- తెలంగాణ డిస్కంల బడ్జెట్‌లో చూపలేదని ఏపీ జెన్‌కో అభ్యంతరం
- బడ్జెట్‌లో చేర్చాలని టీఎస్‌ఈఆర్సీకి లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు తమకు చెల్లించాల్సిన రూ.1,231.35 కోట్ల బకాయిలను ఈ ఏడాది చెల్లిస్తామని పేర్కొంటూ 2017–18 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)లో ప్రతిపాదిం చకపోవడంపై ఏపీ విద్యుదుత్పత్తి సంస్థ (ఏపీ జెన్‌కో) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ జెన్‌కో విద్యుత్ ప్లాంట్ల నుంచి తెలంగాణ డిస్కంలు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు సంబంధించి 2014–15 నుంచి చెల్లించాల్సిన స్థిర చార్జీలు, ఉద్యోగుల పెన్షన్ బాండ్ల వడ్డీలు కలిపి రూ.1,231.35 కోట్లను డిస్కంల వార్షిక బడ్జెట్‌లో వ్యయం పద్దు కింద చేర్చాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ)కి లేఖ రాసింది.
డిస్కంల ఏఆర్‌ఆర్‌లపై టీఎస్‌ఈఆర్సీ నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలను ఆహ్వానించగా, ఏపీ జెన్‌కో ఈ మేరకు స్పందించి లేఖ రాయడం గమనార్హం. 2014–19 మధ్య కాలంలో ఏపీ జెన్‌కో విద్యుత్ టారీఫ్‌ను ఏపీఈఆర్సీ 2016 మార్చి 26న ఖరారు చేయగా, ఇందులో పెన్షన్ల వ్యయం మినహా మిగిలిన టారీఫ్ వ్యయాన్ని గతేడాదే టీఎస్‌ఈఆర్సీ ఆమోదించింది. ఈ ఏడాది తెలంగాణ డిస్కంలు ఏపీ జెన్‌కో ప్లాంట్ల పెన్షన్ల వ్యయాన్ని తమ వార్షిక బడ్జెట్‌లో చూపకపోవడంపై ఏపీ జెన్‌కో అభ్యంతరం తెలిపింది. తెలంగాణ డిస్కంలు 2014–15 నుంచి 2016 సెప్టెంబర్ వరకు రూ.1,733.52 కోట్ల స్థిర చార్జీలు చెల్లించాల్సి ఉండగా, అందులో రూ.283.01 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపింది. ఈ కాలానికి సంబంధించిన పెన్షన్ల బకాయిలు రూ.948.34 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది.
పశుగ్రాసం కోత యంత్రాలకు కమర్షియల్ చార్జీలొద్దు
పశుగ్రాసం కోత యంత్రాలకు కమర్షియల్ విద్యుత్ చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ పశుసంవర్థక శాఖ అభ్యంతరం తెలిపింది. కమర్షియల్ టారీ ఫ్ కేటగిరీలో యూనిట్‌కు రూ.4 చొప్పున గడ్డి కోత యంత్రాలకు చార్జీలు విధి స్తుండడంతో పాడి రైతులపై భారం పడుతోందని ఈఆర్సీకి లేఖ రాసింది. ఉచిత వ్యవసాయ విద్యుత్ కేటగిరీ–5 కిందికి పశుగ్రాసం యంత్రాల కనెక్షన్లను మార్చడంతో పాడి రైతులపై విద్యుత్ చార్జీల భారం ఉండదని చెప్పింది. వారు నెలకు రూ.30 మాత్రమే నిర్వహణ చార్జీలు చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.
రూ.1,231 కోట్ల లెక్కలేవీ..?
Published Sun, May 21 2017 12:09 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
Advertisement
Advertisement