Teddy bear day
-
Teddy Day 2022: టెడ్డీ డే స్పెషల్
-
ఈ గిఫ్ట్ చాలు...ఇక ప్రేయసి మీ వెంటే!
ప్రేమించిన వారు ప్రతిక్షణం మనతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు! కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రేమికులు ఒకరిని విడిచి మరొకరు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ విరహ వేదనను టెడ్డీబేర్లు దూరం చేయగలవు. అందుకే ఈ టెడ్డీలకు వాలెంటైన్స్ వీక్‌లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. లవర్స్ ఈరోజును (ఫిబ్రవరి10) టెడ్డీబేర్ డేగా జరుపుకుంటారు. ఇంకేం.. ప్రేమికుల్లారా! మీ నిచ్చెలికి ఒక టెడ్డీ ఇచ్చి తన పక్కనే ఉండే ఛాన్స్ కొట్టేయండి మరి... మరోవైపు టెడ్డీబేర్‌లకు, అమ్మాయిలకు మధ్య చిన్ననాటి నుంచి ప్రత్యేక అనుబంధం ఉంటుంది. వారు రకారకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు. ఒక్కరే ఉన్నప్పుడు టెడ్డీలతో సరదాగా గడుపుతారు. తల్లిదండ్రులతో సరదాగా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పక్కనే టెడ్డీ ఉండాల్సిందే. చిన్నారి పాపలు కొన్నిసార్లు తమ టెడ్డీలకు ప్రాణం ఆపాదించి అందంగా ముస్తాబు చేసి తయారుచేసి సంతోషపడిపోతారు. బెడ్‌పైనే తమ పక్కనే పెట్టుకుని నిద్రపోతారు. ఇక ప్రేమికుల విషయానికొస్తే.. మనసుపడిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ప్రియుడు/ప్రియురాలు టెడ్డీని గిఫ్ట్‌గా ఇస్తుంటారు. తమవారు గుర్తుగా ఇచ్చే టెడ్డీ బొమ్మలతో వారు లోన్లీ ఫీలింగ్‌ను కొంతవరకు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రేమే కాకుండా కోపతాపాలకు కొన్నిసార్లు వేదిక అవుతుంటాయి. ప్రేమించినవారిపై అలకను, చిరుకోపాన్ని టెడ్డీలపై చూపించి వారు తెగ ఆనందపడిపోతారు. -
మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తే! వెంటనే..
వాలెంటైన్స్ వీక్ మొదలై అప్పుడే నాలుగు రోజులు అవుతోంది. వాలెంటైన్ వీక్ సందర్భంగా బహుమతులతో ప్రేమను వ్యక్తపరుచుకునే జంటలకు మరో ముఖ్యమైన రోజు ‘టెడ్డీ డే’... ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు అందమైన టెడ్డీ బేర్ బొమ్మలను ఇచ్చిపుచ్చుకుని ఒకరిపై ఒకరికున్న ప్రేమను తెలియజేసుకుంటారు. టెడ్డీ బేర్ క్యూట్‌నెస్, సంతోషానికి గుర్తు. మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే టెడ్డీ బేర్ రకాల్ని బట్టి మనం వారిని ఎంత ప్రేమిస్తున్నామో తెలియజేయవచ్చు. ఇద్దరి మధ్యా అందమైన బంధాన్ని నెలకొల్పటానికి టెడ్డీ బేర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలామంది ఆడపిల్లల జీవితంలోని ఏదో ఒక సందర్భం ఈ టెడ్డీ బేర్‌తో ముడిపడిఉండటం పరిపాటి. అందుకే ఓ అందమైన టెడ్డీ బేర్‌ను ఎంచుకోండి! మీ ప్రియమైన వారికి బహుమతిగా ఇవ్వండి. అయితే మనం చేయవల్సిందల్లా మన మనసులోని భావాలను ప్రతిబింబించేలా ఓ టెడ్డీ బేర్‌ను ఎంచుకోవటమే. ఆ తర్వాత మీరు వారి గురించి ఏమనుకుంటున్నారో తెలియజేస్తూ ఓ సందేశాన్ని రాసి ఆ బొమ్మకు అతికించండి. ఎందుకంటే కేవలం బహుమతులే కాదు! మనం ప్రేమగా వారిని ఉద్ధేశించి రాసే నాలుగు వాఖ్యాలు కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. మీ ప్రేమకు రంగులద్దండి! ఒక్కో రంగు టెడ్డీ బేర్ ఒక్కో అర్థాన్నిస్తుంది. అందుకే బొమ్మను కొనబోయే ముందు మీ ప్రియమైన వారికి ఎలాంటి రంగు ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవటం ముఖ్యం. పింక్ : ఈ రంగు ఎదుటి వ్యక్తిపై మనకున్న అన్‌కండిషనల్ లవ్‌ను, ఎఫెక్షన్, కంపాషన్ను తెలియజేస్తుంది. తెలుపు : ఈ రంగు అమాయకత్వానికి, అందానికి ప్రతిబింబంలాంటిది. ఈ రంగు ఓ కొత్త ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఎరుపు : ఇది ఎదుటి వ్యక్తిపై మనకున్న ప్రేమను తెలియజేస్తుంది. ఆరెంజ్ : ఈ రంగు సంతోషాన్ని, ప్యాషన్, పాజిటివ్ ఎనర్జీని సూచిస్తుంది. నీలం : ఈ రంగు టెడ్డీ బేర్ నిజాయితీ, నమ్మకానికి చిహ్నం. మీరో వ్యక్తిని మనస్ఫూర్తిగా, నిజాయితీగా ప్రేమిస్తున్నట్లయితే వెంటనే నీలం రంగు టెడ్డీ బేర్‌ను కొని వారికి బహుమతిగా ఇవ్వండి. -
వాలెంటైన్స్ వీక్! 8రోజుల ప్రేమ పండుగ!
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ పండగే. అయితే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్ డే రాకకోసం ఏడాది మొత్తం ఎదురుచూస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ డే ప్రత్యేక ఆ ఒక్కరోజుకే పరిమితం కాలేదు. ప్రేమికుల రోజు.. ఫిబ్రవరి 14వ తేదీకి వారం రోజుల ముందు ఫిబ్రవరి 7నుంచే వేడుకలు మొదలవుతాయి. దీన్నే వాలెంటైన్స్ వీక్‌గా పిలుస్తారు. వాలెంటైన్స్ వీక్‌లోని ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లోని ఎనిమిది రోజులల్లో ఒక్కోరోజు ఒక్కో విధంగా ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు. 1) రోజ్ డే : వాలెంటైన్ వీక్.. రోజ్‌డేతో ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 7నుంచి 14 వరకు వారం రోజుల పాటు ఈ స్పెషల్డేస్ ఉంటాయి. ఈరోజు తాము ప్రేమించిన వారికి ఒక గులాబీ పువ్వును బహుమతిగా ఇస్తారు. దానితో పాటు గులాబీ పువ్వులు ఉండే మంచి మెసేజ్‌లు ఉన్న గ్రీటింగ్ కార్డులను గిఫ్ట్‌లుగా ఇస్తారు. ‘మనసుకు మాత్రమే తెలిసిన భాషలో.. నా ప్రేమను ఈ గులాబి పువ్వు నీకు తెలియజేస్తుంది’ లాంటి కొటేషన్స్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకర్షిస్తాయి. 2) ప్రపోజ్ డే : ఫిబ్రవరి 8వ తేదీన ప్రపోజ్ డే జరుపుకుంటారు. ఈరోజున తాము ప్రేమించిన వారికి ధైర్యంగా తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఎన్ని రోజుల నుంచో ప్రేమను వ్యక్తపరచడానికి సంకోచిస్తూ ఉన్న వారికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. సో మీరు కూడా మీకిష్టమైన వారికి మీ మనసులో మాట చెప్పాలనుకంటే ఈ ఏడాది కచ్చితంగా చెప్పేయండి. ఒక మంచి గులాబీతోనో, లేక చేతికి రింగ్ తొడిగో మీ ప్రేమను వ్యక్తపరచండి. 3) చాక్లెట్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్ డే. ప్రేమ బంధం ఎంతో తీయనైనది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ మధురమే. తాము ప్రేమించిన వారు పక్కన ఉంటే అంతకు మించిన స్వర్గం ఉండదు. అలాంటి ఆ బంధాన్ని మరింత మధురంగా మలుచుకోవాలంటే చాక్లెట్ డే రోజు ప్రేమించిన వారితో చాక్లెట్ షేర్ చేసుకోవాల్సిందే. 4) టెడ్డీ డే : ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని జరుపుకుంటారు. టెడ్డీలంటే అమ్మాయిలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చూడటానికి ఎంతో అందంగా మృధువుగా ఉండే టెడ్డీలు ఎంతో ఆకర్షిస్తాయి. అంతే కాకుండా అనుక్షణం మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. సో టెడ్డీని ప్రజెంట్ చేయడం ద్వారా మీ అందమైన ప్రేమసికి ఎంతో క్యూట్‌గా మీ ప్రేమను తెలియజేయవచ్చు. 5) ప్రామిస్ డే : ఈరోజు ఒకరికొకరు జీవితాంతం తోడుంటాం అంటూ ప్రేమికులు మాట ఇచ్చిపుచ్చుకుంటారు. నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నీకు బాసటగా నిలుస్తాను అంటూ తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ప్రేమ బంధం మరింత బలపడటానికి మీరు చెప్పే ఒక్క మాట చాలు. అందుకే మీ మనసులో ఉన్న భావాల్ని మీరు ప్రేమించిన వారికి అర్థం అయ్యేలా అందంగా చెప్పండి. ‘ నేను చేసిన ప్రమాణాన్ని ఎన్నటికి మర్చిపోను! నిన్ను ఎప్పటికీ వీడిపోను’’ అంటూ మీ ప్రేమను తెలపండి. ఇచ్చిన మాటకు జీవితాంతం కట్టుబడి ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మాట నిలబెట్టుకోలేకపోతే తర్వాత సారీ చెప్పినా ఏం ప్రయోజనం ఉండదు. 6) హగ్ డే : ఈ డే ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రేమించిన వారిని కౌగిళ్లలోకి తీసుకుని మీ ప్రేమను వ్యక్తపరిస్తే ఆ భావాలు మాటల్లో వర్ణించలేము. ఆ అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే హగ్డే రోజు తాము ప్రేమించిన వారిని హగ్ చేసుకోవడంతో పాటు ఒక మంచి గ్రీటింగ్ కార్డును బహుమతిగా ఇస్తారు. 7) కిస్ డే : వాలెంటైన్స్ డేకి ముందు రోజైన ఫిబ్రవరి 13వ తేదీని కిస్ డేగా జరుపుకుంటారు. ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. ప్రేమించిన వారు ఇచ్చే చిన్న ముద్దు.. ఆ బాధలన్నింటిని దూరం చేస్తుంది. మిమ్మల్ని మరింత దగ్గర చేస్తుంది. ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసే ముద్దుతో.. రోజును ప్రారంభిస్తే ఆరోజంతా ఆనందంగానే గడుస్తుంది. 8) వాలంటైన్స్ డే : ఇక వాలంటైన్ వీక్‌లో చివరి రోజైన ఫిబ్రవరి 14ను వాలెంటైన్స్‌డేగా జరుపుకుంటారు. ప్రేమ కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజును ప్రేమికుల రోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమించిన వారికి మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడంతో పాటు ఆరోజంతా వారితో ఆనందంగా నచ్చిన ప్రదేశానికి వెళ్లి గడుపుతారు. తెలుసుకున్నారుగా వాలెంటైన్ వీక్‌లో ఒక్కొక్క రోజుకు ఉన్న ప్రత్యేకతలు ఇంకెందుకు ఆలస్యం! ఆరోజు ఏం చేయాలో ప్లాన్ చేసుకోండి. -
టెడ్డీ టేల్
బేర్‌మంటూ మారాం చేసే పిల్లలను ఊరుకోపెట్టాలంటే కావాలొక టెడ్డీబేర్. ముచ్చటైన అమ్మాయిలు ఎత్తుకుని ఆడించేందుకు వారికీ కావాలొక టెడ్డీబేర్. చిన్నారులైనా, ఆరిందాలైనా.. నిద్రపోయేటప్పుడు వెచ్చగా హత్తుకోవడానికి వారికీ కావాలొక నిలువెత్తు టెడ్డీబేర్. ఇంపైన ఇళ్లలో తీర్చిదిద్దిన డ్రాయింగ్ రూముల్లోని షోకేసుల్లో ఒక టెడ్డీబేర్ అయినా కనిపించి తీరుతుంది. అది లేకుంటే ఆ అలంకరణలోనే ఏదో లోటు కనిపిస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బొవ్మును సిటీవాసులు ఏనాడో రెడ్‌కార్పెట్ పరచి ఆహ్వానించారు. తవు ఇళ్లలో చోటిచ్చి ఆనందిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే అందరి బంధువుగా మారిన టెడ్డీబేర్ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్వెల్ట్ కొనసాగుతున్న కాలం. మిసిసిపీలో భల్లూకాల బెడద ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టేందుకు వేటకు రావాలంటూ గవర్నర్ ఆండ్రూ హెచ్ లాంగినో 1902 నవంబర్‌లో రూజ్‌వెల్ట్‌ను ఆహ్వానించాడు. వేటగాళ్ల బృందంతో కలసి రూజ్వెల్ట్ అడవికి వెళ్లాడు. బృందంలోని చాలామంది వేటగాళ్లు దొరికిన జంతువునల్లా వేటాడుతూ ముందుకు సాగుతుండగా వారికొక ఎలుగు పిల్ల చిక్కింది. దానిని ఉచ్చువేసి బంధించారు. దానిని కాల్చి చంపాల్సిందిగా రూజ్‌వెల్ట్‌ను కోరితే, పసితనం వీడని జంతువును వేటాడటం వేటగాడి లక్షణం కాదంటూ ఆయన కాల్పులు జరిపేందుకు నిరాకరించాడు. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఈ ఉదంతాన్ని 1902 నవంబర్ 16 సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. కథనానికి అనుబంధంగా కార్టూన్‌ను వేసింది. ఇది ఆకట్టుకోవడంతో టాయ్స్ కంపెనీ మోరిస్ అండ్ రోజ్ మిక్టమ్ ఎలుగు పిల్ల బొమ్మను రూపొందించింది. దానికి ‘టెడ్డీబేర్’గా నామకరణం చేసేందుకు రూజ్వెల్ట్ అనుమతి కోరడంతో, ఆయన అంగీకరించారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ సహా భారత్‌లోని నగరాల్లోనూ టెడ్డీబేర్ బొమ్మలకు దశాబ్దాలుగా విపరీతమైన క్రేజ్ ఉంది. టెడ్డీబేర్ తర్వాత మార్కెట్లోకి చాలారకాల సాఫ్ట్‌టాయ్స్ వచ్చినా, వాటి స్థానం టెడ్డీబేర్ తర్వాతే. టెడ్డీబేర్ డే... అమెరికాలో కొందరు సెప్టెంబర్ 9న టెడ్డీబేర్ డే జరుపుకుంటూ వస్తున్నారు. మిగిలిన దేశాల్లోనూ చాలామంది ఇదేరోజును అనుసరిస్తున్నారు. వాలెంటైన్స్ డే తర్వాత తొమ్మిదోరోజు.. ఫిబ్రవరి 22న కూడా కొందరు టెడ్డీబేర్ డే జరుపుకుంటున్నారు. అమెరికాలోని టెడ్డీబేర్ బొమ్మలు తయారు చేసే వెర్మంట్ టెడ్డీబేర్ కంపెనీ నవంబర్ 13వ తేదీని జాతీయ టెడ్డీబేర్ డేగా ప్రకటించింది. టెడ్డీబేర్ డేను జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, ఇలాంటి రోజులు చిన్నారులు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా, గడపడానికి దోహదపడతాయి. మరిన్ని.. టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా లాభసాటి వ్యాపారాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2006 నాటికి ఈ వ్యాపారం టర్నోవర్ 1,300 కోట్ల డాలర్లకు పైమాటే. 1980ల తర్వాత టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. టెడ్డీబేర్ల కోసం తొలిసారిగా 1984లో ఇంగ్లండ్‌లో హాంప్‌షైర్ ప్రాంతంలోని పీటర్స్ఫీల్డ్లో మ్యూజియం వెలిసింది. ఇది 2006లో మూతబడింది. అయితే, ఈలోగా ప్రపంచంలో చాలాచోట్ల టెడ్డీబేర్ మ్యూజియంలు మొదలయ్యాయి. విపత్తులు, ప్రమాదాలు తలెత్తినప్పుడు విధులు నిర్వర్తించే పోలీసులకు అమెరికా ప్రభుత్వం టెడ్డీబేర్ బొమ్మలను ఇస్తుంది. విపత్తుల్లో చిక్కుకున్న చిన్నారులకు ఈ బొమ్మలు ఇస్తే, వారు తేలికగా ఊరట చెందుతారనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. - పన్యాల జగన్నాథదాసు