సేమ్ టు సేమ్ 2014 మరియు 1947
1947లో దేశానికి స్వాతంత్య్రం..
ఆంగ్లేయుల ముష్కర పాలనకు చరమగీతం పలికింది 1947 సంవత్సరంలోనే. భారతీయులను బానిసలుగా మార్చిన బ్రిటిష్‌వారు దేశంలో దుష్టపాలన సాగించారు. భారతీయులకు హక్కులనేవే లేకుండా చేశారు. చట్టాలను కాలరాశారు. ఎదిరించి ప్రశ్నించిన వారిని పొట్టన పెట్టుకున్నారు. వారి నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలనే సంకల్పంతో పుట్టిందే 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది విఫలమైనా, దేశంలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది.
ఆ తర్వాత మహాత్మాగాంధీ, నెహ్రూ, వల్లాభాయ్‌పటేల్, సుభాష్‌చంద్రబోస్, భగత్‌సింగ్, అల్లూరి సీతారామరాజు, ఆజాద్ చంద్రశేఖర్.. ఇలా ఎందరో సమరయోధులు స్వాతంత్య్రం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఆంగ్లేయుల దాస్యశృంఖాల నుంచి భరతమాతను విడిపించేందుకు ప్రాణాలకు తెగించి పోరాడారు. వారి సుదీర్ఘ పోరాటానికి దిగివచ్చిన ఆంగ్లేయులు.. 1947 ఆగస్టు 14న అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్రం ప్రకటించి పెట్టేబేడా సర్దుకున్నారు. అలా ఆ సంవత్సరానికి దేశ చరిత్రలో ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
రెండు ఉద్యమాల్లోనూ పాల్గొన్నా
అప్పుడు స్వాతంత్య్ర పోరాటంలో.. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. 1947, 2014 క్యాలెండర్లు ఒకేలా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకనేమో అనుకున్నా. కానీ నన్ను నడిపిస్తున్న తెలంగాణ ఊపిరే నన్ను బతికించింది. నా 21వ ఏట దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తే నా 88వ ఏట ప్రత్యేక తెలంగాణ కల సాకారం కాబోతోంది.
- తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి
‘క్యా’లెండర్ హై...
2014 క్యాలెండర్‌ను చూసి అందరూ ‘క్యా’లెండర్ హై అని ఆశ్చర్యపోతున్నారు. అచ్చం1947 నాటి క్యాలెండర్‌ను పోలి ఉన్న 2014 సంవత్సరంలోని తేదీలు, వారాలు చూసి సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ప్రతి ఏడాది కొత్తగా పలకరించే కొత్త సంవత్సర ఆరంభం ఈసారి గతాన్ని గుర్తు చేస్తూ ముందుకొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన సంవత్సరం క్యాలెండరే 2014లోనూ పలకరించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు.
2014లో తెలంగాణకు..!
1947లో దేశానికి విముక్తి లభిస్తే 2014లో తెలంగాణకు విమోచనం లభించనుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ప్రాంత ప్రజలు మరో స్వాతంత్య్ర సమరం సాగించారు. ప్రత్యేక తెలంగాణ కోసం నిర్విరామ కృషిచేశారు. స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకుని ముందుడి పోరాడారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అసువులు బాశారు. ఆ తర్వాత స్తబ్దుగా ఉండిపోయిన తెలంగాణ ఆకాంక్ష టీఆర్ఎస్ ఆవిర్భావం మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడింది. ఊరువాడా ఏకమై తెలంగాణ కావాలంటూ గొంతెత్తి నినదించాయి.
ఎందరో విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్నారు. ఉధృతంగా సాగుతున్న ఉద్యమాలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. సీడబ్ల్యూసీ, కేంద్ర కేబినెట్లో ఈ మేరకు తీర్మానం చేయించింది. రాష్ట్రపతికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లును పంపించింది. రాష్ట్రపతి దానిని శాసనసభకు పంపించారు. ప్రస్తుతం అది అక్కడే ఉంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన వెంటనే.. రాష్ట్రం ఏర్పాటుకానుంది. ఇందుకు కొత్త సంవత్సరమే వేదిక అవబోతోంది. ఆరునూరైనా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబోతోందని తెలంగాణవాదులు గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టిన 1947 సంవత్సరం లాగే 2014 కూడా తెలంగాణ చరిత్రలో నిలిచిపోనుంది.