ప్రహరీ లేని బొడ్మట్‌పల్లిలో పాఠశాల
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు
- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
- పట్టించుకోని అధికారులు
టేక్మాల్: పాఠశాలల అభివృద్ధిని ప్రభుత్వం విస్మరిస్తోంది. పాఠశాలల్లోత సరైన వసతులు కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కనీసం పాఠశాలల చుట్టూ ప్రహరీలను నిర్మించలేకపోతోంది ప్రభుత్వం. టేక్మాల్ మండలంలో 50 శాతం కంటే ఎక్కువ ప్రహరీలు లేని పాఠశాలలున్నాయి.
రహదారుల పక్కన గల పాఠశాలల్లో పిల్లలకు ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు, పచ్చని చెట్లు మచ్చుకైనా కనిపించడం లేదు. మొక్కలు పెంచుదామన్నా... ప్రహరీలు లేకపోవడంతో సాధ్యం కావడం లేదు.
టేక్మాల్ మండలంలో 18 పంచాయతీలకుగాను 42 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో సగానికిపైగా పాఠశాలలకు ప్రహరీలు లేవు. మండలంలోని ఎల్లుపేట, తంప్లూర్, బొడ్మట్‌పల్లి, ధనూర ఉన్నత పాఠశాలలు, బొడగట్, కాద్లూర్, వెంకటాపూర్, కమ్మరికత్త, అచ్చన్నపల్లి, దాదాయిపల్లి ప్రాథమిక పాఠశాలలకు ప్రహరీలు లేవు.
పాఠశాలల ఆవరణలో పందులు, పశువులు స్వైర విహారం చేస్తున్నాయి. పరిసరాలలను అపరిశుభ్రంగా చేస్తున్నాయి. దుర్గంధం వెదజల్లుతున్నాయి. దుర్వాసనను భరించలేకపోతున్నారు. విద్యార్థులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. తంప్లూర్, ఎల్లుపేట పాఠశాలలు రోడ్డుపైనే ఉండటంతో వాహనాల శబ్ధంతో విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతోంది.
రోడ్డుపై నడుస్తున్నప్పుడు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలకు మైదానాలు కూడా సరిగ్గా లేవు. ఫలిలతంగా విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. ఉన్న మైదానాల్లో పూర్తిగా కంకర, రాళ్లు తేలడంతో ఆటలు ఆడలేకపోతున్నారు. పొలాల్లో క్రీడలు ఆడాల్సిన దుస్థితి నెలకొంటోంది.
కనిపించని పచ్చదనం
ప్రహరీలు లేకపోవడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పచ్చదనం కనిపించడం లేదు. మొక్కలు పెంచుతున్నా... వాటికి రక్షణ లేకపోవడంతో పెరగలేకపోతున్నాయి. పశువులు, గొర్రెలు, మేకలు పాఠశాలల్లోకి వచ్చి మొక్కలను తింటున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో సెలవురోజులు, వర్షాకాలంలో పాఠశాలలు పశువులు, పందులకు ఆవాసంగా మారుతున్నాయి.
ప్రహరీలుంటే మొక్కలకు పెంచి ఆహ్లదకరమైన వాతావరణాన్ని కల్పించడానికి వీలుంటుందని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాలలకు ప్రహరీలు నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.