Tehrik-e-Insaf
-
పాక్‌లో ఇమ్రాన్‌కు షాక్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ)కు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా జరిగిన ఉపఎన్నికలు ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్ ఇచ్చాయి. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్) అధినేత నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి పార్లమెంట్లో తన బలాన్ని‡ పెంచుకుంది. జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ ఐదు చోట్ల పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఇమ్రాన్ గెలుపొందిన నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు జరగ్గా.. లాహోర్, బన్ను స్థానాల్లో పీటీఐకి ఓటమి ఎదురైంది. పాక్ మాజీ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఎన్ఏ–124 లాహోర్ స్థానంలో పీటీఐ అభ్యర్థిపై సునాయాసంగా గెలుపొందారు. పీఎంఎల్–నవాజ్, పీటీఐలు చెరో నాలుగు జాతీయ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నాయని పాక్ ఎన్నికల కమిషన్ వెల్లడించింది. -
పాక్ అధ్యక్ష ఎన్నిక రసవత్తరం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడి ఎన్నికలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ)తో ఉమ్మడిగా తలపడాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్) నిర్ణయించాయి. సెప్టెంబర్ 4న జరిగే ఈ ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపాలని రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా వెల్లడి ంచింది. ముర్రేలో ఆగస్టు 25న జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో అభ్యర్థిని ప్రకటి ంచనున్నట్లు తెలిసింది. ఆ సమావేశానికి పీఎం ఎల్–ఎన్ చీఫ్ షాబాజ్ షరీఫ్ అధ్యక్షత వహిం చనున్నారు. తొలుత ఇత్‌జాజ్ అహసన్‌ను పీపీపీ అభ్యర్థిగా నిర్ణయించగా.. ప్రతిపక్షాలను సంప్రదించకుండా ప్రకటించారంటూ పీఎం ఎల్–ఎన్ తిరస్కరించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని, పీఎంఎల్–ఎన్ నేత నవాజ్ షరీఫ్, ఆయన భార్య కుల్సుమ్కు వ్యతిరేకంగా అహసన్ వ్యాఖ్యలు చేశారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. కాగా, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దింపితే ఎన్నిక రసవత్తరంగా మారుతుందని.. పీటీఐ, ప్రతిపక్షాల మధ్య 8–10 ఓట్ల తేడానే ఉంటుందని సీనియర్ పీఎంఎల్–ఎన్ నేత అన్నారు. పీటీఐ ఇప్పటికే ప్రముఖ డెంటిస్ట్ అరీఫ్ అల్వీ (69)ని తమ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుత అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ పదవీకాలం సెప్టెంబర్ 9న ముగియనుంది. పరోక్ష పద్ధతిలో జరిగే పాక్ అధ్యక్షుడి ఎన్నికలో పార్లమెంటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల సభ్యులు పాల్గొంటారు. -
విదేశీ నేతల్ని పిలవట్లేదు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీసహా విదేశీ నేతలెవరినీ ఆహ్వానించడం లేదని పాక్ విదేశాంగశాఖ తెలిపింది. పాక్ ప్రధానిగా తన ప్రమాణ స్వీకారం నిరాడంబరంగా సాగాలని ఇమ్రాన్ కోరుకుంటున్నట్లు వెల్లడించింది. 11న అధ్యక్ష భవనంలో ఇమ్రాన్ చేత అధ్యక్షుడు మమ్నూన్ ప్రమాణం చేయిస్తారు. ఈ వేడుకకు రావాల్సిందిగా ఇమ్రాన్ స్నేహితులైన కొంతమంది విదేశీయులకే ఆహ్వానాలు పంపారు. జూలై 25న జరిగిన పాక్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం అనుమతిస్తే ఇమ్రాన్ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని పంజాబ్ మంత్రి నవ్‌జ్యోత్‌సింగ్ సిద్ధూ తెలిపారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడితే వచ్చే ఏడాది పాక్‌లోని నన్‌కనా సాహిబ్‌లో జరిగే గురునానక్ 550వ జయంతి ఉత్సవాలకు హాజరవ్వాలన్న తన కల నెరవేరుతుందన్నారు. -
ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పొరుగుదేశం పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం మరింత లోతుగా వేళ్లూనుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధిలకు సంబంధించి తన భావనలను పంచుకున్నారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ఇమ్రాన్ కృతజ్ఙతలు చెప్పారని పీటీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలమని ఇమ్రాన్ మోదీతో చెప్పారు. పేదరికం నుంచి ఇరుదేశాల ప్రజలను కాపాడేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికను రూపొందించాలని ఇమ్రాన్ సూచించారు. యుద్ధం, రక్తపాతం విషాదాంతమే అవుతుందన్నారు’ అని ఆ ప్రకటనలో పీటీఐ పేర్కొంది. డి–చౌక్ వద్ద ప్రమాణస్వీకారం పాక్ ప్రధానిగా ఆగస్టు 11న తాను ప్రమాణ స్వీకారం చేస్తానని పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఖైబర్ ఫక్తున్ ఖ్వా ప్రావిన్సుకు రాబోయే 48 గంటల్లో కొత్త సీఎంను ఎంపిక చేస్తానని చెప్పారు. సోమవారం ఖైబర్ ఫక్తున్ ఖ్వాలో పీటీఐ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను వచ్చే నెల 11న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తాను. అలాగే ఈ ప్రావిన్సుకు ముఖ్యమంత్రి పేరును 48 గంటల్లో ప్రకటిస్తాను’ అని ఖాన్ తెలిపారు. సింధ్ ప్రాంతంలో నెలకొన్న పేదరికాన్ని తరిమికొట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. పీటీఐ నేత నయీముల్ హక్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ ఇస్లామాబాద్‌లోని డి–చౌక్ వద్ద ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలిపారు. -
పాక్ కింగ్.. ఖాన్!
ఇస్లామాబాద్: పాక్ ప్రధానిగా పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనబడుతోంది. కడపటి వార్తలందేసరికి 104 సీట్లలో గెలిచిన పీటీఐ మరో 14 సీట్లలో ముందంజలో ఉంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్థాపించిన పీఎంఎల్–ఎన్ 58 చోట్ల గెలిచింది. మరో 4 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని పీపీపీ 37 సీట్లలో గెలిచి మరో 6 స్థానాల్లో ముందంజలో ఉంది. పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. అధికారానికి కావాల్సిన 137 స్థానాల మేజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఉంది. కౌంటింగ్ ప్రారంభానికి ముందునుంచే విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీ పార్టీలు రిగ్గింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎక్కడా రిగ్గింగ్ జరగలేదని పోలింగ్, కౌంటింగ్ పారదర్శకంగా జరిగాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ముహ్మద్ రజా ఖాన్ గురువారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి.. ఓటింగ్‌లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతున్నందున ఫలి తాలు ఆలస్యంగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన రిజల్ట్స్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కారణంగానే ఆలస్యం జరుగుతోందన్నారు. ‘రిగ్గింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. మా విధులను సమర్థవంతంగా నిర్వహించాం. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. విపక్షాలు ఏమైనా ఆధారాలు సమర్పిస్తే.. చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. ప్రావిన్సుల్లోనూ పీటీఐ పీఎంఎల్–ఎన్‌కు కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో పీటీఐ పాగా వేయనుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో పీటీఐ 120 సీట్లలో, పీఎంఎల్–ఎన్ 119 సీట్లలో ముందువరసలో ఉన్నాయి. సింధ్‌లో పీపీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటోంది. 113 స్థానాల్లో వెలువడిన ఫలితాల ఆధారంగా పీపీపీ 72 సీట్లలో భారీ ఆధిక్యంతో ముందుంది. ఖైబర్–ఫక్తున్ఖ్వాలో పీటీఐ భారీమెజారిటీ సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 99 స్థానాల్లో 67 చోట్ల పీటీఐ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బెలూచిస్తాన్ మాత్రం భిన్నంగా హంగ్ దిశగా వెళ్తోంది. బెలూచిస్తాన్ అవామీ పార్టీ 12 చోట్ల, ఎంఎంఏ 9 చోట్ల, బెలూచిస్తాన్ నేషనల్ పార్టీ 8 చోట్ల ముందంజలో ఉన్నారు. -
'ఇమ్రాన్ ఖాన్ ఓ పిరికిపంద'
క్రికెటర్, రాజకీయ వేత్త ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్ధారీ మండిపడ్డారు. ఇమ్రాన్ ఓ పిరికివాడు అని బిలావల్ ఆరోపించారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్ అండగా నిలువడంపై ఆయన తప్పు పట్టారు. ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ లా తమ పార్టీ పిరికి పార్టీ కాదని ఆయన నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 21న పెషావర్ లో 80 మరణానికి కారణమైన ఉగ్రవాదులను ఓ చర్చి ముందు నిలుచుని వారికి అనుకూలంగా మాట్లాడటాన్ని బిలావల్ ఖండించారు. తాలిబాన్ చెందిన ఉగ్రవాదుల పేషావర్ లోని ఆల్ సెయింట్ లక్ష్యంగా చేసుకుని సుసైడ్ బాంబులతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులకు పీపీపీ భయపడదని... వారికి ఎదురొడ్డి పోరాడుతుందని ఆయన అన్నారు. 2007లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో తన తల్లి బెనజీర్ భుట్టో తోపాటు మరో 140 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. బేనజీర్ భుట్టో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఇమ్రాన్ ఖాన్ పై మాటల తూటాలను పేల్చారు.