tekmal mandal
-
Medak: నాలుగేళ్లు నరకం చూపిన చేపముల్లు
సాక్షి, మెదక్: ఓ వ్యక్తి గత నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తూ చేప ముల్లును మింగేశాడు. అప్పటి నుంచి నరకయాతన అనుభవించిన సదరు వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు ముల్లును తొలగించాడు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రానికి చెందిన సాయిలు నాలుగేళ్ల క్రితం చేపల కూరతో భోజనం చేస్తుండగా రెండు అంగుళాల పొడవుగల చేప ముల్లును మింగేశాడు. దీంతో అప్పటి నుండి ఇబ్బంది పడుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందాడు. 15 రోజులుగా భరించలేని కడుపు నొప్పి రావటంతో అతను మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హాం ఆస్పత్రిలో చూపించుకోగా సదరు వైద్యుడు సురేశ్ శస్త్రచికిత్స చేసి ఆ ముల్లును బయటకు తీశాడు. వైద్యవృత్తిలో ఇది చాలా అరుదైన అంశంగా పలువురు పేర్కొన్నారు. -
వరికి తెగుళ్లా.. దిగులొద్దు!
సస్యరక్షణ చర్యలతో మేలు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి అతిగా రసాయనాల వాడకం వద్దు టేక్మాల్ ఏఈఓ సునీల్‌కుమార్ టేక్మాల్: వరికి సోకే తెగుళ్లతో ఎటువంటి దిగులు చెందాల్సిన పనిలేదని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (99499 68674) తెలిపారు. సమయానుకూలంగా కలుపుతీత, సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అతిగా రసాయనాలను వాడితేనే ప్రమాదమన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతం సాగవుతున్న వరికి సోకే తెగుళ్లు.. వాటి నివారణ చర్యలపై ఆయన అందించిన సలహా సూచనలు.. అగ్గితెగులు (బ్లాస్ట్): లక్షణాలు: అగ్గితెగులు వరిపైరుకు ఏ దశలోనైనా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ తెగుళు వరి ఆకులపై, మొక్క కణుపులపై. వరి వెన్నుపై వస్తుంది. అగ్గితెగులు నారుమడిలో వస్తే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది. వరినాట్లు పూర్తయిన తర్వాత అగ్గితెగులు సోకితే తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోతాయి. ఆకులపైన చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ తెగులు వరి యొక్క కణుపులకు సోకినప్పుడు కణుపులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగిపోతుంది. వరి వెన్ను దశలో ఈ తెగులు సోకితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి వేలాడటం లేదా పడిపోవడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన వెన్నులోని గింజలు తాలుగా మారి ఉంటాయి. వ్యాప్తి: ఈ తెగులు వ్యాప్తించిన వారంలో అనుకూల పరిస్థితులు ఉంటే వ్యాధి మరింత విజృంభిస్తుంది. వరినాట్లు దగ్గరి దగ్గరగా వేయటం లేదా నత్రజని వాడకం ఎక్కువైనా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది. నివారణ: 1.నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి. 2.పొలాల గట్లను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి. 3.నత్రజని సిఫారసు చేసిన మేరకు 2-3 సార్లు వేయాలి. 4.ధైరాన్ లేదా కాప్టాన్ (2.5 గ్రా) ట్రైసైక్లోజోల్ 2గ్రా ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి. 5.తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా లేదా ఎడిఫెన్పాస్ 1 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 6.తెగులు తట్టుకునే రకాలైన సింహపురి, తిక్కన శ్రీరంగ, ఫల్గుణ, స్వాతి వంటి రకాలను సాగు చేయాలి. పొడ తెగులు (శీత్బ్లెట్) లక్షణాలు: సామాన్యంగా వరి పిలకల దశ నుండి ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు. కాండంపై ఉన్న ఆకులపై చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. మచ్చల చుట్టూ గోధుమ వర్ణం కల్గి మధ్యభాగం బూడిద రంగులో ఉంటుంది. ఈ తెగులు వరి మొక్క పిలక దశలో సోకినా.. వెన్ను దశకు వచ్చేసరికి కానీ రైతులు దీనిని గుర్తించలేరు. వ్యాప్తి: వరి పైరు కోసే సమయంలో ఈ బీజాలు కొన్ని రాలిపొయి, మరికొన్ని ధాన్యంతో కూడా కలుస్తాయి. ప్రవాహపు నీటి ద్వారా శిలీంధ్ర బీజాలు ఒక పొలం నుండి ఇంకో పొలానికి చేరతాయి. వరినాట్లు దగ్గరగా నాటినప్పుడు, అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు తెగులు అధికంగా వృద్ధి చెందుతుంది. నివారణ: 1. మంచి విత్తనాన్ని ఎన్నుకొని 2-3 గ్రా. మాంకోజబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. 2. నత్రజని ఎరువు 2-3 దఫాలుగా వేయాలి. 3. పిలక దశలో తెగులు లక్షణాలు కనిపించినప్పుడు 1 మి.లీ. ప్రోపికోనజోల్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ మందును నీటిని కలిపి పిచికారి చేయాలి. పొట్టకుళ్లు తెగులు: లక్షణాలు: వరి పొట్టదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. వరి వెన్నుపైకి వచ్చే దశలో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి. వరి వెన్నును ఆకు లోపల నుండి పూర్తిగా బయటికి రానివ్వదు. వరి వెన్ను సగభాగం మాత్రం బయటికి వచ్చి మిగతా భాగం పొట్ట ఆకులో ఉంటుంది. పొట్ట ఆకు కింది భాగంలో ఆకుపై కోలగా గాని లేక గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మ«ధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. ఈ తెగులు సోకడం వలన పైకి వచ్చిన వెన్నుపై ఉండే గింజలు గడ్డి రంగు గింజలుగా, ఆకు లోపల గల గింజలు నలుపు రంగులోకి మారతాయి. వ్యాప్తి: కంకి ఆకును గాయపరిచే కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల వల్ల వెన్ను బయట పడని పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సొకుతుంది. నివారణ: 1.పైరు పొట్టదశలో ఒకసారి, తెగులు కనిపించిన వెంటనే ఒకసారి కార్బండిజమ్ 0.5- 1.0 గ్రా లేదా బెనోమిల్ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి రెండుసార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలి. బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు లేక బ్యాక్టీరియల్ బైట్: లక్షణాలు: ఈ తెగులు వరిపైరును ముఖ్యంగా 3 దశల్లో ఆశిస్తుంది. 1) నారుమడి దశలో ఈ తెగులు సోకితే ఆకులు చివర్ల నుండి కింది వరకు రెండు పక్కల తడిసినట్లు ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోతాయి. దీనిని ’క్రెసెక్’ దశ అని అంటారు. నాట్లు వేసిన 30 రోజుల తర్వాత కూడ ఈ క్రెసెక్ లక్షణాలు కనిపించవచ్చును. 2) వరి మొక్కలు పిలకలు వేసే దశలో ఆకుల చివరల నుండి కింది వరకు ఆకులు పసుపు పచ్చగా మారి తెగులు సోకిన భాగాలు ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకు నుండి పచ్చని జిగురు వంటి పదార్థం బయటకు వస్తుంది. ఇది సూర్యరశ్మికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా మారి గాలి వీచినప్పుడు ఆకు నుండి దాని చేనులోని నీటిలో పడతాయి. నీటి ద్వారా దీనిలో వున్న బ్యాక్టీరియా ఇతర మొక్కలు, పొలాలకు చేరుతుంది. 3. వరి వెన్ను పైకి వచ్చే దశలో ఈ తెగులు సోకిన ఆకులలోనికి హరిత పదార్థం తగ్గుట వలన కొన్ని వెన్నులు సగం మాత్రమే బయటికి వస్తాయి. గింజలు తాలుగా మారుతాయి. వర్షం జల్లులు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా కలుపు మొక్కలలు, సాగునీటి ద్వారా, వర్షం ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణ: 1.ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించాలి. 2.నత్రజని ఎరువులను 3-4 దఫాలుగా వేయాలి. 3.తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటే నత్రజని వాడకం తాత్కాలికంగా ఆపాలి. 4.తెగులు సోకిన పొలం నుండి నీటిని తెగులు ఆశించని పొలాలకు పారకుండా చూడాలి. 5.తెగులు కనిపించిన వెంటనే స్ట్రేప్టోమైసిన్ లేదా పోషామైసిన్ 200 పీపీఎం మందును 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. టుంగ్రో వైరస్ (నారింజ రంగు ఆకు తెగులు) లక్షణాలుః ఈ తెగులు సోకిన వరి మొక్కలు కురచగా ఉండి సరిగా ఎదగవు. చాలా తక్కువ పిలకలు వస్తాయి. ఆకులు లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారతాయి. మొక్కల వేర్లు పూర్తిగా వృద్ధి చెందక, వెన్నులు చిన్నవిగా ఉండి పొల్లుగింజలతో నిండి ఉంటాయి. వ్యాప్తి: ఈ తెగులు పచ్చదీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పచ్చ దీపపు పురుగులు సెప్టెంబర్ రెండో వారం నుండి నవంబర్ 3వ వారం వరకు మరియు మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎక్కువగా ఉంటాయి. నివారణ: 1. తెగులు తట్టుకునే రకాలైన ఎంటీయూ 9992, 1002, 1003, çసురక్ష భరణి వంటి రకాలను సాగు చేయాలి. 2. పంట కోసిన తర్వాత దుబ్బులను నాశనం చేయాలి. 3. వరి పిలకలు, పడి మొలిచే మొక్కలను నాశనం చేయాలి. 4. తెగులు వ్యాప్తి చేసే పచ్చదీపపు పురుగుల నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్ గుళికలను వేయాలి. లేదా లీటరు నీటికి 2.2 మి.లీ., మోనోక్రోటోఫాస్ లేదా 1.5 మి.లీ. ఇథోఫెన్ఫాస్ కలిపి పిచికారి చేయాలి. 5. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి. -
ప్రహరీలేవీ?
ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని అధికారులు టేక్మాల్: పాఠశాలల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. పాఠశాలల్లోత సరైన వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కనీసం పాఠశాలల చుట్టూ ప్రహరీలను నిర్మించలేకపోతోంది ప్రభుత్వం. టేక్మాల్ మండలంలో 50 శాతం కంటే ఎక్కువ ప్రహరీలు లేని పాఠశాలలున్నాయి. రహదారుల పక్కన గల పాఠశాలల్లో పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు, పచ్చని చెట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. మొక్కలు పెంచుదామన్నా... ప్రహరీలు లేకపోవడంతో సాధ్యం కావడం లేదు. టేక్మాల్ మండలంలో 18 పంచాయతీలకుగాను 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో సగానికిపైగా పాఠశాలలకు ప్రహరీలు లేవు. మండలంలోని ఎల్లుపేట, తంప్లూర్, బొడ్మట్‌పల్లి, ధనూర ఉన్నత పాఠశాలలు, బొడగట్, కాద్లూర్, వెంకటాపూర్, కమ్మరికత్త, అచ్చన్నపల్లి, దాదాయిపల్లి ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీలు లేవు. పాఠశాలల ఆవరణలో పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. పరిసరాలలను అపరిశుభ్రంగా చేస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసనను భరించలేకపోతున్నారు. విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తంప్లూర్, ఎల్లుపేట పాఠశాలలు రోడ్డుపైనే ఉండటంతో వాహనాల శబ్ధంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది. రోడ్డుపై నడుస్తున్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు మైదానాలు కూడా సరిగ్గా లేవు. ఫలిలతంగా విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ఉన్న మైదానాల్లో పూర్తిగా కంకర, రాళ్లు తేలడంతో ఆటలు ఆడలేకపోతున్నారు. పొలాల్లో క్రీడలు ఆడాల్సిన దుస్థితి నెలకొంటోంది. కనిపించని పచ్చదనం ప్రహరీలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పచ్చదనం కనిపించడం లేదు. మొక్కలు పెంచుతున్నా... వాటికి రక్షణ లేకపోవడంతో పెరగలేకపోతున్నాయి. పశువులు, గొర్రెలు, మేకలు పాఠశాలల్లోకి వచ్చి మొక్కలను తింటున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో సెలవురోజులు, వర్షాకాలంలో పాఠశాలలు పశువులు, పందులకు ఆవాసంగా మారుతున్నాయి. ప్రహరీలుంటే మొక్కలకు పెంచి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి వీలుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఇదోరకం ఆదర్శం
టేక్మాల్: చాలా గ్రామాలు మద్యాన్ని నిషేదిస్తూ ఆదర్శంగా నిలుస్తాయి. కానీ అందుకు విరుద్ధంగా నిబంధనలను బేఖాతర్ చేస్తూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహించుకునేందుకు ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తున్నాయి టేక్మాల్ మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలు. ఏకంగా పంచాయతీనే తీర్మానం చేసి గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ ఖజానాకు నాలుగు పైసలు వస్తున్నా, ప్రజలు మాత్రం రోజు తప్పతాగి ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. రోజంతా చేసిన కష్టం మద్యం దుకాణానికి చేరుతుండడంతో మహిళలు లబోదిబోమంటున్నారు. పల్లెకో బెల్ట్‌షాప్..! ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనా మద్యం షాపులు రానురానూ పల్లెల్లోకి చొచ్చుకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పట్టణ కేంద్రాల్లో వైన్స్‌లకు టెండర్లు వేసి మద్యం విక్రయాల నిర్వహణ చూస్తోంది. అయితే ఈ లెసైన్స్‌ల ఫీజు కోట్ల రూపాయల మేరకు చేరుకోవడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు పల్లెల్లో అనధికారికంగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తూ పల్లె జనాన్ని మత్తులో ముంచేస్తున్నారు. ఈ పరిస్థితి చేయిదాటడంతో ప్రభుత్వమే బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేసింది. గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే బెల్ట్‌షాపుల నిర్వహణ గురించి గ్రామస్తులెవరైనా సమాచారం ఇస్తేనే సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వైన్స్‌షాపుల యజమానులు కొత్త తరహా దందాకు తెరతీశారు. పైసలు ఆశచూపి.. గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణ కష్టం కావడంతో వైన్స్‌షాపుల యజమానులు పంచాయతీకి పైసల గాలం వేశారు. వేలం పాటలు నిర్వహిస్తే సొమ్ము కట్టి బెల్ట్‌షాపులు నిర్వహించుకుంటామని వెల్లడించారు. అయితే జిల్లాలోని చాలా గ్రామాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, టేక్మాల్ మండలంలో కోరంపల్లి, పల్వంచ, ఎల్లుపేట గ్రామాల్లో మాత్రం పంచాయతీ సభ్యులు ఈ పద్ధతి మహ భేషుగ్గా ఉందంటూ సంబరపడిపోయారు. వేలం పాటలో బెల్ట్‌షాపును దక్కించుకున్న వారు యథేచ్ఛగా విక్రయాలు చేసుకోవచ్చంటూ వెంటనే గ్రామ పంచాయతీ తీర్మానం చేసేశారు. ఈ ఒప్పందం ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ వేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం పై మూడు గ్రామాల్లో ఏడాదికి ఒకసారి వేలం పాటలు గ్రామ పంచాయతీల్లోనే జరుగుతున్నాయి. ఇటీవల పల్వంచ గ్రామంలో రూ.70 వేలు, ఎల్లుపేటలో రూ.70 వేలు, కోరంపల్లిలో రూ.18 వేలతో వేలం పాటలు జరిపారు. సొంత చేసుకున్న వ్యక్తులు ఆయా గ్రామాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇతర వ్యక్తులు గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపితే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. పంచాయతీ తీర్మానం ఇవ్వడంపై మహిళలంతా మండిపడుతున్నారు. స్థానికంగానే మద్యం మస్తుగా దొరుకుతుండడంతో మగాళ్లంతా మద్యానికి అలవాటు పడుతున్నారని, దీంతో తమ కష్టమంతా మద్యం దుకాణాల్లో చేరుతోందని, అప్పులు పెరిగి ఇళ్లు గుల్లవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ వేలం పాటలకు ప్రజాప్రతినిధులు కూడా వంతపాడడం అన్యాయంగా ఉందని వారు వాపోతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఇకనైనా కళ్లు తెరచి గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యానికి అడ్డుకట్ట వేయాలని మహిళలు కోరుతున్నారు.