ఇదోరకం ఆదర్శం | Conducting unauthorized belt shops | Sakshi
Sakshi News home page

ఇదోరకం ఆదర్శం

Published Mon, Aug 18 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

Conducting unauthorized belt shops

టేక్మాల్: చాలా గ్రామాలు మద్యాన్ని నిషేదిస్తూ ఆదర్శంగా నిలుస్తాయి. కానీ అందుకు విరుద్ధంగా నిబంధనలను బేఖాతర్ చేస్తూ గ్రామాల్లో బెల్ట్‌షాపులు నిర్వహించుకునేందుకు ఏకంగా వేలం పాటలు నిర్వహిస్తున్నాయి టేక్మాల్ మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలు. ఏకంగా పంచాయతీనే తీర్మానం చేసి గ్రామంలో బెల్ట్‌షాపులు నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాయి. దీంతో గ్రామ పంచాయతీ ఖజానాకు నాలుగు పైసలు వస్తున్నా, ప్రజలు మాత్రం రోజు తప్పతాగి ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. రోజంతా చేసిన కష్టం మద్యం దుకాణానికి చేరుతుండడంతో మహిళలు లబోదిబోమంటున్నారు.
 
పల్లెకో బెల్ట్‌షాప్..!
ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైనా మద్యం షాపులు రానురానూ పల్లెల్లోకి చొచ్చుకు వచ్చాయి. దీంతో ప్రభుత్వం పట్టణ కేంద్రాల్లో వైన్స్‌లకు టెండర్లు వేసి మద్యం విక్రయాల నిర్వహణ చూస్తోంది. అయితే ఈ లెసైన్స్‌ల ఫీజు కోట్ల రూపాయల మేరకు చేరుకోవడంతో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు పల్లెల్లో అనధికారికంగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తూ పల్లె జనాన్ని మత్తులో ముంచేస్తున్నారు. ఈ పరిస్థితి చేయిదాటడంతో ప్రభుత్వమే బెల్ట్‌షాపులకు అడ్డుకట్ట వేసింది. గ్రామాల్లో ఎవరైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే దాడులు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. అయితే బెల్ట్‌షాపుల నిర్వహణ గురించి గ్రామస్తులెవరైనా సమాచారం ఇస్తేనే సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే వైన్స్‌షాపుల యజమానులు కొత్త తరహా దందాకు తెరతీశారు.
 
పైసలు ఆశచూపి..
గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణ కష్టం కావడంతో వైన్స్‌షాపుల యజమానులు పంచాయతీకి పైసల గాలం వేశారు. వేలం పాటలు నిర్వహిస్తే సొమ్ము కట్టి బెల్ట్‌షాపులు నిర్వహించుకుంటామని వెల్లడించారు. అయితే జిల్లాలోని చాలా గ్రామాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, టేక్మాల్ మండలంలో కోరంపల్లి, పల్వంచ, ఎల్లుపేట గ్రామాల్లో మాత్రం పంచాయతీ సభ్యులు ఈ పద్ధతి మహ భేషుగ్గా ఉందంటూ సంబరపడిపోయారు. వేలం పాటలో బెల్ట్‌షాపును దక్కించుకున్న వారు యథేచ్ఛగా విక్రయాలు చేసుకోవచ్చంటూ వెంటనే గ్రామ పంచాయతీ తీర్మానం చేసేశారు. ఈ ఒప్పందం ఏడాది కాలం అమలులో ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ వేలం పాటలు నిర్వహిస్తామని వెల్లడించారు.
 
ప్రస్తుతం పై మూడు గ్రామాల్లో ఏడాదికి ఒకసారి వేలం పాటలు గ్రామ పంచాయతీల్లోనే జరుగుతున్నాయి. ఇటీవల పల్వంచ గ్రామంలో  రూ.70 వేలు, ఎల్లుపేటలో  రూ.70 వేలు, కోరంపల్లిలో రూ.18 వేలతో వేలం పాటలు జరిపారు. సొంత చేసుకున్న వ్యక్తులు ఆయా గ్రామాల్లో మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇతర వ్యక్తులు గ్రామంలో మద్యం అమ్మకాలు జరిపితే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. పంచాయతీ తీర్మానం ఇవ్వడంపై మహిళలంతా మండిపడుతున్నారు.

స్థానికంగానే మద్యం మస్తుగా దొరుకుతుండడంతో మగాళ్లంతా మద్యానికి అలవాటు పడుతున్నారని, దీంతో  తమ కష్టమంతా మద్యం దుకాణాల్లో చేరుతోందని, అప్పులు పెరిగి ఇళ్లు గుల్లవుతోందని వారు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా సాగుతున్న ఈ వేలం పాటలకు ప్రజాప్రతినిధులు కూడా వంతపాడడం అన్యాయంగా ఉందని వారు వాపోతున్నారు.  మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఇకనైనా కళ్లు తెరచి గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యానికి అడ్డుకట్ట వేయాలని మహిళలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement