా.. ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్స్ చేస్తున్నామని ఆయన చెప్పారు. -
ప్రైవేట్ ట్యాక్సీలపై ఆర్టీవో కొరడా
నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు * పీవీఎస్ఏ బ్యాడ్జీలు ఉన్న ట్యాక్సీలే తిరగాలని హుకుం * రేడియో ట్యాక్సీలకు సైతం బ్యాడ్జీలు తప్పనిసరి * త్వరలో ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ ప్రారంభం సాక్షి, ముంబై: ఆర్టీవో అధికారులు వాహన నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ట్యాక్సీ డ్రైవర్లపై చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో నగరంలోని 27 శాతం ప్రైవేట్ ట్యాక్సీలు ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రవాణా అధికారి ఒకరు మాట్లాడుతూ.. టూరిస్ట్ ట్యాక్సీలను నడిపేందుకు కావాల్సిన బ్యాడ్జీలు లేకపోవడంతో చాలా మంది డ్రైవర్లు సేవలకు దూరంగా ఉన్నారని తెలిపారు. ప్రతి డ్రైవరు పబ్లిక్ సర్వీస్ వెహికిల్ అథరైజేషన్ (పీవీఎస్ఏ) బ్యాడ్జీలను కలిగి ఉండాలన్నారు. రేడియో ట్యాక్సీలతోపాటు టూరిస్ట్ వాహన డ్రైవర్లు కూడా ఈ బ్యాడ్జీలను కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. తాము కొన్ని రోజులుగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో దాదాపు వెయ్యి మంది డ్రైవర్లకు బ్యాడ్జీలు లేనట్లుగా గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే రేడియో ట్యాక్సీలు, టూరిస్టూ వాహనదారులకు కూడా బ్యాడ్జీలు లేని డ్రైవర్లకు వాహనాలు అప్పగించవద్దని రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసిందన్నారు. అదేవిధంగా క్యాబ్‌లలో భద్రతాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా క్యాబ్ కంపెనీలను ఆదేశించామని చెప్పారు. క్యాబ్‌ల్లో జీపీఎస్ వ్యవస్థ, మొబైల్ యాప్స్‌లలో ఎస్ఓఎస్ బటన్ తదితర ప్రాథమిక భద్రతా చర్యలను క్యాబ్‌లలో అందుబాటులో ఉంచనట్లయితే సదరు కంపెనీలు వాహనాలను నడిపేందుకు లెసైన్సులను సస్పెండ్ చేస్తామని హెచ్చరించామన్నారు. ఇటీవల రవాణా శాఖ కమిషనర్ మహేష్ జగాడే ట్యాక్సీ నిర్వాహకులతో ఓ సమావేశం నిర్వహించారు. ట్యాక్సీలలో భద్రతా పరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సదరు క్యాబ్‌లలో ఏదైనా నేరం జరిగితే దానికి కంపెనీయే జవాబుదారీ వహించాల్సి వస్తుందన్నారు. అంతేకాకుండా కంపెనీ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. దీంతో ‘మేరు ప్లస్’ కంపెనీ తమ ఐదు ట్యాక్సీల్లో ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్ స్విచ్’లను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా ‘ట్యాక్సీ ఫర్ ష్యూర్’ను కూడా ప్రారంభించనున్నట్లు ఆర్టీవో అధికారి పేర్కొన్నారు. ఈ వ్యవస్థతో ప్రయాణికులు పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు. ఇక్కడ స్విచ్ వేయడం ద్వారా జీపీఎప్ వ్యవస్థ ద్వారా కంట్రోల్ రూంలో ఉన్న పోలీసులకు సదరు డ్రైవరు పూర్తి వివరాలు, వాహనం ఏ ప్రాంతంలో ఉందో తెలుస్తుందని అధికారి తెలిపారు. నిర్భయ పథకం ద్వారా దీనిని వాహనాల్లో అమర్చనున్నట్లు అధికారి వివరించారు. -
హైదరాబాద్‌లో ఓలా క్యాబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ సర్వీసులందిస్తున్న ఓలా క్యాబ్స్ హైదరాబాద్‌లో అడుగుపెడుతోంది. మే మూడో వారంలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. సిటీ ట్యాక్సీ, ఔట్ స్టేషన్, లోకల్ రెంటల్స్ ఇలా మూడు విభాగాలుగా సేవలు అందిస్తామని చెప్పారు. కంపెనీ తొలి విడతగా 200-250 కార్లను ప్రవేశపెడుతోంది. తొలుత సెడాన్ కార్లను అందుబాటులోకి తేనున్నారు. రానున్న రోజుల్లో ప్రీమియం విభాగంలో ఆడి, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లను పరిచయం చేయనున్నారు. పగలు, రాత్రి... ఏ సమయంలో బుక్ చేసినా ఒకే రకమైన చార్జీ ఉంటుంది. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, బెంగళూరుతోసహా ఏడు నగరాల్లో ఓలా సేవలందిస్తోంది. 9,000 పైగా కార్లున్నాయి. రోజుకు 15 వేలకుపైగా కాల్స్ అందుకుంటోంది. ఓలా మినీ పేరుతో చిన్న కార్లతో సేవలందిస్తోంది కూడా. వీటికి రూ.100 కనీస చార్జీ. 6 కిలోమీటర్ల తర్వాత కి.మీ.కు రూ.13 చార్జీ ఉంటుంది. ఇక లగ్జరీ కార్లకు కనీస చార్జీ రూ.200. 2 కిలోమీటర్ల తర్వాత కారు మోడల్‌నుబట్టి చార్జీ వసూలు చేస్తారు. ఇద్దరు యువకులు..: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఓలా క్యాబ్స్‌ను భవీష్ అగర్వాల్, అంకిత్ భాటి ప్రారంభించారు. వీరిద్దరూ ఐఐటీ ముంబైలో చదువుకున్నవారే. జనవరి 2011న ఓలా ప్రారంభమైంది. కొద్ది కాలంలోనే క్యాబ్ సేవల్లో దేశంలో అతి పెద్ద సంస్థగా ఎదిగింది. 9,000 కార్లలో ఒక్కటి కూడా సంస్థ సొంతం కాదు. ఔత్సాహిక యువకులకు కార్లను ఇప్పించి, వాటిని సంస్థ బ్రాండ్‌పైన వినియోగిస్తోంది. బుకింగ్స్ ఆధారంగా డ్రైవర్లకు చెల్లింపులు జరుపుతారు. ఆసక్తికర అంశమేమంటే ఓలా క్యాబ్స్ అప్లికేషన్ ద్వారా కారును బుక్ చేసుకుంటే.. ప్రయాణికుడు ఎక్కడున్నా జీపీఎస్ ఆధారంగా డ్రైవరుకు ఇట్టే తెలిసిపోతుంది.