ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు | PM Narendra Modi congratulates Imran Khan | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు

Published Tue, Jul 31 2018 3:25 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

PM Narendra Modi congratulates Imran Khan - Sakshi

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న అతిపెద్ద పార్టీగా నిలిచి, ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ పీటీఐ పార్టీ నేత ఇమ్రాన్‌ ఖాన్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పొరుగుదేశం పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం మరింత లోతుగా వేళ్లూనుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధిలకు సంబంధించి తన భావనలను పంచుకున్నారు’ అని ప్రధాన మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శుభాకాంక్షలు తెలిపిన మోదీకి ఇమ్రాన్‌ కృతజ్ఙతలు చెప్పారని పీటీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోగలమని ఇమ్రాన్‌ మోదీతో చెప్పారు. పేదరికం నుంచి ఇరుదేశాల ప్రజలను కాపాడేందుకు రెండు దేశాల ప్రభుత్వాలు ఉమ్మడి ప్రణాళికను రూపొందించాలని ఇమ్రాన్‌ సూచించారు. యుద్ధం, రక్తపాతం విషాదాంతమే అవుతుందన్నారు’ అని ఆ ప్రకటనలో పీటీఐ పేర్కొంది.

డి–చౌక్‌ వద్ద ప్రమాణస్వీకారం
పాక్‌ ప్రధానిగా ఆగస్టు 11న తాను ప్రమాణ స్వీకారం చేస్తానని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ఖైబర్‌ ఫక్తున్‌ ఖ్వా ప్రావిన్సుకు రాబోయే 48 గంటల్లో కొత్త సీఎంను ఎంపిక చేస్తానని చెప్పారు. సోమవారం ఖైబర్‌ ఫక్తున్‌ ఖ్వాలో పీటీఐ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నేను వచ్చే నెల 11న పాక్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తాను. అలాగే ఈ ప్రావిన్సుకు ముఖ్యమంత్రి పేరును 48 గంటల్లో ప్రకటిస్తాను’ అని ఖాన్‌ తెలిపారు. సింధ్‌ ప్రాంతంలో నెలకొన్న పేదరికాన్ని తరిమికొట్టేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు. పీటీఐ నేత నయీముల్‌ హక్‌ మాట్లాడుతూ.. ఇమ్రాన్‌ ఇస్లామాబాద్‌లోని డి–చౌక్‌ వద్ద ప్రమాణస్వీకారం చేసే అవకాశముందని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement