క్యాబ్ బ్రాండ్ ఏదైనా ఒకే ట్యాక్సీ!
సులువుగా బ్రాండ్ మార్చేస్తున్న ట్యాక్సీ ఓనర్లు
- కుదిపేస్తున్న నగదు ప్రోత్సాహకాలు
- ట్యాక్సీ రంగంలో తారస్థాయికి చేరిన పోటీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒక కారు.. నాలుగు బ్రాండ్లు! ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు కంపెనీల ‘నగదు ప్రోత్సాహకాల’ పుణ్యమా అని ట్యాక్సీ సేవల రంగంలో వింత పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు ఒక బ్రాండ్‌కే పరిమితమైన క్యాబ్‌లు.. నేడు అన్ని బ్రాండ్లకు సేవలందిస్తున్నాయి. బ్రాండ్ పేర్లతో పెద్ద పెద్ద స్టిక్కర్లతో పరుగులు తీసిన కార్లు ఇప్పుడు అవేవీ లేకుండానే నడుస్తున్నాయి. కోట్లాది రూపాయలను ఇన్వెస్టర్లు, పీఈ సంస్థల నుంచి పెట్టుబడిగా స్వీకరిస్తున్న క్యాబ్ కంపెనీలు ఆ మొత్తాన్ని ప్రోత్సాహకాల రూపంలో బ్రాండింగ్‌కు ఖర్చు చేస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
క్యాబ్ కంపెనీల మధ్య పోటీతో కనీస చార్జీ కిలోమీటరుకు రూ.10కి తగ్గిపోయింది. వాస్తవానికి చిన్న కార్లకు కిలోమీటరుకు వ్యయం అటూ ఇటుగా రూ.10 అవుతుంది. ఇంత తక్కువ చార్జీతో కారు నడపడం నష్టంతో కూడుకున్నది. అందుకే క్యాబ్ కంపెనీలు పోటీపడి మరీ కారు యజమానులను ‘నగదు’తో ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల పోటీ కాస్తా కారు యజమానులకు కాసులు కురిపిస్తోంది. ప్రయాణికులు చెల్లించే మొత్తం కూడా కారు యజమానికే చేరుతుంది. చాలా మంది డ్రైవర్లు కారును కొనుక్కుని క్యాబ్ కంపెనీలకు నడుపుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటి వరకు ఎక్కువగా ఇన్సెంటివ్ ఇచ్చే కంపెనీ బ్రాండ్‌తో కార్లను నడిపారు. ప్రోత్సాహకాల భారం తడిసిమోపెడవడంతో ఈ మొత్తాన్ని క్యాబ్ సంస్థలు ఇటీవల తగ్గించి వేశాయి. దీంతో కారు యజమానులు కొత్త విధానాన్ని అనుసరిస్తున్నారు. ఎటువంటి బ్రాండ్ లేకుండానే కార్లను నడుపుతున్నారు. అన్ని కంపెనీలకు చెందిన మొబైల్ డివైస్‌లను కారులో ఉంచుతున్నారు. ఏ మొబైల్‌కైతే ఎస్‌ఎంఎస్ వస్తుందో ఆ బుకింగ్‌ను స్వీకరిస్తున్నారు. ఇలా అన్ని కంపెనీలతో ‘టచ్’లో ఉంటున్నారు. క్యాబ్ కంపెనీ యాప్ మాత్రమే పనిచేసే మొబైల్ పరికరం కార్లలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ డివైస్‌ను కంపెనీలు ఉచితంగా ఇస్తున్నాయి. దీని ఆధారంగానే డ్రైవర్‌కు సమాచారం ఇచ్చి కస్టమర్‌ను అనుసంధానిస్తారు.
ఊహించని స్థాయిలో..
ఓలా, జినీ, ట్యాక్సీ ఫర్ ష్యూర్, ఉబర్‌లు నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని కారు యజమానులు చెబుతున్నారు. ఒకానొక దశలో రోజుకు 10 ట్రిప్పులకుగాను కంపెనీలు రూ.3 వేల దాకా చెల్లించాయని తెలిపారు. చెల్లింపుల వ్యవహారం 2014 డిసెంబర్‌లో తార స్థాయికి చేరుకుంది. ఓలా రోజుకు 10 ట్రిప్పులకు రూ.6 వేల దాకా అదనంగా ముట్టజెప్పిందని ఒక కారు యజమాని వెల్లడించారు. జనవరి మూడో వారం నుంచి ఈ మొత్తాన్ని తగ్గించిందని చెప్పారు. అయితే కంపెనీలు ప్రోత్సాహకాల మొత్తాన్ని సవరించగానే ఎక్కువగా ఇచ్చే కంపెనీ వైపుకు కార్లు దూసుకెళ్లాయి. సింపుల్‌గా కారుపై ఉన్న స్టిక్కర్లను మార్చేవారు.
ప్రస్తుతం వివిధ కంపెనీలు 12 ట్రిప్పులకుగాను రూ.750 మాత్రమే అదనంగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇంకేముంది అన్ని కంపెనీలకూ అది కూడా ఏ స్టిక్కరూ లేకుండానే కార్లు తిరుగుతున్నాయి. నగదు ప్రోత్సాహకాలను పెట్టుబడిగా భావించాలని ఓలా మార్కెటింగ్ డెరైక్టర్ ఆనంద్ సుబ్రమణియన్ అన్నారు. ప్రతిభ కనబరిచే డ్రైవర్లకు స్టార్ రేటింగ్ ఆధారంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఆకర్షించే చార్జీలు, ఆఫర్లు కస్టమర్లను ప్రోత్సహించేందుకేనని చెప్పారు. ఇదిలావుంటే తక్కువ చార్జీల భారం నుంచి కొంతైనా బయటపడేందుకు పీక్ సమయాల్లో చార్జీలను కంపెనీలు సవరించాయి. ఉదయం 7.30-10, సాయంత్రం 5.30-8 వరకు కొంత మొత్తాన్ని అదనంగా చార్జీ చేస్తున్నాయి.
యాప్‌తో బుక్ చేస్తే..
క్యాబ్ కంపెనీల మధ్య పోటీ ఏ స్థాయికి చేరిందంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే తొలి రైడ్‌ను ఉచితంగా అందించే వరకు వెళ్లింది. ప్రస్తుతం యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాక చేసే తొలి ట్రిప్‌కు రూ.150 డిస్కౌంట్‌ను మేరు, జినీ క్యాబ్స్ ఇస్తున్నాయి. కరెంట్, నౌ స్టేటస్‌పై మేరు, మేరు ఫ్లెక్సీ కార్లకు 25% తగ్గింపు పొందవచ్చు. సిటీ ట్యాక్సీ బుకింగ్‌పై రూ.200 తగ్గింపును ఓలా అందిస్తోంది. ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.