సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ రంగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా కోసం ‘డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్’ ప్రాజెక్టుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) శ్రీకారం చుట్టబోతోంది. దీంతో సాంకేతిక సమస్యలతో ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే.. రిమోట్ సాయంతో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే కరెంట్ ఆటోమేటిక్‌గా రానుంది. రాష్ట్రంలోని పారిశ్రామికవాడలు, పారిశ్రామిక పార్కులకు నిరంతర విద్యుత్ అందించేందుకు త్వరలో ఈ ప్రాజెక్టు చేపట్టబోతున్నారు.
భవిష్యత్‌లో జీహెచ్‌ఎంసీతోపాటు అన్ని జిల్లా కేంద్రాలకు విస్తరింపజేయాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ భావిస్తోంది. జీహెచ్‌ఎంసీతోపాటు రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 28 పారిశ్రామిక ప్రాంతాలు, 94 పారిశ్రామిక వాడల్లో డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ ప్రాజెక్టు పనుల కోసం కాంట్రాక్టర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను ఆహ్వానిస్తూ సంస్థ యాజమాన్యం తాజాగా టెండర్లను ఆహ్వానించింది. రూ.280 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మూడు నెలల్లో పూర్తి కానుంది. తర్వాత ఏడాదిలోపు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు.
రిమోట్ నొక్కితే కరెంట్
ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే విద్యుత్ సిబ్బంది క్షేత్ర స్థాయికి చేరుకుని సమస్యను గుర్తించి మరమ్మతులు జరిపి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం గంటల సమయం పడుతోంది. ఇలా సిబ్బంది ద్వారా (మాన్యువల్‌గా) మరమ్మతులు చేసే వరకు వేచి చూడకుండా.. స్కాడా(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డాటా అక్విజిషన్) కార్యాలయం నుంచి రిమోట్ సాయంతో ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా వెంటనే కరెంట్ సరఫరాను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ప్రత్యామ్నాయ ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించిన తర్వాత సాంకేతిక సమస్య ఏర్పడిన ఫీడర్‌కు మరమ్మతులు చేయనున్నారు.
ప్రైవేటు డిస్కంల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతున్న ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్, ముంబై నగరాల్లోనే మాత్రమే ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ సదుపాయం ఉంది. ప్రాజెక్టు పట్టాలెక్కితే ఐదో నగరంగా హైదరాబాద్ చరిత్రకెక్కబోతోంది. హైదరాబాద్(నార్త్), సైబరాబాద్, హబ్సిగూడ, మేడ్చల్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ విద్యుత్ సర్కిల్ కార్యాలయాల పరిధిలోని 127 సబ్‌స్టేషన్లు, 451 ఫీడర్లు, 13,530 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ) కింద 100 మార్కుల కోసం వివిధ సంస్కరణలను అమలు చేయాల్సి ఉండగా.. పారిశ్రామిక ప్రాంతాలకు డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ సదుపాయం కల్పించడం ద్వారా భవిష్యత్‌లో రాష్ట్రం రెండు మార్కులను పొందనుంది.
ఇక 5 నిమిషాల్లోనే కరెంట్!
Published Mon, Jan 1 2018 3:04 AM | Last Updated on Mon, Jan 1 2018 3:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment