ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో టెక్నాలజీకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. చిన్నపిల్లవాడు మొదలు పెద్దల వరకు అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లు, గ్యాడ్జిట్లు దర్శనమిస్తున్నాయి. ఇందులో మరింత వేగంగా దూసుకువస్తున్న రంగం ఆన్‌లైన్ గేమ్స్. కోట్లాది రూపాయల టర్నోవర్‌లతో వీడియో గేమ్స్ నడుస్తున్నాయంటే ఈ రంగం ప్రాధాన్యత అర్థమవుతోంది. ఇందులో నైపుణ్యం సాధిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదనేది నిపుణుల మాట. అంతటి ప్రాధాన్యత కలిగిన గేమ్ టెక్నాలజీని కడప నగరంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ పేరుతో నూతనంగా కోర్సును ఏర్పాటు చేశారు.
ఏఎఫ్‌యూ (వైవీయూ): కడప నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్‌ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీస్ కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ యుగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం కల్పించేలా రూపుదిద్దుకున్న ఈ కోర్సు ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న రంగంగా నిపుణులు పేర్కొంటున్నారు. పెద్దపెద్ద నగరాలకే పరిమితమైన ఈ అరుదైన కోర్సు కడపలో ఏర్పాటు చేయడం విశేషం. కేవలం పిల్లలను సెల్‌ఫోన్లకే పరిమితం చేసే గేమ్స్ కొన్ని ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగకరమైన అంశాలను కూడా ఈ టెక్నాలజీ ద్వారా చిన్నారులకు అందించే అవకాశం ఉంది. చిన్నారుల్లో ఏకాగ్రతను, మేధోశక్తిని పెంపొందించడంలో ఈ సాంకేతికత దోహదపడుతుంది. అయితే సృజనాత్మకంగా ఆలోచించగలిగే వారికి ఇందులో చక్కటి అవకాశాలు లభిస్తాయి.
కోర్సులో ఏమి నేర్పుతారంటే..
బీటెక్ గేమ్ డిజైన్ టెక్నాలజీలో విద్యార్థులకు అత్యాధునిక టెక్నాలజీని అందిస్తారు. జావా, యూనిటీ, బ్లెండర్, మాయ, ఫొటోషాప్, 3డీ మోడలింగ్, ఆగ్మెంటేడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ వంటి వినూత్న అంశాలు ఈ కోర్సులో నేర్పుతారు. మల్టీ టాస్కింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ స్పెషలైజ్డ్ కోర్సుగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన కోర్సు ప్రభుత్వ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులో ఉంది.
ప్రవేశం ఎలా..
10 ప్లస్ 2 (ఎంపీసీ) చదివిన విద్యార్థులకు ఇందులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం ఈ యేడాది నుంచి ప్రారంభించిన ఏపీ ఈఏపీసెట్–2021 ద్వారా ఇందులో ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సు నాలుగు సంవత్సరాలు. ఇందులో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం అందించే జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనలు వర్తిస్తాయి.
అవకాశాలు ఇలా..
గేమ్ టెక్నాలజీస్‌లో ప్రవేశం పొంది కోర్సు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సినిమా రంగం, మల్టీమీడియా, సాఫ్ట్‌వేర్, యానిమేషన్, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గేమింగ్ టెక్నాలజీపై పట్టు సాధించిన వారికి లక్షల్లో వేతనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
అవకాశాల వెల్లువ-– సి. శ్రీలక్ష్మి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్‌ఆర్ ఏఎఫ్‌యూ, కడప
గేమింగ్ అన్నది కేవలం వినోదాత్మకంగానే కాకుండా ఇప్పటి ఆధునిక ప్రపంచంలో బ్యాంకింగ్ రంగంలో మార్కెటింగ్ కోసం, విద్యారంగంలో పిల్లల ఐక్యూను పెంపొందించేందుకు దోహదపడుతుంది. రాబోయే తరాలకు మొబైల్ గేమింగ్, ఐఫోన్ గేమింగ్, సోషల్ గేమింగ్ ఒక దిక్చూచిగా నిలవనుంది. రానున్న రోజుల్లో గేమ్ ఆర్ట్, గేమ్ టెస్టర్, గేమ్ డిజైనర్‌లకు అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి.
వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం - – టి. భారతి, అధ్యాపకురాలు, డాక్టర్ వైఎస్‌ఆర్ ఏఎఫ్‌యూ, కడప
ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 2.5 బిలియన్ గేమర్‌లతో నూతన టెక్నాలజీలతో గేమింగ్ పరిశ్రమ శక్తివంతంగా, వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలమైన కోర్సు. ఈ కోర్సును పూర్తి చేయడం ద్వారా తక్కువ కాలంలోనే ఆకర్షణీయమైన వేతనాలతో కెరీర్ ప్రారంభించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment