ఆగస్టు 22న దేశంలో జరగనున్న ఉప ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని పాకిస్థాన్ తెహ్రిక్- ఈ- ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు,ఆ దేశ మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ సైనిక దళాలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కేంద్రాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ ఏడాది మే మాసంలో దేశంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్లమెంట్, వివిధ ప్రొవెన్షియల్ అసెంబ్లీ సభ్యులు 42 మంది వివిధ కారణాల వల్ల తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన స్థానాలకు ఆగస్టు 22న ఎన్నికల నిర్వహించాలని పాకిస్థాన్ ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ అధికారులు ఉప ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో భారీ ఎత్తున్న రిగ్గింగ్ చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ వంటి అనైతిక చర్యలకు చోటు లేకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని ఇమ్రాన్ ఖాన్ ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం కరాచీలో ఏర్పాటు విలేకర్ల సమావేశంలో ఆయన సైనిక దళాలను కోరారు.