Telangana Electricity Distribution
-
న్యూఇయర్‌లో పవర్ షాక్..!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లోటు ఏటేటా పెరిగిపోతుండటంతో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు చార్జీల పెంపును ప్రతిపాదించనున్నాయి. జనవరి 25తో మునిసిపల్ ఎన్నికలు ముగియనుండగా, 31న ఈఆర్సీకి డిస్కంలు తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో భాగంగా ఈ పెంపు ప్రతిపాదనలను సమర్పించనున్నాయి. రాష్ట్రంలో గత మూడేళ్లుగా విద్యుత్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. 2019–20 ముగిసే నాటికి డిస్కంల ఆర్థిక లోటు రూ. 11,000 కోట్లకు చేరనుందని, బడ్జెట్లో ప్రభుత్వం కేటా యించిన రూ.6,079 కోట్ల విద్యుత్ రాయితీలు పోగా మొత్తం రూ.5,000 కోట్ల ఆర్థిక లోటు మిగలనుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ సబ్సిడీలు తీసేసినా, 2020–21లో ఆర్థిక లోటు రూ. 6,000 కోట్లకు చేరనుందని అధికారవర్గాలు అంచనా వేశాయి. అన్ని రకాల కేటగిరీలపై ప్రభావం... చార్జీల పెంపు ద్వారా సుమారు రూ.1000 కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని డిస్కంలు భావిస్తున్నాయి. దీంతో గృహ, వాణిజ్య తదితర అన్ని కేటగిరీలపై వినియోగదారులపై మోస్తారుగా విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం పడనుంది. నెలకు 100–200 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి, 300 యూనిట్లపైగా వినియోగించే ఎగువ తరగతి కుటుంబాలపై చార్జీల పెంపు ప్రభావం చూపే చాన్సుంది. పారిశ్రామిక కేటగిరీ చార్జీలను స్వల్పంగా పెంచే అవకాశాలున్నాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి 2020–21కి సంబంధించిన టారీఫ్ ఉత్తర్వులను జారీ చేయనుంది. దీంతో 2020 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో చార్జీల పెంపు అమల్లోకి రానుంది. -
నెలకో బిల్లు గుండె గుబిల్లు
సాక్షి, హైదరాబాద్: ఇలా చాలా మంది వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మీటర్ చూడకుండానే బిల్లు వేయడం లేదా రోజులు పెంచి బిల్లు తీసి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారుడు ఖర్చు చేయని విద్యుత్‌కు కూడా ముందే బిల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జాప్యంతో మారుతున్న స్లాబ్‌రేట్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44,60,150 పైగా గృహ, 6,95,803పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతినెలా నిర్దిష్ట తేదీకే (30 రోజులకు) మీటర్ రీడింగ్ నమోదు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణాలోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండుమూడు రోజులు ఆలస్యంగా మీటర్ రీడింగ్ నమోదు చేస్తు న్నారు. స్లాబ్‌రేట్ మారిపోయి విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో జారీ అవుతుండటంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. కాగా, విద్యుత్ చౌర్యం, లైన్‌లాస్, ఇతర నష్టాలను నెలవారి బిల్లులు చెల్లించే వినియోగదారులపై రుద్దుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్లాబ్‌రేట్ మార్చి బిల్లులు రెట్టింపుస్థాయిలో జారీ చేసి వందశాతం రెవెన్యూ కలెక్షన్ నమోదైనట్లు రికార్డుల్లో చూపిస్తుండటం కొసమెరుపు. - సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీకి చెందిన ముచ్చా విజయకి సంబంధించిన గృహ విద్యుత్ కనెక్షన్ నెలవారీ బిల్లును జూన్ 7న జారీ చేశారు. బిల్లుపై ఉన్న ప్రీవియస్ కాలంలో (జూన్) 30,649 యూనిట్లు రికార్డ్ కాగా... జూలై 7న కూడా 30,649 యూనిట్లే రికార్డయింది. నెలలో వాడిన మొత్తం యూనిట్ల సంఖ్య జీరోగా చూపించి, మినిమం బిల్లు రూ.175 వేశారు. - ఇక ఆగస్టు 7న అదే సర్వీసు నంబర్‌పై మీటర్ రీడింగ్ తీసి, బిల్లు జారీ చేశారు. ప్రీవియస్, ప్రజెంట్ రీడింగ్‌లో మార్పు లేదు. కానీ 206 యూనిట్లు వాడినట్లు చూపించి, రూ.1,116 బిల్లు వేశారు. విజయకి అనుమానం వచ్చి మీటర్‌ను పరిశీలిస్తే.. అసలు విషయం బయటపడింది. మీటర్లో ప్రస్తుతం 30,507 యూనిట్లు మాత్రమే నమోదైనట్లు ఉంది. - ఇక ఇబ్రహీంపట్నంలో సరస్వతికి సంబంధించి బిల్లులో అన్నీ తప్పులే. ప్రీవియస్ బిల్లు 8419 ఉంటే, ప్రజెంట్ బిల్లు 91 గా చూపించారు. అలాగే 34 రోజులకు బిల్లు తీసి వంద యూనిట్లు దాటేలా చేశారు. దీంతో స్లాబ్ మారి బిల్లు అమాంతం పెరిగింది. -
ఇక 5 నిమిషాల్లోనే కరెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం ‘డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్’ ప్రాజెక్టుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) శ్రీకారం చుట్టబోతోంది. దీంతో సాంకేతిక సమస్యలతో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే.. రిమోట్ సాయంతో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే కరెంట్ ఆటోమేటిక్‌గా రానుంది. రాష్ట్రంలోని పారిశ్రామికవాడలు, పారిశ్రామిక పార్కులకు నిరంతర విద్యుత్ అందించేందుకు త్వరలో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు. భవిష్యత్‌లో జీహెచ్ఎంసీతోపాటు అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరింపజేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 28 పారిశ్రామిక ప్రాంతాలు, 94 పారిశ్రామిక వాడల్లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు పనుల కోసం కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తూ సంస్థ యాజమాన్యం తాజాగా టెండర్లను ఆహ్వానించింది. రూ.280 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కానుంది. తర్వాత ఏడాదిలోపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. రిమోట్ నొక్కితే కరెంట్ ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయికి చేరుకుని సమస్యను గుర్తించి మరమ్మతులు జరిపి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం గంటల సమయం పడుతోంది. ఇలా సిబ్బంది ద్వారా (మాన్యువల్‌గా) మరమ్మతులు చేసే వరకు వేచి చూడకుండా.. స్కాడా(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్) కార్యాలయం నుంచి రిమోట్ సాయంతో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడిన ఫీడర్‌కు మరమ్మతులు చేయనున్నారు. ప్రైవేటు డిస్కంల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై నగరాల్లోనే మాత్రమే ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ సదుపాయం ఉంది. ప్రాజెక్టు పట్టాలెక్కితే ఐదో నగరంగా హైదరాబాద్ చరిత్రకెక్కబోతోంది. హైదరాబాద్(నార్త్), సైబరాబాద్, హబ్సిగూడ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ విద్యుత్ సర్కిల్ కార్యాలయాల పరిధిలోని 127 సబ్స్టేషన్లు, 451 ఫీడర్లు, 13,530 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ) కింద 100 మార్కుల కోసం వివిధ సంస్కరణలను అమలు చేయాల్సి ఉండగా.. పారిశ్రామిక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ సదుపాయం కల్పించడం ద్వారా భవిష్యత్‌లో రాష్ట్రం రెండు మార్కులను పొందనుంది. -
రూ.1,231 కోట్ల లెక్కలేవీ..?
- తెలంగాణ డిస్కంల బడ్జెట్లో చూపలేదని ఏపీ జెన్కో అభ్యంతరం - బడ్జెట్లో చేర్చాలని టీఎస్ఈఆర్సీకి లేఖ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమకు చెల్లించాల్సిన రూ.1,231.35 కోట్ల బకాయిలను ఈ ఏడాది చెల్లిస్తామని పేర్కొంటూ 2017–18 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)లో ప్రతిపాదిం చకపోవడంపై ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్కో) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ జెన్కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు సంబంధించి 2014–15 నుంచి చెల్లించాల్సిన స్థిర చార్జీలు, ఉద్యోగుల పెన్షన్ బాండ్ల వడ్డీలు కలిపి రూ.1,231.35 కోట్లను డిస్కంల వార్షిక బడ్జెట్లో వ్యయం పద్దు కింద చేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)కి లేఖ రాసింది. డిస్కంల ఏఆర్‌ఆర్‌లపై టీఎస్ఈఆర్సీ నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించగా, ఏపీ జెన్కో ఈ మేరకు స్పందించి లేఖ రాయడం గమనార్హం. 2014–19 మధ్య కాలంలో ఏపీ జెన్కో విద్యుత్ టారీఫ్‌ను ఏపీఈఆర్సీ 2016 మార్చి 26న ఖరారు చేయగా, ఇందులో పెన్షన్ల వ్యయం మినహా మిగిలిన టారీఫ్ వ్యయాన్ని గతేడాదే టీఎస్ఈఆర్సీ ఆమోదించింది. ఈ ఏడాది తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్కో ప్లాంట్ల పెన్షన్ల వ్యయాన్ని తమ వార్షిక బడ్జెట్లో చూపకపోవడంపై ఏపీ జెన్కో అభ్యంతరం తెలిపింది. తెలంగాణ డిస్కంలు 2014–15 నుంచి 2016 సెప్టెంబర్ వరకు రూ.1,733.52 కోట్ల స్థిర చార్జీలు చెల్లించాల్సి ఉండగా, అందులో రూ.283.01 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఈ కాలానికి సంబంధించిన పెన్షన్ల బకాయిలు రూ.948.34 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. పశుగ్రాసం కోత యంత్రాలకు కమర్షియల్ చార్జీలొద్దు పశుగ్రాసం కోత యంత్రాలకు కమర్షియల్ విద్యుత్ చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ పశుసంవర్థక శాఖ అభ్యంతరం తెలిపింది. కమర్షియల్ టారీ ఫ్ కేటగిరీలో యూనిట్‌కు రూ.4 చొప్పున గడ్డి కోత యంత్రాలకు చార్జీలు విధి స్తుండడంతో పాడి రైతులపై భారం పడుతోందని ఈఆర్సీకి లేఖ రాసింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ కేటగిరీ–5 కిందికి పశుగ్రాసం యంత్రాల కనెక్షన్లను మార్చడంతో పాడి రైతులపై విద్యుత్ చార్జీల భారం ఉండదని చెప్పింది. వారు నెలకు రూ.30 మాత్రమే నిర్వహణ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.