నగరం... పూలవనం
మహా నగరం పూలవనంగా మారింది. బతుకమ్మలతో మెరిసింది. మహిళల ఆట పాటలతో మురిసింది. సాగర్‌తీరంలో భక్తిభావం వెల్లివిరిసింది. అంతటా ఉత్సాహం వెల్లువెత్తింది. బాణసంచా వెలుగులతో ట్యాంక్‌బండ్ కొత్త సొగసులు సంతరించుకుంది.
సిటీబ్యూరో: బతుకమ్మ వేడుకల్లో స్వయం సహాయక మహిళా బృందాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. జీహెచ్‌ఎంసీ 18 సర్కిళ్లకు చెందిన స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు పదివేల మంది మహిళలు మధ్యాహ్నానికి ఎల్‌బీ స్టేడియానికి చేరుకున్నారు. ఒంటి గంట నుంచి స్టేడియంలో బతుకమ్మలను పేర్చే పనిలో నిమగ్నమయ్యారు. తెలంగాణ పది జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో కలిసి సాయంత్రం ర్యాలీగా ట్యాంక్‌బండ్ వైపు బయలుదేరారు. రెండేసి సర్కిళ్ల వారు ఒక్కో జిల్లా బృందంతో కలిశారు. తమ సర్కిళ్ల పేర్లు, జీహెచ్‌ఎంసీ లోగోలతో కూడిన బ్యానర్లతో వీరు ఆకట్టుకున్నారు.
జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు...
ఎల్‌బీ స్టేడియం నుంచి ట్యాంక్‌బండ్ వరకు ఎప్పటికప్పుడు చెత్త, వ్యర్థాలు లేకుండా అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు. పురుషులు, మహిళలు నడిచేందుకు వేర్వేరుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన 30 అడుగుల పెద్ద బతుకమ్మ ప్రత్యేకంగా నిలిచింది. దీని కోసం తంగేడు, గునుగు, బంతి తదితర పూలను వినియోగించ డంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అక్కడే ఏర్పాటు చేసిన భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ట్యాంక్‌బండ్‌తో పాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న బతుకమ్మ ఉత్సవాలను ప్రత్యక్ష ప్రసారం చేశారు. బతుకమ్మ ఘాట్‌పై ఏర్పాటు చేసిన మంచినీటి కొలనులో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దాంతో కొలను పూలవనంలా మారింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, వివిధ విభాగాల అధికారులు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పరిస్థితులను పర్యవేక్షించారు. బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సోమేశ్‌కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అందరికీ కృతజ్ఞతలు: కమిషనర్
బతుకమ్మ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు, విద్యుత్, వాటర్ వర్క్స్, టూరిజం, సాంస్కృతిక శాఖాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎంతగానో శ్రమించారని కొనియాడారు. సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చి తో డ్పాటునందించిన స్వయం సహాయక మహిళల సేవలను ఆయన ప్రశంసిం చారు.