కొత్త ‘వరి’ లోకం
కందుకూరు : మండలంలోని మాచవరం గ్రామ రైతులు వరి సాగులో సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకున్నారు. ఆధునిక యంత్రాలతో సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీనివల్ల పెట్టుబడి, నీరు, కూలీల ఖర్చు తగ్గించుకోవడమేగాక, అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వరి నారుమడి పెంచడం దగ్గర నుంచి నాట్లు వేయడం వరకు పూర్తిగా యంత్రాలతోనే చేస్తున్నారు. కేవలం మూడేళ్లలో 50 నుంచి 150 ఎకరాల వరకు ఈ తరహా సాగు విస్తరించింది.
ప్రధాన పొలం ఇలా సిద్ధం చేసుకోవాలి
వరినాటు యంత్రంతో నాట్లు వేసే ముందు ప్రధాన పొలానికి బాగా నీరుపెట్టి ట్రాక్టర్ ద్వారా రొటావేటర్, లెవలింగ్ బ్లేడ్ సాయంతో(5సెంమీ లోతున) బురద దుక్కి చేయాలి. ఆ తర్వాత డీఏపీ/ఎస్ఎస్పీ, ఎంఓపీ వేయాలి. బరువు నేలలు అయితే 24 గంటలు, తేలిక నేలలు అయితే 12 గంటల పాటు మట్టిని, నీటిని బాగా స్థిరపడనివ్వాలి. నీరు చాలా పలుచుగా ఉంటేనే యంత్రంతో నాట్లు పడతాయి. ఎకరా పొలంలో రెండు మొక్కల మధ్య 16సెంమీల దూరంలో నాటితే మొత్తం 60-70 ట్రేలలోని నారు సరిపోతుంది.
అందుబాటులో రెండు యంత్రాలు
వరి నాటే ట్రాన్స్‌ప్లాంటర్ యంత్రాలు రెండు రకాలున్నాయి. మొదటిది పవర్ టెల్లర్ మాదిరిగా(డీజిల్‌తో) ఒక మనిషి ప్రధాన పొలంలో ఆ యంత్రాన్ని నె ట్టుకుంటూ పోతే నాట్లు పడతాయి. దీనిని వాకింగ్ టైపు యంత్రం అంటారు. రెండోదానిపై ఒక మనిషి కూర్చుని నడిపిస్తే(పెట్రోల్‌తో) పొలంలో నాట్లు పడతాయి. మాచవరం రైతులు ఈ యంత్రాన్నే ఉపయోగిస్తున్నారు.
అలాగే వరినాటే యంత్ర పరికరాలు ప్రైవేట్‌గా డీజిల్‌తో నడిచేవి మార్కెట్లో ఉన్నాయి. వీటి ద్వారా ఒకేసారి ఆరు నుంచి ఎనిమిది వరుసల్లో నాట్లు వేసుకోవచ్చు. వరుసల మధ్య 30సెంమీల దూరం, చాళ్లలో మొక్కల మధ్య 10, 12, 14, 16, 18, 20 సెంమీల దూరంలో నాటు వేసేలా మార్చుకోవచ్చు. ఈ యంత్రంతో నాట్లు వేసేటప్పుడు దుబ్బుకి 3-5 మొక్కలు పడేలా మార్చుకునే వీలుంది. ఈ యంత్రంతో రోజుకి 8నుంచి 10 ఎకరాలు నాట్లు వేయవచ్చు.