![Imran Khan claims victory amid rigging claims - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/27/IMRAN-KHAN-FILE-13.jpg.webp?itok=g4B93_bu)
ఇస్లామాబాద్: పాక్ ప్రధానిగా పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనబడుతోంది. కడపటి వార్తలందేసరికి 104 సీట్లలో గెలిచిన పీటీఐ మరో 14 సీట్లలో ముందంజలో ఉంది. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్థాపించిన పీఎంఎల్–ఎన్ 58 చోట్ల గెలిచింది. మరో 4 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ నాయకత్వంలోని పీపీపీ 37 సీట్లలో గెలిచి మరో 6 స్థానాల్లో ముందంజలో ఉంది. పీటీఐ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. అధికారానికి కావాల్సిన 137 స్థానాల మేజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఉంది. కౌంటింగ్ ప్రారంభానికి ముందునుంచే విపక్ష పీఎంఎల్–ఎన్, పీపీపీ పార్టీలు రిగ్గింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఎక్కడా రిగ్గింగ్ జరగలేదని పోలింగ్, కౌంటింగ్ పారదర్శకంగా జరిగాయని పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ఈసీపీ) స్పష్టం చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ముహ్మద్ రజా ఖాన్ గురువారం ఉదయం ప్రెస్ మీట్ పెట్టి.. ఓటింగ్‌లో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కౌంటింగ్ నెమ్మదిగా జరుగుతున్నందున ఫలి తాలు ఆలస్యంగా వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన రిజల్ట్స్ ట్రాన్సిమిషన్ సిస్టమ్ కారణంగానే ఆలస్యం జరుగుతోందన్నారు. ‘రిగ్గింగ్ ఆరోపణల్లో వాస్తవం లేదు. మా విధులను సమర్థవంతంగా నిర్వహించాం. ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి. విపక్షాలు ఏమైనా ఆధారాలు సమర్పిస్తే.. చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
ప్రావిన్సుల్లోనూ పీటీఐ
పీఎంఎల్–ఎన్‌కు కంచుకోట అయిన పంజాబ్ ప్రావిన్సులో పీటీఐ పాగా వేయనుంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో పీటీఐ 120 సీట్లలో, పీఎంఎల్–ఎన్ 119 సీట్లలో ముందువరసలో ఉన్నాయి. సింధ్‌లో పీపీపీ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటోంది. 113 స్థానాల్లో వెలువడిన ఫలితాల ఆధారంగా పీపీపీ 72 సీట్లలో భారీ ఆధిక్యంతో ముందుంది. ఖైబర్–ఫక్తున్‌ఖ్వాలో పీటీఐ భారీమెజారిటీ సాధించే అవకాశాలున్నాయి. మొత్తం 99 స్థానాల్లో 67 చోట్ల పీటీఐ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. బెలూచిస్తాన్ మాత్రం భిన్నంగా హంగ్ దిశగా వెళ్తోంది. బెలూచిస్తాన్ అవామీ పార్టీ 12 చోట్ల, ఎంఎంఏ 9 చోట్ల, బెలూచిస్తాన్ నేషనల్ పార్టీ 8 చోట్ల ముందంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment