ఊహించని ప్రశ్నలు.. ప్రవర్తనా ఆధారిత ఇంటర్వ్యూ!
కంపెనీ విజయం.. అందులో పనిచేసే సిబ్బందిపైనే ఆధారపడి ఉంటుంది. సంస్థకు వీరు పునాదిరాయిలాంటివారు. పునాది బలంగా ఉంటే భవనం ఎక్కువకాలం నిలిచి ఉంటుంది. సిబ్బంది సమర్థులైతే సంస్థ లాభాల బాటలో సాగుతుంది. కాబట్టి వర్క్‌ఫోర్స్‌ను ఎంపిక చేసుకొనే విషయంలో యాజమాన్యాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. రకరకాల పరీక్షలను, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంటాయి. వడపోతల అనంతరం అర్హులుగా తేలినవారినే సంస్థలో చేర్చుకుంటాయి. అభ్యర్థులను పరీక్షించేందుకు ఇంటర్వ్యూలను జరుపుతారు. వారి గుణగణాలను, మాటతీరును, శరీర భాషను, ప్రవర్తనను ఇందులో అంచనా వేస్తుంటారు.
మౌఖిక పరీక్షలో సాధారణంగా అడిగే ప్రశ్నలు తెలుసు కాబట్టి అభ్యర్థులు తదనుగుణంగా ముందుగానే సమాధానాలతో సిద్ధమైపోతుంటారు. అసలు ఏమాత్రం ఊహించలేని ప్రశ్నలు అడిగితే అభ్యర్థులు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం. ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడే వారి నిజమైన వ్యక్తిత్వం బయటపడుతుంది. వారిలోంచి అసలు మనిషి వెలుపలికి వస్తాడు. దీంతో వారు తగిన అభ్యర్థులా? కాదా? అనే విషయం తెలుసుకోవచ్చు. ఇలా తెలుసుకొనేందుకు వీలైన విధానమే.. బిహేవియరల్ స్టైల్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూల పట్ల ఇటీవలి కాలంలో రిక్రూటర్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఊహించలేని ప్రశ్నలు వేసి, అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కనుక ఈ తరహా మౌఖిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో తెలుసుకుంటే విజయం సులభసాధ్యం అవుతుంది.
సమయస్ఫూర్తి.. ప్రధానం
బిహేవియరల్ బేస్డ్ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడే మనసులో సమాధానాలను సిద్ధం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. ఐదేళ్ల తర్వాత ఎక్కడ, ఎలా ఉండాలనుకుంటున్నారు? అని అడుగుతారు. దీనికి సమాధానం చాలామంది దగ్గర ఉండదు. కనుక ఈ ఇంటర్వ్యూల క్లిష్టత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మీరు ఇటీవలి కాలంలో సాధించిన విజయాలు, పొందిన పరాజయాలను వివరించండి అని అడిగే అవకాశం ఉంటుంది. ప్రవర్తన ఆధారిత మౌఖిక పరీక్షల్లో సమయస్ఫూర్తి చాలా ముఖ్యం.
కష్టమే అయినా అసాధ్యం కాదు
వీటిలో అడిగే ప్రశ్నలను ఊహించడం కష్టమే అయినా అసాధ్యం మాత్రం కాదని నిపుణులు అంటున్నారు. ప్రధానంగా సమస్య పరిష్కార నైపుణ్యాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం వంటి కోర్ కాంపిటెన్సీలపైప్రశ్నలుంటాయి. అవి మీలో ఉన్నాయో లేదో అంచనా వేస్తారు. ఇంకా మీ రంగానికి సంబంధించినవి కూడా అడుగుతారు. మీ రంగంపై పూర్తి పరిజ్ఞానం పెంచుకుంటే ఎలాంటి ప్రశ్న వేసినా సమాధానం చెప్పడం కష్టమేమీ కాదు. ఇంటర్వ్యూ అంటే అర్థం కాని మిస్టరీగా భావించొద్దు. ఏయే ఉద్యోగాల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. ఉదాహరణకు టీమ్ ప్లేయర్ పో స్టుకు ఇంటర్వ్యూ నిర్వహిస్తే దానికి సంబంధిం చిన ప్రశ్నను సంధిస్తారు. కాబట్టి సదరు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం సేకరించి పెట్టుకోవాలి. కంపెనీతోపాటు దానికి పోటీగా నిలిచిన కం పెనీల గురించి కూడా పరిశోధించాలి. సేకరించిన వివరాలను బట్టి ఇంటర్వ్యూకు ప్రిపేర్ కావాలి.
వివరణాత్మక సమాధానాలు
ప్రవర్తన ఆధారిత మౌఖిక పరీక్షలో అభ్యర్థులు సమాధానాలను వివరణాత్మకంగా చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పే ప్రతి అంశానికి ఆధారం ఉండాలి. ఇందులో ఎందుకు, ఏమిటి, ఎలా, ఎవరు, ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రిక్రూటర్‌కు లభించాలి. అభ్యర్థిని సరిగ్గా అంచనా వేసేందుకు, అతడు భవిష్యత్తులో విజయాలు సాధించగలడా? లేదా? అనే విషయాన్ని గుర్తించేందుకు రిక్రూటర్లు బిహేవియరల్ స్టైల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. వీటికి ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది.