వరికి తెగుళ్లా.. దిగులొద్దు! | pests in paddy.. don't worry | Sakshi
Sakshi News home page

వరికి తెగుళ్లా.. దిగులొద్దు!

Published Tue, Sep 6 2016 7:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

టేక్మాల్‌లో సాగుతున్న వరి

టేక్మాల్‌లో సాగుతున్న వరి

  • సస్యరక్షణ చర్యలతో మేలు
  • వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
  • అతిగా రసాయనాల వాడకం వద్దు
  • టేక్మాల్‌ ఏఈఓ సునీల్‌కుమార్‌
  • టేక్మాల్‌: వరికి సోకే తెగుళ్లతో ఎటువంటి దిగులు చెందాల్సిన పనిలేదని టేక్మాల్‌ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్‌ (99499 68674) తెలిపారు. సమయానుకూలంగా కలుపుతీత, సస్యరక్షణ చర్యలు పాటించాలన్నారు. అతిగా రసాయనాలను వాడితేనే ప్రమాదమన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటించాలని తెలిపారు. ప్రస్తుతం సాగవుతున్న వరికి సోకే తెగుళ్లు.. వాటి నివారణ చర్యలపై ఆయన అందించిన సలహా సూచనలు..

    అగ్గితెగులు (బ్లాస్ట్‌):
    లక్షణాలు: అగ్గితెగులు వరిపైరుకు ఏ దశలోనైనా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ తెగుళు వరి ఆకులపై, మొక్క కణుపులపై. వరి వెన్నుపై వస్తుంది. అగ్గితెగులు నారుమడిలో వస్తే నారుమడి పూర్తిగా ఎండిపోతుంది. వరినాట్లు పూర్తయిన తర్వాత అగ్గితెగులు సోకితే తెగులు సోకిన మొక్కలు గిడసబారిపోతాయి. ఆకులపైన చిన్న చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై నూలు కండె ఆకారంలో మచ్చలు ఏర్పడతాయి.

    ఈ తెగులు వరి యొక్క కణుపులకు సోకినప్పుడు కణుపులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి కణుపు వద్ద మొక్క విరిగిపోతుంది. వరి వెన్ను దశలో ఈ తెగులు సోకితే వెన్ను దగ్గర గోధుమ రంగు లేదా నల్లని మచ్చలు ఏర్పడతాయి. దీని వల్ల వరి వెన్ను మెడ దగ్గర విరిగి వేలాడటం లేదా పడిపోవడం జరుగుతుంది. ఈ తెగులు సోకిన వెన్నులోని గింజలు తాలుగా మారి ఉంటాయి.
    వ్యాప్తి: ఈ తెగులు వ్యాప్తించిన వారంలో అనుకూల పరిస్థితులు ఉంటే వ్యాధి మరింత విజృంభిస్తుంది. వరినాట్లు దగ్గరి దగ్గరగా వేయటం లేదా నత్రజని వాడకం ఎక్కువైనా ఈ వ్యాధి తీవ్రత పెరుగుతుంది.
    నివారణ:
    1.నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలి.
    2.పొలాల గట్లను కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేయాలి.
    3.నత్రజని సిఫారసు చేసిన మేరకు 2-3 సార్లు వేయాలి.
    4.ధైరాన్‌ లేదా కాప్టాన్‌ (2.5 గ్రా) ట్రైసైక్లోజోల్‌ 2గ్రా ఒక కిలో విత్తనానికి కలిపి శుద్ధి చేయాలి.                                                 
    5.తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ట్రైసైక్లోజోల్‌ 0.6 గ్రా లేదా ఎడిఫెన్‌పాస్‌ 1 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
    6.తెగులు తట్టుకునే రకాలైన సింహపురి, తిక్కన శ్రీరంగ, ఫల్గుణ, స్వాతి వంటి రకాలను సాగు చేయాలి.

    పొడ తెగులు (శీత్‌బ్లెట్‌)
    లక్షణాలు: సామాన్యంగా వరి పిలకల దశ నుండి ఎప్పుడైనా ఈ తెగులు ఆశించవచ్చు. కాండంపై ఉన్న ఆకులపై చిన్న గోధుమరంగు మచ్చలు ఏర్పడి అవి క్రమేపీ పెద్దవై పాముపొడ వంటి మచ్చలుగా మారతాయి. ఈ మచ్చలు ఒక క్రమ పద్ధతిలో ఉండవు. మచ్చల చుట్టూ గోధుమ వర్ణం కల్గి మధ్యభాగం బూడిద రంగులో ఉంటుంది. ఈ తెగులు వరి మొక్క పిలక దశలో సోకినా.. వెన్ను దశకు వచ్చేసరికి కానీ రైతులు దీనిని గుర్తించలేరు.
    వ్యాప్తి: వరి పైరు కోసే సమయంలో ఈ బీజాలు కొన్ని రాలిపొయి, మరికొన్ని ధాన్యంతో కూడా కలుస్తాయి. ప్రవాహపు నీటి ద్వారా శిలీంధ్ర బీజాలు ఒక పొలం నుండి ఇంకో పొలానికి చేరతాయి. వరినాట్లు దగ్గరగా నాటినప్పుడు, అధిక నత్రజని ఎరువులు వేసినప్పుడు తెగులు అధికంగా వృద్ధి చెందుతుంది.

    నివారణ:
    1. మంచి విత్తనాన్ని ఎన్నుకొని 2-3 గ్రా. మాంకోజబ్‌ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
    2. నత్రజని ఎరువు 2-3 దఫాలుగా వేయాలి.
    3. పిలక దశలో తెగులు లక్షణాలు కనిపించినప్పుడు 1 మి.లీ. ప్రోపికోనజోల్‌ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్‌ మందును నీటిని కలిపి పిచికారి చేయాలి.

    పొట్టకుళ్లు తెగులు:
    లక్షణాలు: వరి పొట్టదశలో ఉన్నప్పుడు ఈ వ్యాధి సోకుతుంది. వరి వెన్నుపైకి వచ్చే దశలో ఈ లక్షణాలు బాగా కనిపిస్తాయి. వరి వెన్నును ఆకు లోపల నుండి పూర్తిగా బయటికి రానివ్వదు. వరి వెన్ను సగభాగం మాత్రం బయటికి వచ్చి మిగతా భాగం పొట్ట ఆకులో ఉంటుంది. పొట్ట ఆకు కింది భాగంలో ఆకుపై కోలగా గాని లేక గోధుమరంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మ«ధ్యభాగం బూడిద రంగు కలిగి ఉంటుంది. ఈ తెగులు సోకడం వలన పైకి వచ్చిన వెన్నుపై ఉండే గింజలు గడ్డి రంగు గింజలుగా, ఆకు లోపల గల గింజలు నలుపు రంగులోకి మారతాయి.
    వ్యాప్తి: కంకి ఆకును గాయపరిచే కీటకాలు ఎక్కువగా ఉన్నప్పుడు గాయాల వల్ల వెన్ను బయట పడని పరిస్థితుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సొకుతుంది.
    నివారణ:
    1.పైరు పొట్టదశలో ఒకసారి, తెగులు కనిపించిన వెంటనే ఒకసారి కార్బండిజమ్‌ 0.5- 1.0 గ్రా లేదా బెనోమిల్‌ 0.5 గ్రా లీటరు నీటికి కలిపి రెండుసార్లు వారం వ్యవధిలో పిచికారి చేయాలి.

    బ్యాక్టీరియల్‌ ఆకు ఎండు తెగులు లేక బ్యాక్టీరియల్‌ బైట్‌:
    లక్షణాలు: ఈ తెగులు వరిపైరును ముఖ్యంగా 3 దశల్లో ఆశిస్తుంది.
    1) నారుమడి దశలో ఈ తెగులు సోకితే ఆకులు చివర్ల నుండి కింది వరకు రెండు పక్కల తడిసినట్లు ఉండి పసుపు రంగుకు మారి ఆకులు ఎండి మొక్కలు చనిపోతాయి. దీనిని ’క్రెసెక్‌’ దశ అని అంటారు. నాట్లు వేసిన 30 రోజుల తర్వాత కూడ ఈ క్రెసెక్‌ లక్షణాలు కనిపించవచ్చును.
    2) వరి మొక్కలు పిలకలు వేసే దశలో ఆకుల చివరల నుండి కింది వరకు ఆకులు పసుపు పచ్చగా మారి తెగులు సోకిన భాగాలు ఎండిపోతాయి. తెగులు సోకిన ఆకు నుండి పచ్చని జిగురు వంటి పదార్థం బయటకు వస్తుంది. ఇది    సూర్యరశ్మికి గట్టిపడి చిన్న చిన్న ఉండలుగా మారి గాలి వీచినప్పుడు ఆకు నుండి దాని చేనులోని నీటిలో పడతాయి. నీటి ద్వారా దీనిలో వున్న బ్యాక్టీరియా ఇతర మొక్కలు, పొలాలకు చేరుతుంది.
    3. వరి వెన్ను పైకి వచ్చే దశలో ఈ తెగులు సోకిన ఆకులలోనికి హరిత పదార్థం తగ్గుట వలన కొన్ని వెన్నులు సగం మాత్రమే బయటికి వస్తాయి. గింజలు తాలుగా మారుతాయి. వర్షం జల్లులు పడినప్పుడు ఈ తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా కలుపు మొక్కలలు, సాగునీటి ద్వారా, వర్షం ద్వారా వ్యాప్తి చెందుతుంది.
    నివారణ:
    1.ఆరోగ్యవంతమైన పంట నుండి విత్తనాన్ని సేకరించాలి.
    2.నత్రజని ఎరువులను 3-4 దఫాలుగా వేయాలి.
    3.తెగులు వ్యాప్తి ఎక్కువగా ఉంటే నత్రజని వాడకం తాత్కాలికంగా ఆపాలి.
    4.తెగులు సోకిన పొలం నుండి నీటిని తెగులు ఆశించని పొలాలకు పారకుండా చూడాలి.
    5.తెగులు కనిపించిన వెంటనే స్ట్రేప్టోమైసిన్‌ లేదా పోషామైసిన్‌ 200 పీపీఎం మందును 10-15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.

    టుంగ్రో వైరస్ (నారింజ రంగు ఆకు తెగులు)
    లక్షణాలుః ఈ తెగులు సోకిన వరి మొక్కలు కురచగా ఉండి సరిగా ఎదగవు. చాలా తక్కువ పిలకలు వస్తాయి. ఆకులు లేత ఆకుపచ్చ లేక నారింజ రంగులోకి మారతాయి. మొక్కల వేర్లు పూర్తిగా వృద్ధి చెందక, వెన్నులు చిన్నవిగా ఉండి పొల్లుగింజలతో నిండి ఉంటాయి.
    వ్యాప్తి: ఈ తెగులు పచ్చదీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ పచ్చ దీపపు పురుగులు సెప్టెంబర్‌ రెండో వారం నుండి నవంబర్‌ 3వ వారం వరకు మరియు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎక్కువగా ఉంటాయి.
    నివారణ:
    1. తెగులు తట్టుకునే రకాలైన ఎంటీయూ 9992, 1002, 1003, çసురక్ష భరణి వంటి రకాలను సాగు చేయాలి.
    2. పంట కోసిన తర్వాత దుబ్బులను నాశనం చేయాలి.
    3. వరి పిలకలు, పడి మొలిచే మొక్కలను నాశనం చేయాలి.
    4. తెగులు వ్యాప్తి చేసే పచ్చదీపపు పురుగుల నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోప్యూరాన్‌ గుళికలను వేయాలి. లేదా లీటరు నీటికి 2.2 మి.లీ., మోనోక్రోటోఫాస్‌ లేదా 1.5 మి.లీ. ఇథోఫెన్‌ఫాస్‌ కలిపి పిచికారి చేయాలి.
    5. తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement