ట్యాక్సీ యాప్‌లకు త్వరలో కళ్లెం
దేశవ్యాప్తంగా అడ్డుకట్టపడే అవకాశం
కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: యాప్ ఆధారిత ట్యాక్సీ రంగంలో ఉన్న ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ వంటి కంపెనీల సేవలకు దేశవ్యాప్తంగా కళ్లెం పడే అవకాశం ఉంది. ఇటువంటి కంపెనీల యాప్స్‌ను వినియోగించకుండా అడ్డుకట్ట వేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన నేపథ్యంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ(డైటీ) ఈ మేరకు రవాణా శాఖ అభిప్రాయం కోరింది. కేవలం ఒక రాష్ట్రంలోనే యాప్స్ వినియోగాన్ని కట్టడి చేయడం సాంకేతికంగా సాధ్యం కానందున.. దేశవ్యాప్తంగా బ్లాక్ చేయడం కోసం కేంద్ర రవాణా శాఖను డైటీ ఆశ్రయించింది. డైటీ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రవాణా శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా, అనధికార ట్యాక్సీ సర్వీసులతో భద్రత ప్రశ్నార్థకమంటూ వివిధ రాష్ట్రాల్లో రవాణా శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ట్యాక్సీ కంపెనీల యాప్‌ల ఐపీ అడ్రస్‌లను బ్లాక్ చేయాల్సిందిగా టెలికం సంస్థలకు డైటీ నుంచి ఆదేశాలు వెళ్లే అవకాశం ఉంది.
పెండింగులో దరఖాస్తులు..
ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న మహిళను గతేడాది డిసెంబరు 5న ఉబర్ క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఉబర్‌తోసహా యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసులపై అదే నెలలో ఢిల్లీలో నిషేధం విధించారు. లెసైన్సు పొందేవరకు సర్వీసులను నిలిపివేయాలన్న ఆదేశాలు ఉన్నప్పటికీ ఉబర్, ఓలా, ట్యాక్సీ ఫర్ ష్యూర్ తదితర కంపెనీలు దేశ రాజధానిలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు రేడియో ట్యాక్సీ లెసైన్సు కోసం చేసుకున్న దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. దరఖాస్తులను పరిశీలించాలంటే సర్వీసులను నిలిపివేయాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం పలు కంపెనీలకు మార్చి చివరివారంలో స్పష్టం చేసింది. నిషేధం అమలులోకి రావాలంటే యాప్స్‌ను బ్లాక్ చేయడం ఒక్కటే మార్గమన్నది అధికారుల ఆలోచన.