ఏమో.. ఎప్పుడైనా నిలిపేయచ్చు
– ఎల్లెల్సీకి నీటి విడుదల కొనసాగింపుపై టీబీ బోర్డు ఎస్ఈ
– ఈఈ, ఎస్డీఓతో కలిసి కాల్వపై పర్యటన
హోళగుంద : తుంగభద్ర దిగువ కాల్వ (ఎల్లెల్సీ)కు నీటి విడుదల కొనసాగింపుపై ఎస్ఈ శశిభూషణ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. ఆయకట్టులో సాగు చేసిన పంటల పరిస్థితి, సాగు చేయబోయే పంటలకు సంబంధించి ఆయకట్టు రైతులు క్లారిటీ కోసం ప్రయత్నించగా ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదు. పరిస్థితిని బట్టి ఎప్పుడైనా నీటి విడుదలను నిలిపేసే అవకాశం ఉందని తెలిపారు. కర్ణాటకలో జలచౌర్యం జరుగుతుండడం వాస్తవమేనని అంగీకరించారు. హాలహర్వీ మండలం గూళ్యం వద్ద శుక్రవారం రాత్రి టీబీ బోర్డు అధికారులు, రైతుల మధ్య వివాదం చోటుచేసుకున్న నేపథ్యంలో శనివారం ఈఈ విశ్వనాథరెడ్డి, ఎస్డీఓ పంపనగౌడ్తో కలిసి ఆయన కాల్వపై పర్యటించారు. సిబ్బంది, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం హŸళగుందలోని టీబీపీ గెస్ట్‌హౌస్‌లో బోర్డు అధికారులు, ఎల్లెల్సీ ప్రాజెక్ట్ చైర్మన్ కుమార్‌గౌడ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాలు ప్రస్తుత నీటి నిల్వలో నిర్ణయించిన నీటి వాటాలను అందించేందుకు ప్రయత్నిస్తామన్నారు. డ్యాంలో 62 టీఎంసీల నీరు నిల్వ ఉంటే వరి పంటకు ఇబ్బంది ఉండదని చెప్పిన ఆయన ప్రస్తుతం 44 టీఎంసీలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు.
ఈ పరిస్థితిలో దిగువ కాల్వ(ఎల్లెల్సీ) ఎప్పుడు నీటి సరఫరాను నిలిపివేస్తామో చెప్పలేమన్నారు. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. ఇప్పటికే సాగైన పంటల గురించి తామేమి చెప్పలేమని తెలిపారు. రైతులు సహకరించాలని ఆయన కోరారు.
గూళ్యం రైతుల ఫిర్యాదు..
ఎస్డీఓ మల్లికారునతో శుక్రవారం రాత్రి దిగువ కాల్వపై వాగ్వాదానికి దిగిన గూళ్యం రైతులు శనివారం కుమార్‌గౌడ్‌తో కలిసి ఎస్ఈకి ఫిర్యాదు చేశారు. ఎండుతున్న పంటలకు సాగునీరు అందించాలని కోరగా దురుసుగా ప్రవర్తించారని ఆయన దష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిన్నహ్యాట శేషగిరి, గాలి వీరభద్రగౌడ్, పంపాపతి, దురుగప్ప, తోక వెంకటేశ్, దిడ్డి వెంకటేశ్, వేణు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.