భాగ్యనగరికి బతుకమ్మ కళ
- జీహెచ్‌ఎంసీ ముమ్మర ఏర్పాట్లు
- రూ.45 లక్షలతో విద్యుద్దీపాలు
- 18 సర్కిళ్లలో చెరువుల వద్ద ఆటపాటల వేదికలు
భాగ్యనగరం బతుకమ్మ పండుగకు ముస్తాబవుతోంది. ఎన్నో వన్నెల పూలు... హరివిల్లును మరిపించే విద్యుద్దీపాల తోరణాలు... జలాశయాల వద్ద ఆటపాటల వేదికలు... ఇలా విభిన్న రూపాల్లో రాష్ట్ర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా వస్తున్న బతుకమ్మ పండుగను మరచిపోలేని విధంగా జరుపుకునేందకు వివిధ వర్గాల ప్రజలూ ఎదురు చూస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్ణయించిన తరువాత వస్తున్న తొలి బతుకమ్మ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించేం దుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఎల్‌బీనగర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు రహదారుల మరమ్మతులు సహా వివిధ ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 సర్కిళ్లల్లో చెరువుల వద్ద బతుకమ్మ ఆటలకు, బతుకమ్మల నిమజ్జనానికి సదుపాయాలు కల్పిస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పైనున్న రోటరీ పార్కు వద్ద దాదాపు రూ.35 లక్షలతో శాశ్వత ఘాట్ పనులు వడివడిగా చేస్తున్నారు.
విద్యుత్ తోరణాలు
అన్ని ప్రధాన మార్గాల్లోనూ రంగురంగుల విద్యుల్లతలను తోరణాలుగా అమర్చనున్నారు. చెరువుల వద్ద తాత్కాలిక లైట్లతో పాటు రంగుల విద్యుద్దీపాల ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ చర్యలు తీసుకుంటున్నారు. దీనికి దాదాపు రూ.45 లక్షలు ఖర్చు కాగలవని అంచనా వేశారు. నెక్లెస్ రోడ్డు మార్గం, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్‌లతో సహా వివిధ జంక్షన్లలో 5-9 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మలను ఈ నెల 24 నుంచి తొమ్మిది రోజుల పాటు ప్రదర్శించనున్నారు. ఏయే జంక్షన్లలో ఎలాంటి బతుకమ్మలను ఉంచాలో ఆలోచిస్తున్నారు. వివిధ డిజైన్లు, రకరకాల పూలతో కూడిన బతుకమ్మలను పరిశీలిస్తున్నారు.
ఏరోజుకారోజు తాజా పూలతో వీటి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బతుకమ్మల తయారీకి పలువురు ముందుకు వస్తుండటంతో వారి నమూనాలను కమిషనర్ పరిశీలిస్తున్నారు. ప్రధాన మార్గాల మధ్యలోనూ రంగురంగుల విద్యుల్లతలను ఏర్పాటు చేయనున్నారు. రహదారుల ప్యాచ్‌వర్క్‌లు, ఫుట్‌పాత్‌ల మరమ్మతులు తదితర పనులు చేస్తున్నారు.
చెరువుల వద్ద...
కాప్రా చెరువు, నల్ల చెరువు, సరూర్‌నగర్ చెరువులతో పాటు పాతబస్తీలోని గంగం బావి, దోబీఘాట్, ఎర్రకుంట, ఫలక్‌నుమా, చార్మినార్, బేగంబజార్, పల్లెచెరువు, లక్ష్మీగూడ చెరువు, మీర్ అలం ట్యాంక్, లంగర్ హౌస్ చెరువు, గుడిమల్కాపూర్ గుడి, బతుకమ్మకుంట, కృష్ణకాంత్ పార్క్, శ్యామలకుంట పార్కు, మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువు, హఫీజ్‌పేట చెరువు, ప్రకాశ్‌నగర్ చెరువు, మదీనగూడ, ఇజ్జత్‌నగర్, గంగారం చెరువులు, దీప్తిశ్రీ నగర్, మియాపూర్ చెరువులు, సాకి చెరువు, రాయసముద్రం చెరువు, హయత్‌నగర్, డీఎల్ చెరువు, వివేక్‌నగర్, అప్రోచ్ రోడ్డు నుంచి హస్మత్‌పేట చెరువు, వెస్ట్‌జోన్ పరిధిలోని రామాలయం రోడ్డు, హనుమాన్‌గుడి, శివాలయం అప్రోచ్ రోడ్లు, ఆల్విన్ కాలనీ ఫేజ్-1, సూరారం చెరువు, వెన్నెలగట్టు, అల్వాల్, మల్కాజిగిరి, సఫిల్‌గూడ చెరువులు, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.45 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లో వీధి దీపాలతో పాటు పారిశుద్ధ్యం తదితర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ పనుల టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు.
కార్యాలయాల్లో ఆటపాటలు
బతుకమ్మ ఆడే రోజుల్లో మహిళా ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సెలవు ప్రకటించనున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్, ఇతర కార్యాలయాల్లో సందడి కనిపించనుంది.
ర్యాలీకి ఏర్పాట్లు...
అక్టోబర్ 2నఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు బతుకమ్మలతో మహిళల భారీ ర్యాలీ నిర్వహణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో 25వేల నుంచి 30 వేలమంది సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల మహిళలను భాగస్వాములను చేయనున్నారు. వారికి అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మలకు అవసరమైన పూల కోసం ఒక్కొక్కరికి రూ.50 వంతున ఇవ్వాలని యోచిస్తున్నారు.
దళితులకు దూరం చేయవద్దు
విమలక్క
నాంపల్లి: బహుజన బతుకమ్మతోనే నవ తెలంగాణ సాధ్యమని అరుణోదయ సాంస్కృతిక మండలి అధ్యక్షురాలు విమలక్క అన్నారు. దళితులకు ఈ పండుగను దూరం చేయవద్దని కోరారు. నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ నివారం ‘బహుజన బతుకమ్మ’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాహాజరైన ఆమె మాట్లాడుతూ నీళ్లు, నిధులు, సంస్కృతి, పర్యవరణాన్ని కాపాడుకోవాలంటే బతుకమ్మను రక్షించుకోవాలని అన్నారు. అగ్రవర్ణాలతో పాటుగా వెనుకబడిన, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కలిసిమెలిసి పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీన్ని ఉత్సవంగా కాకుండా ఉద్యమంగా చేసుకోవాలని కోరారు. అలాగైతేనే నవ తెలంగాణ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామన్నది ముఖ్యం కాదని.... అందరూ ఐక్యంగా బహుజన బతుకమ్మను చేసుకోవడమే ముఖ్యమని విమలక్క స్పష్టం చేశారు. దళితులకు బతుకమ్మకు దూరం చేయవద్దని హితవు పలికారు. వనరులు అందరికీ దక్కాలని, బతుకమ్మ అందరికీకావాలని ఆకాంక్షిం చారు. పంచ భూతాలను నమ్ముకునే వారు బహుజనులు... అమ్ముకునే వారు బహుళ జాతి కంపెనీలు అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.