Technology Development Center
-
ఆన్లైన్ ఆట.. ఉపాధికి బాట
ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లవాడు మొదలు పెద్దల వరకు అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు, గ్యాడ్జిట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో మరింత వేగంగా దూసుకువస్తున్న రంగం ఆన్లైన్ గేమ్స్. కోట్లాది రూపాయల టర్నోవర్లతో వీడియో గేమ్స్ నడుస్తున్నాయంటే ఈ రంగం ప్రాధాన్యత అర్థమవుతోంది. ఇందులో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదనేది నిపుణుల మాట. అంతటి ప్రాధాన్యత కలిగిన గేమ్ టెక్నాలజీని కడప నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ పేరుతో నూతనంగా కోర్సును ఏర్పాటు చేశారు. ఏఎఫ్‌యూ (వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం కల్పించేలా రూపుదిద్దుకున్న ఈ కోర్సు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న రంగంగా నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ అరుదైన కోర్సు కడపలో ఏర్పాటు చేయడం విశేషం. కేవలం పిల్లలను సెల్ఫోన్లకే పరిమితం చేసే గేమ్స్ కొన్ని ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగకరమైన అంశాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా చిన్నారులకు అందించే అవకాశం ఉంది. చిన్నారుల్లో ఏకాగ్రతను, మేధోశక్తిని పెంపొందించడంలో ఈ సాంకేతికత దోహదపడుతుంది. అయితే సృజనాత్మకంగా ఆలోచించగలిగే వారికి ఇందులో చక్కటి అవకాశాలు లభిస్తాయి. కోర్సులో ఏమి నేర్పుతారంటే.. బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీలో విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తారు. జావా, యూనిటీ, బ్లెండర్, మాయ, ఫొటోషాప్, 3డీ మోడలింగ్, ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి వినూత్న అంశాలు ఈ కోర్సులో నేర్పుతారు. మల్టీ టాస్కింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్పెషలైజ్డ్ కోర్సుగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కోర్సు ప్రభుత్వ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులో ఉంది. ప్రవేశం ఎలా.. 10 ప్లస్ 2 (ఎంపీసీ) చదివిన విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం ఈ యేడాది నుంచి ప్రారంభించిన ఏపీ ఈఏపీసెట్–2021 ద్వారా ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు నాలుగు సంవత్సరాలు. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలు వర్తిస్తాయి. అవకాశాలు ఇలా.. గేమ్ టెక్నాలజీస్‌లో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సినిమా రంగం, మల్టీమీడియా, సాఫ్ట్వేర్, యానిమేషన్, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గేమింగ్ టెక్నాలజీపై పట్టు సాధించిన వారికి లక్షల్లో వేతనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవకాశాల వెల్లువ-– సి. శ్రీలక్ష్మి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప గేమింగ్ అన్నది కేవలం వినోదాత్మకంగానే కాకుండా ఇప్పటి ఆధునిక ప్రపంచంలో బ్యాంకింగ్ రంగంలో మార్కెటింగ్ కోసం, విద్యారంగంలో పిల్లల ఐక్యూను పెంపొందించేందుకు దోహదపడుతుంది. రాబోయే తరాలకు మొబైల్ గేమింగ్, ఐఫోన్ గేమింగ్, సోషల్ గేమింగ్ ఒక దిక్చూచిగా నిలవనుంది. రానున్న రోజుల్లో గేమ్ ఆర్ట్, గేమ్ టెస్టర్, గేమ్ డిజైనర్లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం - – టి. భారతి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్‌యూ, కడప ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 2.5 బిలియన్ గేమర్లతో నూతన టెక్నాలజీలతో గేమింగ్ పరిశ్రమ శక్తివంతంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన కోర్సు. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా తక్కువ కాలంలోనే ఆకర్షణీయమైన వేతనాలతో కెరీర్ ప్రారంభించవచ్చు. చదవండి : నిషేధం ఉన్నా.. నిశ్శబ్దంగా విస్తరిస్తున్నాయ్ -
5జీ వేలం ఈ ఏడాదే..
న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్ ప్రకటించడాన్ని సెల్యులార్ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు ‘భారీ ఊరట‘ ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు.. దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్‌లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్‌ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్ కంపోజర్ మరోచోట కంపోజ్ చేస్తుండగా..రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్‌లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్‌ను ఎరిక్సన్, ఎయిర్టెల్ ప్రదర్శించాయి. స్మార్ట్ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్ ఐడియా ప్రదర్శించింది. వైద్యం, విద్యా రంగాల్లో లైవ్ 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్‌ను చూపించింది. రిలయన్స్ జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్‌ను ప్రదర్శించింది. రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈసారి హాజరు కాకపోవడం గమనార్హం. నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా కొత్త డిజిటల్ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్వర్క్ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. 5జీ లో భారత్ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. -
వరంగల్‌లో సైయంట్ సెంటర్
♦ యాపిల్ నుంచి జూన్‌లో అధికారిక ప్రకటన ♦ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంజనీరింగ్ సర్వీసుల సంస్థ సైయంట్ వరంగల్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఏప్రిల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కంపెనీ ప్రకటించింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంస్థకు ఇది నాల్గవదని సైయంట్ వ్యవస్థాపకులు బీవీఆర్ మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సైయంట్ ప్రతిపాదిత సెంటర్‌కు సీఎం కె.చంద్రశేఖరరావు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన జరుగనుందని తెలియజేశారు. రానున్న 12-18 నెలల్లో ఈ కేంద్రం ద్వారా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. ఈ స్థాయి కంపెనీ ద్వితీయ శ్రేణి నగరంలో కార్యాలయాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారు. మరిన్ని పెద్ద కంపెనీలు సైయంట్‌ను అనుసరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యాపిల్ నుంచి జూన్‌లో ప్రకటన.. అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తెలంగాణలో సెంటర్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. యాపిల్‌కు చెందిన అధికారుల బృందం ప్రభుత్వాన్ని కలిసింది కూడా. నానక్‌రామ్‌గూడలో టి స్మన్ స్పియర్స్‌కు చెందిన భవనంలో యాపిల్ తన కార్యాలయాన్ని నెలకొల్పనుంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన జూన్‌లో వెలువడుతుందని కేటీఆర్ వెల్లడించారు. కాగా, జూన్ నుంచి మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉందని మంత్రి తెలియజేశారు.